AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Ratna: ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా ఐదుగురికి భారతరత్న ప్రకటించారు. ఈ సారి కూడా దేశ అత్యున్నత పౌరపురస్కారం రేసులో పలువురు ప్రముఖులు నిలుస్తున్నారు. ఈ రేసులో రతన్ టాటా, మన్మోహన్ సింగ్ ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ కోరుతోంది.

Bharat Ratna: ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!
Bharat Ratna Award
Janardhan Veluru
|

Updated on: Jan 23, 2025 | 9:24 AM

Share

ఈసారి దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను ఎవరికి ప్రకటిస్తారన్న అంశంపై ఆసక్తికర చర్చ మొదలయ్యింది. ఎప్పటిలానే పలువురు రాజకీయ ప్రముఖులకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా భారత రత్న రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రిపబ్లిక్ డే‌ వేళ త్వరలోనే భారత రత్న పురస్కారాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది. మరి భారతరత్న పురస్కారం రేసులో ఉన్న ప్రముఖులను పరిశీలిస్తే..

భారత రత్న పురస్కార రేసులో ధివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా, ధివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ముందున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. గత ఏడాది అక్టోబర్ మాసంలో రతన్ టాటా కన్నుమూశారు. ముందు నుంచే ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. మరణానంతం ఈ డిమాండ్ మరింత బలపడింది. రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం కూడా చేసింది.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గత ఏడాది డిసెంబరు 26న కన్నుమూశారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీతో పాటు కొందరు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు కూడా కోరుతున్నాయి. మన్మోహన్ సింగ్‌కు ఢిల్లీలో స్మృతి స్థల్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇస్తే ఆశ్చర్యపోనక్కర్లేదని ఢిల్లీ వర్గాల సమాచారం. కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధం కలిగిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 2019లో భారత రత్న ఇచ్చిన మోదీ సర్కారు.. 2024లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడం విశేషం.

భారతరత్న రేసులో ఎన్టీఆర్ కూడా..

కాగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ బలంగా కోరుతోంది. ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉంది. ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే దళిత్ ఐకన్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీ రామ్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. గతంలో చాలాసార్లు బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ఈ డిమాండ్‌ను కేంద్రం ముందుంచారు.  అలాగే సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, వీర్ సావర్కర్, జ్యోతిరావ్ పూలే, సావిత్రిబాయ్ పూలె, బీహార్ తొలి సీఎం శ్రీకృష్ణ సింగ్, బీపీ మండల్, ఒడిశా మాజీ సీఎం బీజూ పట్నాయక్ తదితరులు కూడా భారతరత్న రేసులో ఉన్నారు.

ఈ సారి మూడు లేదా నాలుగురికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ డే‌కి ముందు లేదా ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికల ఉండటంతో.. ఆ తర్వాత భారతరత్న పురస్కారాలను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

2024లో అత్యధికంగా ఐదుగురికి..

కాగా గత ఏడాది (2024) ఐదుగురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్ సింగ్ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత రత్న ప్రకటించారు. తొలిసారిగా ఒక సంవత్సరంలో ఎక్కువ మందికి భారతరత్న ప్రకటించడం విశేషం. గతంలో 1999లో నలుగురికి భారత రత్న ప్రదానం చేయడమే ఇప్పటి వరకు గరిష్ఠంగా ఉంది. 1954 నుంచి ఇప్పటి వరకు భారత రత్న పురస్కారం జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య 53కు చేరింది.