Rajkot Fire Accident: 12 మంది చిన్నారులు సహా 30 మంది సజీవదహనం.. రాజ్‌కోట్ ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు..!

ఇంతటి విషాదానికి కారణం ఏంటి ?.. ఇది ప్రమాదమేనా ?.. ఎవరి నిర్లక్ష్యం ఖరీదు ఈ నిండు ప్రాణాలు. ఈ హత్యకు బాధ్యులెవరు ?.. ముక్కుపచ్చలారని చిన్నారులను బలితీసుకుంది ఎవరు ? ఏ పాపం తెలియని అమాయకులను పొట్టనపెట్టుకుంది ఎవరు ? నిబంధనలు పాటించి ఉంటే.. భద్రతాపరమైన చర్యలు తీసుకుంటే.. ఇలాంటి ప్రమాదం జరిగేదా ?.. ఒకవేళ జరిగినా.. ప్రాణనష్టం ఈ స్థాయిలో ఉండేదా ?

Rajkot Fire Accident: 12 మంది చిన్నారులు సహా 30 మంది సజీవదహనం.. రాజ్‌కోట్ ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు..!
Trp Game Zone Fire Incident
Follow us
Balaraju Goud

|

Updated on: May 26, 2024 | 8:36 AM

ఉల్లాసంగా అక్కడికి వచ్చారు. ఎంతో సరదాగా గడుపుదామని అనుకున్నారు. కానీ మృత్యువు వారి వెనకే ఉందని ఆ చిన్నారులకు తెలియలేదు. తమ తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ప్రాణాలు తమ కళ్ల ముందే కాలిబూడిదైపోతాయని వాళ్లు ఊహించలేదు. కానీ అదే జరిగింది. ఘోర ప్రమాదం అని చెబుతున్నా.. ఈ హత్యలకు బాధ్యులెవరో సమాధానం చెప్పేదెవరు.

విషాదం.. ఊహకందని ఘోరం. ఎవరో చేసిన తప్పుకు ఎంతోమంది జీవితాలు అగ్నికి ఆహుతైపోయాయి. సెలవు రోజు సరదాగా గడుపుదామని వెళ్లిన వాళ్లు.. మృత్యుకౌగిలిలోకి చేరిపోయారు. ఒక్కసారిగా పొగలు. ఆ వెంటనే దట్టమైన మంటలు. ఏం జరుగుతుందో తెలిసేలోపే గాల్లో కలిసిపోయిన ప్రాణాలు. గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని స్థానిక టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో జరిగింది ఇదే. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 30మందికి పైగా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అందులో 12 మంది పిల్లలు. ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. ఇక అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.

మంటల ధాటికి మాంసపు ముద్దలుగా మారిపోయిన పసి ప్రాణాలను చూసి.. తల్లిదండ్రుల గుండెలు బద్ధలైపోయాయి. అయ్యో ఇందుకేనా ఇక్కడికి వచ్చింది అంటూ రోదిస్తున్న వారి ఆర్తనాదాలు మిన్నంటిపోయాయి. చిన్నారులతో పాటు30 మంది కూడా అగ్నికి ఆహుతయ్యారు. వారిలో కొందరు ఎవరో కూడా తెలియని దయనీయ పరిస్థితి. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మృతదేహాల్లో తమ వాళ్లు ఉన్నారా ? అని బాధితులు ఉబికి వస్తున్న కన్నీళ్లతో ఎదురుచూస్తున్న దుస్థితి. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 30 మంది అని అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ సంఖ్య ఎంతవరకు వెళ్లొచ్చన్నది మరికొన్ని గంటలు గడిస్తే తప్ప చెప్పలేని పరిస్థితి. ఇక ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి కూడా హృదయవిదారకమే. వారిలో ఎంతమంది పరిస్థితి విషమంగా ఉందన్నది తేలాల్సి

ఇంతటి విషాదానికి కారణం ఏంటి ?.. ఇది ప్రమాదమేనా ?.. ఎవరి నిర్లక్ష్యం ఖరీదు ఈ నిండు ప్రాణాలు. ఈ హత్యకు బాధ్యులెవరు ?.. ముక్కుపచ్చలారని చిన్నారులను బలితీసుకుంది ఎవరు ? ఏ పాపం తెలియని అమాయకులను పొట్టనపెట్టుకుంది ఎవరు ? నిబంధనలు పాటించి ఉంటే.. భద్రతాపరమైన చర్యలు తీసుకుంటే.. ఇలాంటి ప్రమాదం జరిగేదా ?.. ఒకవేళ జరిగినా.. ప్రాణనష్టం ఈ స్థాయిలో ఉండేదా ?.. వీటికి సమాధానం చెప్పేదెవరు ?.. ఎప్పటిలాగే సహాయక చర్యల తరువాత ప్రమాదానికి కారణాలు తెలుస్తాయి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అని అధికారులు, పాలకులు ఎప్పుడూ చెప్పే మాటలే ఇక్కడి కూడా వినిపిస్తున్నాయి. ఇంతకుమించి ఇలాంటి ఘటనల్లో బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుందేమో..!

