రైల్వే శాఖ నాకు ప్రకటించిన రూ. 50 వేల రివార్డు సొమ్మును ఆ బాలుడి కుటుంబానికే ఇస్తా..మయూర్ షేక్

ముంబైలోని వంగానీ రైల్వే స్టేషన్ లో రైలు కింద పడబోయిన ఆరేళ్ళ బాలుడ్ని రక్షించిన రైల్వే ఉద్యోగి మయూర్ షేక్.. తన ఉదారతను చాటుకున్నాడు. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా...

  • Umakanth Rao
  • Publish Date - 12:31 pm, Fri, 23 April 21
రైల్వే శాఖ నాకు ప్రకటించిన రూ. 50 వేల రివార్డు సొమ్మును ఆ బాలుడి కుటుంబానికే ఇస్తా..మయూర్ షేక్
Railway Pointsman Who Saved Boy

ముంబైలోని వంగానీ రైల్వే స్టేషన్ లో రైలు కింద పడబోయిన ఆరేళ్ళ బాలుడ్ని రక్షించిన రైల్వే ఉద్యోగి మయూర్ షేక్.. తన ఉదారతను చాటుకున్నాడు. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ధైర్య సాహసాలతో చిన్నారిని రక్షించినందుకు రైల్వే  శాఖ ఇతడికి  50 వేల రూపాయల రివార్డును ప్రకటించింది . అయితే ఈ సొమ్మును తాను ఆ బాలుడి కుటుంబానికి అందజేస్తానని మయూర్ షేక్ తెలిపాడు. తన కుమారుడిని రక్షించినందుకు బాలుడి తల్లి ఫోన్ ద్వారా తనకు కృతజ్ఞతలు తెలిపిందని, హౌస్ వైఫ్ అయిన ఆమెకు కంటి చూపు సరిగా కనబడదని ఆయన చెప్పాడు. ఆమె భర్త కూడా చిన్న పాటి సంపాదనతో నెట్టుకొస్తున్నట్టు తెలిసిందని, ఆ పేద కుటుంబానికి ఈ సొమ్మును అందజేస్తానని ఆయన చెప్పాడు. రైల్వే శాఖ నాకీ రివార్డును ప్రకటించింది. ఇది నాకు అందగానే ఆ కుటుంబానికి ఇచ్చి వస్తాను అని మయూరి షేక్ అన్నాడు.

ఇతని సమయస్ఫూర్తిని, ధైర్య సాహసాలను రైల్వే అధికారులే కాక, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కూడా ప్రశంసిస్తూ ట్వీట్ చేసిన సంగతి విదితమే. ఇలాంటి ఉద్యోగులు ఉన్నందుకు తమ శాఖ గర్విస్తోందని పీయూష్ గోయెల్ అన్నారు. మయూరి షేక్ ఉదంతం మహారాష్ట్రలో పలువురిని కదిలించింది.  ఇతని ధైర్యసాహసాలు సీసీటీవీ ఫుటేజీకెక్కాయి. అయితే  రైల్వే అధికారులు లేదా, ఈ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రశంసలకు మయూర్ పొంగిపోలేదు. వినమ్రంగానే వారి పొగడ్తలను అందుకున్నాడు. పైగా 50 వేళా రివార్డును బాలుడి పేద కుటుంబానికి ఇచ్చేస్తానని చెప్పాడు. ఈ సొమ్ము ఆ బాలుడి భవిష్యత్ అవసరాలకు  తోడ్పతుందని ఆయన పేర్కొన్నాడు.