AAP పతనం మొదలయ్యింది.. ప్రశాంత్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఆప్ పరాజయంపై ఆ పార్టీ మాజీ నేత ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ ఓటమికి కేజ్రీవాలే కారణమని ఆరోపించిన ఆయన.. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమితో ఆప్ పతనం మొదలయ్యిందని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓటమి చెవిచూడడం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఢిల్లీలో అధికార పీఠాన్ని దక్కించుకుంది. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆప్.. ఈసారి కేవలం 22 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది. ఆప్ కీలక నేతలు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా పలువురు ఓటమి చవి చూశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపై ఆ పార్టీ మాజీ నేత, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ (Prashant Bhushan) స్పందించారు. అర్వింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) కారణంగానే ఢిల్లీలో ఆప్ ఓడిపోయిందని ఆరోపించారు. ఈ ఓటమితో ఆప్ పతనం మొదలయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆప్‌లో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ భూషణ్.. 2015లో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురికావడం తెలిసిందే.
పార్టీ మూల సిద్ధాంతాలకు దూరంగా ఆప్‌ని కేజ్రీవాల్ నడిపించారని ప్రశాంత్ భూషణ్ ధ్వజమెత్తారు. ఆప్‌ను అవినీతిమయం చేశారని ఆరోపించారు. పారదర్శకం, ప్రజాస్వామ్యం, జవాబుదారితనం వంటి మూల సిద్ధాంతాలు ఇప్పుడు ఆప్‌లో లేవన్నారు. తన కోసం రూ.45 కోట్ల ప్రజా ధనంతో కేజ్రీవాల్ అద్దాల మేడ ‘శీష్ మహల్’ నిర్మించుకున్నారని.. లగ్జరీ కార్లలో తిరిగారని మండిపడ్డారు.
గతంలో ఆప్ మాజీ నేత యోగేంద్ర యాదవ్ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి కేజ్రీవాల్ బాధ్యుడంటూ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకత, జవాబుదారీతనం వంటి మూల సిద్ధంతాల నుంచి ఆప్ పక్కకు తప్పుకుందని ఆరోపించారు. ఇప్పటికే సామాజిక కార్యకర్త అన్నా హజారే సైతం ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి నేపథ్యంలో కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.