గుట్టురట్టైన రూ. 2వేల కోట్ల సైబర్ మోసం.. తీగ లాగితే డొంక కదులుతోంది.. ఏకంగా చైనాతో లింక్..!
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సైబర్ థానా పోలీసులు ఏడు రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్లకు పైగా మోసం చేసిన ఒక పెద్ద అంతర్జాతీయ సైబర్ మోసగాడు ముఠాను బట్టబయలు చేశారు. నేపాల్, దుబాయ్‌లలో కూర్చున్న కింగ్‌పిన్‌ల ఆదేశాల మేరకు ఈ ముఠా భారతదేశంలో నకిలీ బ్యాంకు ఖాతాలను తెరిచి చైనా సైబర్ మోసాల ముఠాకు విక్రయించింది.

రాజస్థాన్‌లో 2వేల కోట్ల రూపాయల సైబర్ మోసం కలకలం రేపింది. ప్రధాన నిందితుడు కృష్ణశర్మ అరెస్ట్‌తో దేశవ్యాప్తంగా సైబర్ మోసం డొంక కదులుతోంది. సాంకేతిక ఆధారాలతో కృష్ణశర్మ సైబర్ గ్యాంగ్ గుట్టురట్టు చేసింది రాజస్థాన్ పోలీస్ టీమ్. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సైబర్ థానా పోలీసులు ఏడు రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్లకు పైగా మోసం చేసిన ఒక పెద్ద అంతర్జాతీయ సైబర్ మోసగాడు ముఠాను బట్టబయలు చేశారు. నేపాల్, దుబాయ్‌లలో కూర్చున్న కింగ్‌పిన్‌ల ఆదేశాల మేరకు ఈ ముఠా భారతదేశంలో నకిలీ బ్యాంకు ఖాతాలను తెరిచి చైనా సైబర్ మోసాల ముఠాకు విక్రయించింది. అరెస్టయిన నిందితులలో నేపాల్ నివాసి లాల్ డోర్జే తమాంగ్, సుజల్ తమాంగ్, ఢిల్లీ నివాసి పవన్ జైన్, అబ్దుల్ షామా ఉన్నారు.
దేశంలోనే భారీ సైబర్ మోసం కేసును రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ పోలీసులు చేధించారు. రాజస్థాన్‌లోని కొందరు కేటుగాళ్లు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతూ పెద్దయెత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు శ్రీగంగానగర్ పోలీసులకు సమాచారం అందింది. రహస్య సమాచారంతో రంగంలోకి దిగిన శ్రీగంగానగర్ పోలీసులు.. సైబర్ కేటుగాళ్ల గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలోనే.. బికనీర్ జిల్లా నపసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖర్దా గ్రామంలో దాడి చేశారు.
కృష్ణశర్మను అదుపులోకి తీసుకుని విచారించడంతో భారీ సైబర్ మోసం డొంక కదిలింది. కృష్ణశర్మ బ్యాంకు అకౌంట్‌లో 99కోట్ల 65 లక్షల రూపాయల లావాదేవీల రికార్డ్‌ను చూసి పోలీసులు షాక్ అయ్యారు. కృష్ణశర్మ గ్యాంగ్ దేశంలోని వేలాది మందిని మోసం చేసి వేల కోట్ల రూపాయలు కాజేసినట్లు తేల్చారు. ఈ కేసుతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సైబర్ మోసాలు వెలుగులోకి రాగా.. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో సైబర్ రాకెట్ యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడైంది.
ఆయా రాష్ట్రాల్లోని సైబర్ రాకెట్ కారణంగా వేలాది మంది బాధితులుగా మారారని శ్రీ గంగానగర్ ఎస్పీ గౌరవ్‌యాదవ్ వెల్లడించారు. సైబర్ కేటుగాళ్లు మోసం చేసే విధానాలను గుర్తించినట్లు తెలిపారు. నకిలీ పెట్టుబడి పథకాలు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, ఫేక్ లక్కీ డ్రాల పేరుతో వాట్సాప్ కాల్స్, సోషల్ మీడియా, నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా ప్రజలను ఆకర్షించి.. మోసాలు చేస్తున్నారన్నట్లు తేలిందన్నారు. ఈ కేసులో కొన్ని ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగుల పాత్ర కూడా అనుమానాస్పదంగా ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ గౌరవ్‌యాదవ్ తెలిపారు. మొత్తంగా.. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో కృష్ణశర్మ అరెస్ట్‌తో సైబర్ నేరస్తుల నెట్‌వర్క్ బట్టబయలు అవుతోంది.
విచారణలో సూత్రధారి లాల్ డోర్జే టెలిగ్రామ్, ఇంటర్నెట్ ద్వారా చైనీస్ ముఠాతో నేరుగా సంబంధం కలిగి ఉన్నారని తేలింది. దుబాయ్‌లో నివసిస్తున్న సుష్మ అనే మహిళతో సంప్రదింపులు జరిపారు. ఆమె చైనీస్ దుండగులకు బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డు, ఇమెయిల్ ఐడిలను అందించింది. ఈ ముఠా ఒక్కొక్క ఖాతాను 5 లక్షల రూపాయలకు విక్రయించేది. ఆన్‌లైన్ ట్రేడింగ్, గేమింగ్ పేరుతో ఈ ఖాతాల ద్వారా చైనా నుండి డబ్బు బదిలీ చేయడం జరిగింది.ఇందులో నిందితుడు ప్రతి లావాదేవీకి 2.5 నుండి 5 శాతం కమీషన్ తీసుకునేవాడు. ఈ మొత్తాన్ని USDT వంటి క్రిప్టోకరెన్సీలలో తీసుకున్నారు.
సుజల్ తమంగ్ పని ఖాతాదారులను పర్యవేక్షించడం, వారి మొబైల్‌లలో APK యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం. ఇది ఒక గూఢచారి యాప్, దీని ద్వారా చైనీస్ దుండగులకు ఖాతాలకు పూర్తి యాక్సెస్ లభించింది. సుజల్ మొబైల్‌ను ఒక హోటల్‌లో ఉంచి నేపాల్‌లోని లాల్ డోర్జేకు యాక్సెస్‌ను అందించేవాడు. ఢిల్లీ నివాసి పవన్ జైన్ లాల్ డోర్జేను జైపూర్‌కు పిలిచాడు. ఈ ముఠా సభ్యులు దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాల కోసం వెతుకుతారు. కమిషన్ ఇస్తామని ప్రజలను ఆకర్షించి వారిని ఒప్పించి, వారి మొబైల్ ఫోన్‌లలో APKలను ఇన్‌స్టాల్ చేయించుకుంటారు. అన్ని లావాదేవీలు డిజిటల్, ఎన్‌క్రిప్టెడ్ మార్గాల ద్వారా జరిగేవి.
ఈ ముఠా సైబర్ మోసానికి పాల్పడినట్లు ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. సమాచారం అందిన వెంటనే, ఆర్‌పీఎస్ అధికారి సోంచంద్ వర్మ నేతృత్వంలోని పోలీసులు ఉచ్చు బిగించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిపై ఐటీ చట్టం, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు జరిగిన అత్యంత ప్రణాళికాబద్ధమైన అంతర్జాతీయ సైబర్ మోసాలలో ఇది ఒకటి అని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరికొందరు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
