తలైవాకేమైంది? అంతుచిక్కని వ్యూహం
రజనీకాంత్… మొన్నటి వరకు ఏది మాట్లాడినా ఆచీతూచీ మాట్లాడే వ్యక్తిగా అందరికీ తెలుసు. ఎవరినీ నొప్పించకుండా మాట్లాడే అగ్ర హీరోగా పేరున్న రజనీకాంత్ ఇటీవల చేసిన కామెంట్లు ఆయనపై అందరి అభిప్రాయాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. ఒక్కసారిగా వివాదంలోకి నెట్టాయి. తమిళనాట పలు పోలీస్ స్టేషన్లలో రజనీకాంత్ మీద కేసులు నమోదవుతున్నాయి. రజనీకాంత్ ఇపుడు తమిళనాడులో ఓ పెద్ద వివాదానికి కేంద్రబిందువుగా మారారు. ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యాథితిగా పాల్గొన్న తుగ్లక్ పత్రిక సదస్సులో రజనీకాంత్ తమిళనాడులో పెద్ద […]
రజనీకాంత్… మొన్నటి వరకు ఏది మాట్లాడినా ఆచీతూచీ మాట్లాడే వ్యక్తిగా అందరికీ తెలుసు. ఎవరినీ నొప్పించకుండా మాట్లాడే అగ్ర హీరోగా పేరున్న రజనీకాంత్ ఇటీవల చేసిన కామెంట్లు ఆయనపై అందరి అభిప్రాయాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. ఒక్కసారిగా వివాదంలోకి నెట్టాయి. తమిళనాట పలు పోలీస్ స్టేషన్లలో రజనీకాంత్ మీద కేసులు నమోదవుతున్నాయి.
రజనీకాంత్ ఇపుడు తమిళనాడులో ఓ పెద్ద వివాదానికి కేంద్రబిందువుగా మారారు. ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యాథితిగా పాల్గొన్న తుగ్లక్ పత్రిక సదస్సులో రజనీకాంత్ తమిళనాడులో పెద్ద సంఖ్యలో జనం ఆరాధ్యుడుగా భావించే పెరియార్‌పై కామెంట్లు చేశారు. రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగత అభిప్రాయాలుగా ఎవరూ తీసుకోలేదు. భావప్రకటనా స్వేచ్ఛ కలిగిన దేశంలో తన అభిప్రాయం వ్యక్తం చేయడం తప్పన్నట్లు పెరియార్ ఫాలోవర్స్‌తోపాటు డిఎంకె లాంటి పెద్ద పార్టీలు కూడా రజనీకాంత్‌పై ధ్వజమెత్తారు.
దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ వుందంటూ గగ్గోలు పెట్టే ఏ నేత ఇపుడు రజనీకాంత్‌కు అండగా మాట్లాడడం లేదు. కానీ, ఆయన మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానంటున్నారు. సారీ చెప్పేది లేదని కుండబద్దలు కొడుతున్నారు.
తలైవాలో ఈ మార్పెందుకు?
అచీతూచీ మాట్లాడే వ్యక్తిగా పేరున్న రజనీకాంత్ ఉన్నట్లుండి అగ్రెసివ్‌గా ఎందుకు మారారు? బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకేనని ఆయన వ్యతిరేకులు అంటున్నారు. నిజానికి వీరి వాదనలో పసలేదు. ఎందుకంటే.. రజనీకాంత్‌కు బీజేపీని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ నేతలే తలైవా వెంటపడుతున్నారు. ఆయన్ని తమవైపునకు లాగేందుకు దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే వున్నారు.
రాజకీయాల్లోకి చేరడం వల్లనే కొన్ని అభిప్రాయాలను కుండబద్దలు కొట్టాల్సిన అవసరం వుందని రజనీకాంత్ భావిస్తున్నారు. అందుకే పెరియార్‌పై తన మాటలకు కట్టుబడి వున్నానంటూ… పర్యవసనాలను ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారు. రాజకీయాల్లో వున్నప్పుడు చాలా అంశాల్లో క్లారిటీ కావాలి. అందుకే కేసులనైనా ఎదుర్కొంటాను.. కానీ మాట వెనక్కి తీసుకోలేనని చెబుతున్నారు.
తమిళనాడులో 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పటిలోగా బలమైన రాజకీయ శక్తిగా మారి.. డిఎంకే.. ఏఐఏడీఎంకేలను ధీటుగా ఎదుర్కొనేందుకు రజనీకాంత్ సిద్దమవుతున్నారు. తాను స్ట్రాంగ్‌గా వుంటే.. చిన్నా చితక తమిళపార్టీలతోపాటు.. బీజేపీ లాంటి బలమైన రాజకీయ శక్తి తనవెంట నడుస్తుందన్నది తలైవా వ్యూహమని పలువురు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు.. ఫుల్ టైమ్ పాలిటిక్స్ మొదలు పెట్టేందుకు రజనీకాంత్ సిద్దమవుతున్నారు.
2020 మే నెల తర్వాత తమిళనాడులో జిల్లా జిల్లా తిరిగేందుకు, గల్లీ గల్లీ పర్యటించేందుకు టూర్ ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారు. తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్న తరుణంలో చిన్నా చితకా కేసులకు భయపడి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం వృధా అని రజనీకాంత్ భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంఛనా వేస్తున్నారు.