త్వరలోనే బయటకు చిన్నమ్మ.. తమిళ రాజకీయాల్లో మొదలైన కుదుపు..!
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో శిక్షను అనుభవిస్తోన్న శశికళ నటరాజన్ అలియాస్ చిన్నమ్మ త్వరలోనే బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో శిక్షను అనుభవిస్తోన్న శశికళ నటరాజన్ అలియాస్ చిన్నమ్మ త్వరలోనే బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగష్టు 14న శశికళను జైలు అధికారులు విడుదల చేయబోతున్నట్లు తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆశీర్వాదం ట్వీట్ చేశారు. దీంతో తమిళ రాజకీయాల్లో కుదుపు మొదలైంది.
వచ్చే ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, శశికళ విడుదల సమాచారాన్ని బీజేపీ నాయకుడు వెల్లడించడంతో తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే 2016లో అధికారం చేపట్టిన కొన్ని నెలలకే జయలలిత అనారోగ్యంతో మరణించారు. ఇక ఆ సమయంలో శశికళ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయి. అక్రమాస్తుల కేసులో దోషులుగా తేలడంతో.. శశికళ సహా ఇళవరసి, సుధాకరన్‌లను 2017లో జైలుకు తరలించారు. ఇక శశికళ బయట ఉన్న సమయంలో ఆమెకు రెబల్‌గా మారి పార్టీ నుంచి బయటకు వచ్చిన పన్నీరు సెల్వం.. ఆ తరువాత పళని స్వామితో కలిసిపోయారు. ప్రస్తుతం వీరి నేతృత్వంలోనే తమిళనాట ప్రభుత్వం నడుస్తోంది. ఇక ఇప్పుడు చిన్నమ్మ మళ్లీ వస్తే తమిళనాట రాజకీయాల్లో కీలక మార్పులు జరగడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.