Yanam Election: యానాం ఎన్నికల్లో దూసుకొచ్చిన యువ కెరటం..మూడంటే మూడు నెలల ప్రచారం..సీనియర్ నేతకు చుక్కలు చూపించిన వైనం
రాజకీయాలు అంటే మాటలు కాదు. ఎమ్మెల్యేగా పోటీ అంటే మామూలు విషయమూ కాదు. ప్రజల్లో నాయకుడిగా నిలబడగలగాలి. ప్రత్యర్ధి నేతల ఎదురుదాడిని తట్టుకోగలగాలి..

Yanam Election: రాజకీయాలు అంటే మాటలు కాదు. ఎమ్మెల్యేగా పోటీ అంటే మామూలు విషయమూ కాదు. ప్రజల్లో నాయకుడిగా నిలబడగలగాలి. ప్రత్యర్ధి నేతల ఎదురుదాడిని తట్టుకోగలగాలి.. అన్నిటినీ మించి తనకు ఉన్న ప్రజాదరణను ఓట్లుగా మలచుకునే శక్తి ఉండాలి. ఇన్ని ఉన్నా చివరికి.. ప్రత్యర్ధి పార్టీ వైపు గాలి వీచిందీ అంటే ఇంతే సంగతులు. కానీ, ఆ యువకుడు మూడంటే మూడు నెలల ప్రచారంతో రాజకీయ దురంధురులుతా పేరున్న వారిని ఎదుర్కుని నిలిచాడు. ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇది కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల కథ.
పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం స్వంతం చేసుకుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ పొరుగునే ఉన్న యానాం నియోజకవర్గంలో ఓ యువకుడి దెబ్బకు తట్టుకోలేకపోయింది. ఇక్కడ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎన్నార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.రంగాస్వామిని ఓడించి రాజకీయ ఆరంగేట్రంలోనే ఎమ్మెల్యేగా గెలిచాడు ఇండిపెండెంట్ అభ్యర్ధి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని మల్లాడి కృష్ణారావు ప్రకటించడంతో యానాంలో ఏర్పడిన రాజకీయ లోటును అవకాశంగా మలుచుకున్న శ్రీనివాస్ అశోక్ తెరపైకి వచ్చారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన విద్యావంతుడైన శ్రీనివాస్ అశోక్ ‘నమస్తే యానాం’ అంటూ ఈ ఏడాది జనవరిలో రాజకీయ ఆరంగేట్రం చేశారు. అన్ని గ్రామాల్లో తిరుగుతూ.. అక్కడవారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూ ప్రజలకు దగ్గరయ్యారు. ఆయన గెలుపునకు సోషల్ మీడియా కూడా ఉపయోగపడింది.
ఓట్ల లెక్కింపు ప్రారంభం అయినప్పటి నుంచీ ప్రతి రౌండ్ లోనూ అశోక్ లీడ్ లో కొనసాగుతూ వచ్చారు. చివరకు ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్ధి రంగస్వామికి 16,477 ఓట్ల రాగా.. స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్‌కు 17,132 ఓట్లు వచ్చాయి. ఒక దశలో రంగస్వామి 3వేలకుపైగా ఓట్లు వెనుకబడ్డారు. చివరికు 655 ఓట్లతో అశోక్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పేరుకు రంగస్వామి అభ్యర్ధి అయినా, ఆయనకు వెనుక వెన్నుదన్నుగా నిలిచింది మల్లాడి కృష్ణారావు. యానాం రాజకీయాల్లో తిరుగులేని నేతగా దశాబ్దాల నుంచి చక్రం తిప్పుతున్న మల్లడికి అశోక్ విజయం షాక్ అని చెప్పొచ్చు.
తమిళనేతను తెలుగు గడ్డపై పోటీకి నిలపడం పట్ల చాలామందిలో వ్యతిరేకతకు కారణమైంది. దీంతో యానాంలో సరైన వారెవరూ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే లేరా అంటూ ప్రత్యర్థులు చేసిన ప్రచారం ఫలించింది. మల్లాడికి మంచి పట్టున్న గ్రామాల్లోనూ అశోక్‌కు ఆధిక్యత రావడంతో రంగసామి ఓటమిపాలయ్యారు. కాగా, గెలుపు అనంతరం గొల్లపల్లి మాట్లాడుతూ.. ఎన్నికల్లో తన విజయం యానాం ప్రజలదేనని పేర్కొన్నారు. ప్రజలకు తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని, సామాజికంగా సమన్యాయం అన్న లక్ష్యానికి కట్టుబడి పనిచేస్తానని ఉద్ఘాటించారు.
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ డిప్లొమో చేసిన అశోక్ రాజకీయాలపట్ల ఆసక్తితో సేవాకార్యక్రమాలు ప్రారంభించారు. తన తండ్రి మద్దతుదారులు, సన్నిహితుల అండతో ఎన్నికల్లో పోటీచేసి సీఎం అభ్యర్థిపైనే గెలుపొందారు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తండ్రి గంగాధర ప్రతాప్ రాజకీయాల్లో చిరపరిచితులే. ఆయన అప్పట్లో అంటే 2000 సంవత్సరంలో యానాం నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేశారు. ఆ తరువాత 2001 లో మల్లాడి కృష్ణారావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈయన దురదృష్టవశాత్తూ 2004లో గుండెపోటుతో మరణించారు.
Also Read: By Elections: ఉప ఎన్నికలు ఎక్కడెక్కడ? ఎవరెవరు? దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉప ఎన్నికల ఫలితాలు..