దీపావళికి ఖరీదైన కానుక.. లక్ష నగదు, 1 కేజీ వెండి, 144 గ్రాముల బంగారం.. పంచిన టూరిజం మంత్రి
దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు దేశ ప్రజలు. దీపావళి సందర్భంగా ప్రజలు తమ బంధువులు, స్నేహితులకు బహుమతులు పంపిణీ చేస్తారు. సాధారణంగా అవి స్వీట్లు, బట్టలు వంటివి ఉంటాయి. అయితే, ఇక్కడ ఒక మంత్రిగారు మాత్రం తన అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు ఖరీదైన బహుమతులు అందజేశారు. ప్రస్తుతం ఈ వార్త వెలుగులోకి రావటంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటక టూరిజం మంత్రి ఆనంద్ సింగ్ […]

దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు దేశ ప్రజలు. దీపావళి సందర్భంగా ప్రజలు తమ బంధువులు, స్నేహితులకు బహుమతులు పంపిణీ చేస్తారు. సాధారణంగా అవి స్వీట్లు, బట్టలు వంటివి ఉంటాయి. అయితే, ఇక్కడ ఒక మంత్రిగారు మాత్రం తన అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు ఖరీదైన బహుమతులు అందజేశారు. ప్రస్తుతం ఈ వార్త వెలుగులోకి రావటంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటక టూరిజం మంత్రి ఆనంద్ సింగ్ తన అనుచరులు, బంధుమిత్రులకు బంగారం, వెండి, నగదును బహుమతిగా ఇచ్చారు. ఈ బహుమతుల వల్ల ఇప్పుడతను వివాదాల్లో చిక్కుకోవాల్సి వచ్చింది.
దీపావళి కానుకగా రెండు రకాల బాక్స్‌లను పంపిణీ చేశారు కర్ణాటక మంత్రి ఆనంద్ సింగ్. ఒక బాక్సు మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు, మరొకటి గ్రామ పంచాయతీ సభ్యులకు ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు కానుకగా అందజేసిన పెట్టెలో లక్ష రూపాయల నగదు, 144 గ్రాముల బంగారం, కిలో వెండి, పట్టు చీర, ధోతి, డ్రైఫ్రూట్ బాక్స్ ఉన్నాయి. మరోవైపు గ్రామపంచాయతీ సభ్యులకు ఇచ్చిన పెట్టెలో బంగారం లేదు, నగదు కూడా తక్కువ. కానీ మిగతా విషయాలన్నీ ఉన్నాయి. ఇలా మొత్తం 35 మంది మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు, 182 మంది గ్రామ పంచాయతీ సభ్యులకు బహుమతులు అందజేశారు.
సమాచారం ప్రకారం.. కర్ణాటక మంత్రి ఆనంద్ సింగ్ హోస్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఇందులో ఒక మున్సిపల్ కార్పొరేషన్,10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‌లో 35 మంది ఎన్నికైన సభ్యులు ఉన్నారు. 10 గ్రామ పంచాయతీల్లో 182 మంది సభ్యులున్నారు. ఈ ఖరీదైన దీపావళి కానుకను మంత్రి ఈ సభ్యులందరికీ పంపినట్లు తెలిసింది. మరోవైపు, మంత్రి ఈ బహుమతిని తీసుకోవడానికి కొందరు సభ్యులు నిరాకరించినట్లు కూడా చెబుతున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి