Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ కి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్
జమ్మూ కాశ్మీర్ కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను కల్పించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీనగర్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. దీనికి రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం మీరంతా ముందుండి ప్రచారం చేయాలని కోరారు.
జమ్మూ కాశ్మీర్ కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను కల్పించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీనగర్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. దీనికి రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం మీరంతా ముందుండి ప్రచారం చేయాలని కోరారు. ఇదే సమయంలో ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి వెంటనే ఎన్నికలు జరిపించాలని ఆయన కేంద్రాన్ని అభ్యర్థించారు. శ్రీనగర్ లో రాహుల్ …పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనకు గాను ఆయన ఈ ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. 2019 ఆగస్టు 5 న కేంద్రం జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదాను రద్దు చేసి.. దీన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం రాహుల్ ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. కేంద్ర నిర్ణయాన్ని కాంగ్రెస్ లోగడే తీవ్రంగా తప్పు పట్టింది. ఇలా ఉండగా ఇదే పార్టీకి చెందిన సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్.. సైతం జమ్మూ కాశ్మీర్ కి కేంద్రం వీలైనంత త్వరగా రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతున్నారు. గత జూన్ లో ప్రధాని మోదీ.. కాశ్మీర్ పరిస్థితిపై నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఇది ఈ కేంద్ర పాలిత ప్రాంత ప్రజల అభిమతమన్నారు.
అయితే ఇక్కడ మొదట నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ జరగాల్సి ఉందని.. దాన్ని చేపట్టిన అనంతరం ఎన్నికల విషయాన్ని యోచిస్తామని మోదీ నాడు పేర్కొన్నారు. ఇటీవలే.. సరైన సమయంలో ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.