AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎర్రకోట వద్ద విధ్వంసం ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. ఢిల్లీ పోలీసుల అదుపులో కీలక నిందితుడు

ఢిల్లీలోని ఎర్రకోటపై దాడి ఘటనకు కారణమైన మరో కీలక నిందితుడు మణిందర్‌ సింగ్‌‌ను ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు.

ఎర్రకోట వద్ద విధ్వంసం ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. ఢిల్లీ పోలీసుల అదుపులో కీలక నిందితుడు
Balaraju Goud
|

Updated on: Feb 17, 2021 | 3:01 PM

Share

Red fort accused arrested : రిపబ్లిక్‌ డే రోజున దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై దాడి ఘటనకు కారణమైన మరో కీలక నిందితుడు మణిందర్‌ సింగ్‌‌ను ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఎర్రకోట వద్ద కత్తులను ప్రదర్శిస్తూ.. సంఘవిద్రోహ శక్తులను హింసను ప్రేరేపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి అప్పటి వీడియోలు, ఫొటోల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడిని బుధవారం స్వరూప్‌నగర్‌లోని తన ఇంట్లోనే అరెస్టు చేసినట్లు డీసీపీ ప్రమోద్‌ కుశ్వాహా తెలిపారు.

‘ప్రస్తుతం అరెస్టయిన మణిందర్‌ స్థానికంగా ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాదు, అతడు కత్తిసాము శిక్షణ స్కూల్‌ నిర్వహిస్తున్నాడు. రిపబ్లిక్‌డే రోజున తన అనుచరులతో కలిసి ప్రణాళిక ప్రకారం.. రైతుల ట్రాక్టర్‌ ర్యాలీలో చేరాడు. అలా ఎర్రకోటకు చేరుకుని కత్తులను ప్రదర్శిస్తూ.. సంఘవిద్రోహ శక్తుల్ని పోలీసులపైకి ఉసిగొల్పడంలో కీలక పాత్ర పోషించాడు. అతడిని ఫొటోలు, వీడియోల ఆధారంగా గుర్తించామని ఢిల్లీ స్పెషల్ బ్రాంచి పోలీసులు తెలిపారు. ఆ హింసాత్మక ఘటన వ్యవహారంలో అతడు మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు. ఎర్రకోట ఘటనకు ముందు కూడా నిందితుడు పలుమార్లు సింఘు బార్డర్‌కు వెళ్లి వచ్చినట్లు విచారణలో తేలిందని డీసీపీ ప్రమోద్‌ కుష్వాహా తెలిపారు. అతడి వద్ద నుంచి 4 అడుగుల పొడవైన రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు నిందితుడి మొబైల్‌లోనూ ఎర్రకోట వద్ద కత్తులతో ప్రదర్శన చేస్తున్న దృశ్యాలు ఉండటంతో సెల్‌ఫోన్‌ కూడా స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నామన్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు రిపబ్లిక్‌ డే రోజున చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యంలో హింస ఏ రూపంలో ఉన్నా అది నేరమే. కానీ, నిరసన తెలపడం మాత్రం తప్పు కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిరసన, అసమ్మతి తెలియజేయడమన్నది ప్రభుత్వాన్ని నడపడంలో అత్యంత కీలకం. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 19(1)(a) కొన్ని సరైన ఆంక్షలతో భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తోంది. శాంతియుత నిరసన అన్నది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అయితే దాన్ని ఉపయోగించేటప్పుడు కొంత సంయమనం పాటించాలి. ఇవన్నీ విస్మరించిన సంఘ విద్రోహశక్తులు రైతుల రూపంలో ఎర్రకోట వద్ద విధ్వంసానికి పాల్పడ్డారు. చారిత్రక ఎర్రకోటపై మతపరమైన జెండాతో పాటు, రైతుల జెండాలను ఎగురవేశారు.

ఇదీ చదవండి…. తెలంగాణలో విజయవంతమైన ‘కోటి వృక్షార్చన’.. ఇంతకీ సీఎం కేసీఆర్ ఏ మొక్క నాటారో తెలుసా..?