Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Polls: ఢిల్లీలో ఎన్నికల ప్రచార జోరు.. ప్రధాని మోదీ క్యాంపెయిన్ ఎప్పుడంటే..?

Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంటోంది. ఆప్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కమలనాథులు ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. రిపబ్లిక్ డే తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Delhi Polls: ఢిల్లీలో ఎన్నికల ప్రచార జోరు.. ప్రధాని మోదీ క్యాంపెయిన్ ఎప్పుడంటే..?
PM Narendra Modi
Follow us
Janardhan Veluru

|

Updated on: Jan 23, 2025 | 11:56 AM

Delhi Election News: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఢిల్లీలో ప్రతి వర్గాన్ని ఆకట్టుకోవడానికి మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పైచేయి చేసేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. రిపబ్లిక్ డే తర్వాత బీజేపీ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకోనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు – కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు దేశ రాజధానిలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ కనీసం మూడు ఎన్నికల సభల్లో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జనవరి 29, 31, ఫిబ్రవరి 2న దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 15 ఎన్నికల సభల్లో ప్రసంగిస్తారని తెలుస్తోంది. అటు జేపీ నడ్డా కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పలు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతుంది. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కిస్తారు. ఫిబ్రవరి 10 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలని CEC నిర్ణయించింది. ఢిల్లీలో 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ ప్రకటించింది. ఢిల్లీలో 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. 70 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా అర్వింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు.

మూడు పార్టీల మధ్య హోరాహోరీ..

నాలుగోసారి విజయం కోసం ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే బీజేపీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెక్‌ పెట్టి ఢిల్లీలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈసారి ఢిల్లీలో సత్తా చాటాలని కాంగ్రెస్‌ చూస్తోంది. అయితే ఇండి కూటమిలోని కీలక పార్టీలు కాంగ్రెస్‌ను కాదని ఆప్‌కు మద్దతుగా నిలుస్తుండడంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షగా మారాయి. బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీల పోటాపోటీ ఉచిత హామీలతో ఓటర్లు ఎవరికి జైకొడుతారనేది తేలాలంటే ఫిబ్రవరి 8 వరకు ఆగాల్సిందే.