Chhatrapati Shivaji: చరిత్ర గర్వపడే యోధుడిపై మహారాష్ట్ర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న ప్రతిపక్షాలు, ప్రజలు..
ఛత్రపతి శివాజీ ప్రతిష్ఠను చిన్నబుచ్చేలా గవర్నర్ వ్యాఖ్యానించారని ఎన్సీపీ ఆయనను విమర్శించింది. మహారాష్ట్రీయుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన కోశ్యారీని వెంటనే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని...
హిందూ సామ్రాజ్యాధినేతగా ఖ్యాతి గాంచిన ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్ఫదంగా మారాయి. ఔరంగాబాద్‌లోని డాక్టరేట్ ప్రదానోత్సవంలో ఆయన శనివారం ‘మహారాష్ట్రలో శివాజీని పాత రోజుల్లో ఐకాన్‌గా భావించేవారని, ఇప్పుడు అంబేద్కర్, గడ్కరీని ఐకాన్‌గా భావిస్తున్నార’ని అన్నారు. దీంతో ఆయనపై బీజేపీలోని కొందరు కార్యకర్తలతో సహా విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. ఛత్రపతి శివాజీ ప్రతిష్ఠను చిన్నబుచ్చేలా గవర్నర్ వ్యాఖ్యానించారని ఎన్సీపీ ఆయనను విమర్శించింది. మహారాష్ట్రీయుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన కోశ్యారీని వెంటనే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతిని ఆ పార్టీ కోరింది. ఇదే క్రమంలోనే ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ కూడా శనివారం మండిపడ్డారు. శనివారం ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ ప్రసంగిస్తూ.. “మీకు ఆరాధ్యమైన విగ్రహరూపం ఎవరని ఎవరైనా అడిగితే.. మీరు వెతకాల్సిన అవసరం లేదు. మీకు మహారాష్ట్రలో ఈ ప్రశ్నకు సమాధానం ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇప్పుడు రాష్ట్రంలో పాత విగ్రహంగా మారారు, బాబాసాహెబ్ అంబేద్కర్, నితిన్ గడ్కరీ వంటి వారెందరో ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నారు”అని వ్యాఖ్యానించారు.
గవర్నర్ చేసిన ప్రకటనపై రౌత్ స్పందిస్తూ.. అధికార ఏకనాథ్ షిండే సేన వర్గాన్ని, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని కూడా ఈ వివాదంలోకి లాగారు. “శివాజీ మహారాజ్ ఎప్పటికీ పాత విగ్రహంగా మారిపోరు. గవర్నర్, షిండే వర్గం, బీజేపీ కంటే పాత ఐకాన్ ఎవరు?” అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా మహారాష్ట్రలో భావోద్వేగాలు, మహోన్నతమైన వ్యక్తిగా ఖ్యాతిని గడించిన మరాఠా యోధుడిపై గవర్నర్ చేసిన వ్యాఖ్య నేతలకు మింగుడు పడలేదు. గవర్నర్ ‘గొప్ప నాయకులను అగౌరవపరిచే వ్యక్తి’ అని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ప్రతినిధి అన్నారు. ”ఛత్రపతి శివాజీ మహారాజ్ మా దైవం మాత్రమే కాదు, మా స్ఫూర్తికి మూలం. ఆయన మనందరికీ ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తారు” అని ఉద్ధవ్ వర్గం అధికార ప్రతినిధి ఆనంద్ దూబే ఒక ప్రకటనలో తెలిపారు. ”గవర్నర్ ప్రకటనల ప్రకారం, రాముడు, శ్రీకృష్ణుడు కూడా పాత విగ్రహాలుగా మారారు. ఇప్పుడు మనం కొత్త దేవతలను ఆరాధించాలా?” అని ఆయన గవర్నర్ కోశ్యారీని ప్రశ్నించారు.
అయితే.. అన్పానాత్రా చాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన రౌత్‌కు నవంబర్ 9న PMLA కోర్టు బెయిల్ మంజూరు చేసింది.సంజయ్ రౌత్‌తో పాటు, ఈ కేసులో రెండవ నిందితుడు ప్రవీణ్ రౌత్ కూడా ఉన్నాడు. పీఎంఎల్‌ఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, గతంలోనూ శివాజీపై కోశ్యారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమర్థ రామదాసు లేకుండా ఛత్రపతి శివాజీ లేనేలేరని అనటం అప్పట్లో వివాదానికి దారి తీసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..