ప్రయాణీకులు తిట్టినా లెక్క చేయకుండా 800 మంది ప్రాణాలు కాపాడిన స్టేషన్ మాస్టర్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డ్..
గత డిసెంబర్ 2023లో మైచాంగ్ తుఫాను సృష్టించిన భీభత్సం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ తుఫాన్ కారణంగా దక్షిణ రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడులోని అనేక జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. డిసెంబర్ 17న తిరునెల్వేలి, టుటికోరిన్ జిల్లాలు ముంపునకు గురయ్యాయి. ఈ సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. రైల్వే లైన్ వరదనీటిలో మునిగిపోయింది అని గురించి తగిన చర్యలు తీసుకుని దాదాపు 800 మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి నేటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
గతేడాదిలో(2023 డిసెంబర్) సంభవించిన వరదల నుంచి 800 మంది ప్రాణాలను కాపాడిన శ్రీవైకుండం రైల్వే స్టేషన్‌లోని స్టేషన్ మాస్టర్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డును ప్రకటించింది. తమిళనాడులో రైళ్లు అతిపెద్ద రవాణా సాధనం. వివిధ పేర్లతో, రకరకాల సౌకర్యాల కల్పనతో సామాన్యుల నుంచి ధన వంతుల వరకూ ప్రయాణించే ఛార్జీలతో ప్రయాణీకులను అందుబాటులో ఉండే ఈ రైళ్లలో భద్రత చాలా ముఖ్యమైన విషయం. ఏ చిన్న పొరపాటు జరిగినా అనుకోని ప్రమాదాలు జరిగి అపార ప్రాణనష్టం వాటిల్లుతుంది. అటువంటి పరిస్థితిలో రైల్వే ఉద్యోగుల పని తీరుని అంకిత భావాన్ని గుర్తించి.. వారిని తగిన విధంగా సత్కరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వివిధ స్థాయిలలో రైల్వే రంగంలో బాగా పనిచేస్తున్న 100 మంది ఉద్యోగులను సత్కరిస్తుంది. అదే విధంగా ఈ ఏడాది కూడా అంకిత భావంతో పని చేసిన రిల్వే సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ను ప్రకటించింది. ఈ నెల (డిసెంబర్ )21న నిర్వహించనున్న 69వ రైల్వే వారోత్సవాల్లో ఈ అవార్డులను అందజేయనున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి అవార్డులను అందజేయనున్నారు.
800 మంది ప్రాణాలను కాపాడినందుకు అవార్డు
800 మంది ప్రాణాలను కాపాడిన తమిళనాడుకు చెందిన స్టేషన్ మాస్టర్ ఎ. జాఫర్ అలీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుకు ఎంపికయ్యారు. 2023లో మైచాంగ్ తుఫాను వలన తమిళనాడులో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించారు. డిసెంబర్ 17న తిరునెల్వేలి, టుటికోరిన్ జిల్లాలు వరద ముంపునకు గురవుతున్న సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో సెంటూర్ ఎక్స్‌ప్రెస్ రైలు యథావిధిగా తిరుచెందూర్ నుంచి చెన్నైకి బయలుదేరింది. ఆ రైలు శ్రీవైకుండం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ సమయంలో రైల్వే లైన్ వరద నీటిలో మునిగిపోయిందని ఇంజినీరింగ్ అధికారి ద్వారా స్టేషన్ మాస్టర్ జాఫర్ అలీకి సమాచారం అందింది. వెంటనే శ్రీ వైకుండం రైల్వేస్టేషన్ లో రైలును ఆపాడు. భారీ వర్షం, చుట్టుపక్కల చీకట్లు కమ్ముకోవడంతో కరెంటు అంతరాయం కలగడంతో ఆగ్రహించిన ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌తో వాగ్వాదానికి కూడా దిగారు.
అయినా సరే స్టేషన్ మాస్టర్ రైలు ముందుకు పోవడానికి సిగ్నల్ ఇవ్వలేదు. అయితే తెల్లవారుజామున చుట్టుపక్కల పరిసరాలను చూసి ప్రయాణీకులు ఆశ్చర్య పోయారు. రైల్వే స్టేషన్ నలుమూలలా జలమయమవడం చూసి ప్రయాణికులు అవాక్కయ్యారు. రైలులో దాదాపు 2 రోజులు అందరూ చిక్కుకున్నారు. ఈ ప్రయాణీకులకు సమీపంలోని గ్రామస్థులు భోజనం పెట్టి ఆదరించారు. వరద తగ్గుముఖం పట్టకపోవడంతో సంఘటనా స్థలానికి రైల్వే అధికారులు, రెస్క్యూ బృందాల రాక ఆలస్యమైంది. దాదాపు మూడు రోజుల తర్వాత రెస్క్యూ టీమ్ శ్రీవైకుండం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.
అయితే వరద నీరు తగ్గుముఖం పట్టిన తర్వాత శ్రీవైకుండం రైల్వే స్టేషన్‌కు కొంత దూరంలో రైలు పట్టాలు వేలాడుతూ కనిపించాయి. సమయానికి రైలును నిలపడంతో దాదాపు 800 మంది ప్రయాణికుల ప్రాణాలు రక్షించబడ్డాయి. అది గమనించిన తర్వాత ప్రయాణీకులతో సహా వివిధ వర్గాల వారు స్టేషన్‌మాస్టర్ జాఫర్ అలీపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ రైల్వే నుంచి స్టేషన్‌మాస్టర్ జాఫర్ అలీ మోస్ట్ విష్డ్ రైల్ సేవా పురస్కార్ అవార్డుకి ఎంపికయ్యారు. త్వరలో ఈ అవార్డుని అందుకోనున్నారు. (Source)
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..