జనరేటర్‌ కోసం ఉంచి పెట్రోల్.. డీజిల్ కారణమా..?

రాజ్‌కోట్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదం వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, అందిన సమాచారం ప్రకారం, TRP గేమ్ జోన్ పేరుతో ఈ స్థలంలో పెట్రో, డీజిల్ డబ్బాలను ఉంచినట్లు తెలుస్తోంది. దాని కారణంగా మంటలు చెలరేగాయంటున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. TRP గేమ్ జోన్‌లో ఉంచిన జనరేటర్‌ను నడపడానికి 1500 నుండి 2000 లీటర్ల డీజిల్ నిల్వ ఉంచారు. అదేవిధంగా, గో కార్ రేసింగ్ కోసం కూడా ఇక్కడ 1000 నుండి 1500 లీటర్ల పెట్రోల్ ఉంది. మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా పెట్రోల్‌, డీజిల్‌ డబ్బాలకు మంటలు వ్యాపించాయి. దీంతో మంటలు మరింత వేగంగా ఎగిసిపడ్డాయి. ఇక్కడ మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. గేమ్ జోన్ నిర్మాణం మొత్తం బూడిదైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇక్కడ చాలా మంది ఉన్నారు.

అగ్నిమాపక శాఖ నుండి NOC లేకుండా గేమ్ జోన్

కాగా, TRP గేమ్ జోన్ ‘ఫైర్ నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) కోసం దరఖాస్తు చేయలేదని రాజ్‌కోట్ డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ ఖరే చెప్పారు. “గేమింగ్ జోన్ వివరాలను పరిశీలిస్తున్నామన్నారు, అయితే ప్రాథమికంగా ఆపరేటర్లు అగ్నిమాపక NOC కోసం దరఖాస్తు చేసుకున్నట్లు లేదా వారు రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి మరే ఇతర ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోలేదు.” అని స్వప్నిల్ ఖరే తెలిపారు.

TRP గేమ్ జోన్ నిర్వాహకుల అరెస్ట్

ఈ అగ్నిప్రమాదం తరువాత, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. TRP గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్ తోపాటు గేమ్ జోన్ యాజమాని యువరాజ్ సింగ్ సోలంకిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం అర్థరాత్రి వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే గేమ్ జోన్‌కు ముగ్గురు భాగస్వాములు ఉన్నారు. వీరిలో ప్రకాష్ జైన్, యువరాజ్ సింగ్ సోలంకి, రాహుల్ రాథోడ్ ఉన్నారు. ఇప్పుడు అగ్నిప్రమాదానికి గల కారణం, ఇక్కడి అనుమతి పత్రాల గురించి పోలీసులు వారిని విచారించనున్నారు.

గేమ్ జోన్‌లో ప్రవేశ రుసుముపై ప్రత్యేక ఆఫర్‌తో రద్దీ

వాస్తవానికి, రాజ్‌కోట్‌లోని TRP గేమ్ జోన్‌లో ప్రవేశ రుసుము శనివారం రూ. 99కి తగ్గించారు. వేసవి సెలవులు, వారాంతాల్లో, పిల్లలను ఆకర్షించడానికి గేమ్ జోన్ ద్వారా ఈ పథకం అమలు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. గేమ్ జోన్‌లో చిన్నారులతో పాటు పలువురు వివిధ రకాల ఆటలను ఆస్వాదిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గేమ్ జోన్ ఎంట్రీ-ఎగ్జిట్ కోసం 6 నుండి 7 అడుగుల మార్గం మాత్రమే ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

ప్రమాదం ఘటనపై సిట్‌ విచారణ

రాజ్‌కోట్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదం తరువాత, గుజరాత్ ప్రభుత్వం చర్యకు దిగింది. ఈ ఘటనపై విచారణను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుభాష్ త్రివేది నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ప్రభుత్వం అప్పగించింది. అగ్నిప్రమాదం తరువాత, రాజ్‌కోట్ పోలీసు కమిషనర్ రాజు భార్గవ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, అగ్నిప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామని, కార్యకలాపాలను నిలిపివేయమని నగరంలోని అన్ని గేమింగ్ జోన్‌లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

పరిహారం ప్రకటించిన గుజరాత్ సర్కార్

రాజ్‌కోట్‌లో జరిగిన ఈ ప్రమాదంపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విచారం వ్యక్తం చేస్తూ, మృతులకు నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యమన్నారు సీఎం భూపేంద్ర పటేల్.

మూడు గంటల్లో అదుపులోకి మంటలు..

శనివారం (మే25) సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో గేమ్ జోన్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి మూడు గంటల సమయం పట్టింది. శనివారం రాత్రి 9 గంటలకు, రాజ్‌కోట్ కలెక్టర్ ప్రభావ్ జోషి మాట్లాడుతూ, అగ్నిప్రమాదం గురించి సాయంత్రం 4:30 గంటలకు మాకు సమాచారం అందిందని, వెంటనే అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గేమ్ జోన్ తాత్కాలిక నిర్మాణం కూలిపోయింది. రెండు గంటల క్రితమే మంటలు అదుపులోకి వచ్చాయన్నారు ప్రభావ్ జోషి. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…