Shocking Incident: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన పదేళ్ల బాలుడు.. పాపం గంట పాటు నరకయాతన
దేశ రాజధాని ఢిల్లీకి శివారులోని గజియాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడు లిఫ్ట్‌లో చిక్కుకపోయాడు. లిఫ్ట్ డోర్స్ తెరుచుకోకపోవడంతో..
Shocking Incident: దేశ రాజధాని ఢిల్లీకి శివారులోని గజియాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడు లిఫ్ట్‌లో చిక్కుకపోయాడు. లిఫ్ట్ డోర్స్ తెరుచుకోకపోవడంతో దాదాపు గంట పాటు అందులో నుంచి ఎలా బయటపడాలో తెలియక నరకయాతన అనుభవించాడు. గజియాబాద్ రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని కేడబ్ల్యూ శ్రిష్టి సొసైటీలోని డీ టవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అదే భవనంలో ఉన్న తన స్నేహితులను కలిసేందుకు లిఫ్ట్‌లో వెళ్తున్న సమయంలో అది ఒక్కసారిగా ఆగిపోవడంతో ఎవాన్ అనే బాలుడు అందులో చిక్కుకపోయాడు. అరిచినా ఎవరూ రాకపోవడంతో భయంతో వణికిపోయాడు. సరిగ్గా గాలి రాకపోవడంతో తన బట్టలు తీసేశాడు. ఎట్టకేలకు అతి కష్టం మీద లిఫ్ట్ డోర్స్ తెరుచుకోవడంతో అందులో నుంచి బయటపడ్డాడు. ఈ మొత్తం వ్యవహారం లిఫ్ట్‌లోని సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.
లిఫ్ట్‌లో చిక్కుకుని దాదాపు గంట సమయం నరకయాతన అనుభవించిన ఎవాన్ తీవ్ర మానసిక షాక్‌కు గురైనట్లు అతని కుటుంబీకులు చెబుతున్నారు. లిఫ్ట్ ఎక్కేందుకే భయపడుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌లో ఎవాన్ తండ్రి గౌరవ్ శర్మ ఫిర్యాదు చేశారు. లిఫ్ట్ మెయింటెనెన్స్ చేస్తున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపిన పోలీసులు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
లిఫ్ట్ పనిచేయకపోవడంతో ఎవాన్ ఇంటర్‌కామ్, అలారమ్ ద్వారా ప్రయత్నించినా రెండూ పనిచేయలేదు. సీసీటీవీల ద్వారా లిఫ్ట్‌లో ఏం జరుగుతోందో పర్యవేక్షించాల్సిన సొసైటీ భద్రతా సిబ్బంది కూడా పూర్తిగా విఫలం చెందినట్లు ఎవాన్ తండ్రి ఆరోపించారు. లిఫ్ట్ నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నంలో ఎవాన్ చేతికి చాలా చోట్ల గాయాలైనట్లు ఆవేదన వ్యక్తంచేశారు.
Also Read..
Air Gun: రోడ్డు ప్రమాదం మృతుని వద్ద ఎయిర్ గన్.. ఉలిక్కిపడ్డ నిర్మల్ జిల్లా పోలీసులు!