ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం (07 జనవరి 2025) నాడు విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిభ్రవరి 5వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఢిల్లీలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ఈసీ ప్రకటించింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఈవీఎంలతోనే నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈవీఎంలపై ఎలాంటి అనుమానలు అక్కర్లేదని స్పష్టంచేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కోటి 55 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 83.49 లక్షలు, మహిళా ఓటర్లు 71.74 లక్షల మంది ఉన్నారు. ఢిల్లీ వ్యాప్తంగా 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.