Baba Ramdev: బాబా రామ్ దేవ్ పై సుప్రీంకోర్టు సీరియస్.. యోగా గురువంటే గౌరవం కాని అలా చెస్తే ఎలా..
ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇతర వైద్య వ్యవస్థలను ఎందుకు నిందిస్తున్నారని ప్రశ్నించింది. అల్లోపతి వైద్యం, వైద్యులపై బాబా రామ్ దేవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై..
Baba Ramdev: ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇతర వైద్య వ్యవస్థలను ఎందుకు నిందిస్తున్నారని ప్రశ్నించింది. అల్లోపతి వైద్యం, వైద్యులపై బాబా రామ్ దేవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధునిక వైద్యం, టీకాలకు వ్యతిరేకంగా బాబా రామ్‌దేవ్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈసందర్భంగా ఎన్వీ రమణ స్పందిస్తూ.. యోగాను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన మీరంటే ఎంతో గౌరవమని, అయితే ఇతర వ్యవస్థలను నిందించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మీరు అనుసరిస్తున్న విధానం గురించి మీరు గొప్పగా చెప్పుకోండి.. తప్పులేదు.. కాని ఇతర వైద్య వ్యవస్థలను ఎందుకు విమర్శించాలన్నారు.
రామ్ దేవ్ బాబా యోగాను ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారని.. ఆయన కార్యక్రమాలకు వెళ్లేవాళ్లమని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఏదైనా వైద్య విధానం అన్ని వ్యాధులను నయం చేస్తుందన్న గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. అల్లోపతి వైద్యంతో జీవితాంతం సమస్యలు ఉంటాయని.. ప్రజల్లో అపోహలు కలిగించేలా ఎన్నో వ్యాఖ్యలు చేశారని IMA తరపున న్యాయవాది తన వాదనలు వినిపించారు. అల్లోపతి వైద్య విధానం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి.. రావు అనే దాని జోలికి తాము వెళ్లబోమని.. ఇదే సమయంలో ఇతర వైద్య విధానాలను నిందించడం సరికాదని రామ్ దేవ్ బాబాను ఉద్దేశించి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. IMA దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించాలని కేంద్రప్రభుత్వానికి, పతంజలి సంస్థకు సుప్రీంకోర్టు నోటిసులు జారీ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..