Harbhajan Singh: మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్.. రాజ్యసభకు పంపించే ఛాన్స్?

భగవంత్ మాన్ పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో పాలనతో పాటు రాజకీయంగా పట్టు సారించేందుకు సీఎం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Harbhajan Singh: మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్.. రాజ్యసభకు పంపించే ఛాన్స్?
Harbhajan Bhagwant Mann
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 16, 2022 | 9:57 PM

Harbhajan Singh to Rajya Sabha: పంజాబ్(Punjab) అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party). భగవంత్ మాన్(Bhagwant Mann) పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో పాలనతో పాటు రాజకీయంగా పట్టు సారించేందుకు సీఎం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫున ప్రముఖ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను రాజ్యసభకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా జలంధర్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భగవంత్ మాన్ హర్భజన్ సింగ్‌కు స్పోర్ట్స్ యూనివర్శిటీ కూడా ఆయన అప్పగించే అవకాశముందని తెలుస్తోంది.

మార్చి 10న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేయడం ద్వారా భగవంత్ మాన్‌కు అభినందనలు తెలిపారు. భగవంత్ మాన్ తల్లిని కౌగిలించుకున్న చిత్రాన్ని పంచుకుంటూ, “కొత్త ముఖ్యమంత్రి అయినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి, నా స్నేహితుడు భగవంత్ మాన్‌కు అభినందనలు. ఖట్కర్‌కలన్ గ్రామంలో భగత్ సింగ్‌లో ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది. అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలావుంటే, పంజాబ్ నుంచి ఎన్నికైన ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఈ స్థానాలకు ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. పంజాబ్‌లో నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 21, పరిశీలన మార్చి 22 న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 24గా నిర్ణయించారు. మార్చి 31న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌, అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించి రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 117 సీట్లలో ఆప్ 92 సీట్లు గెలుచుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ ఖాతాలో 18 సీట్లు చేరాయి. అకాలీదళ్ మూడు, బీజేపీ రెండు, బీఎస్పీ, స్వతంత్రులు ఒక్కో సీటు గెలుచుకున్నారు. పంజాబ్‌లోని మొత్తం ఐదు రాజ్యసభ స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐదుగురిలో ఒకరిగా హర్బజన్ సింగ్‌ను రాజ్యసభకు పంపాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. మరోవైపు, తాను రాజకీయ రంగ ప్రవేశంపై స్వయంగా హర్భజన్ గతంలోనే వెల్లడించాడు. తాను పుట్టిన పంజాబ్ రాష్ట్రానికి సేవ చేయాలని భావిస్తున్నానని.. అయితే అది రాజకీయాల రూపంలోనా లేదా ఇతర రూపంలోనా అన్న విషయంలో అన్నది చెబుతానంటూ దాటవేస్తూ వచ్చారు. కానీ సమాజానికి తిరిగిచ్చే సమయం ఆసన్నమైందని భజ్జీ అభిప్రాయపడ్డాడు.

ఇదిలావుంటే, 2015లో చివరిసారి టీమిండియా తరఫున ఆడిన భజ్జీ.. ఆ తర్వాత ఐపీఎల్‌లో ఆడాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు హర్భజన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లోనూ ఏ ఫ్రాంచైజీ కూడా ఈ సీనియర్ ఆటగాణ్ని ఎంపిక చేసేందుకు అవకాశం లేకపోవడంతో రిటైరయ్యాడని భావించారు. కానీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకే.. పంజాబ్ ఎన్నికల ముందు హర్భజన్ ఆటకు వీడ్కోలు పలికాడనే ప్రచారం కూడా జరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో హర్భజన్‌ను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించిందనే వార్తలొచ్చాయి. అమృత్‌సర్ లోక్ సభ స్థానం నుంచి భజ్జీని బరిలోకి దింపడానికి కమలం పార్టీ ప్రయత్నాలు చేసింది. కానీ రాజకీయాల్లోకి చేరడానికి హర్భజన్ సింగ్ మాత్రం ముందుకు రాలేదు. అదే సమయంలో బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఢిల్లీ నుంచి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అవకాశం ఇస్తే.. రాజ్యసభలో వెళ్లేందుకు హర్భజన్ సింగ్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Read Also….  Virat Kohli: ‘కోహ్లీ.. అకాడమీకి వచ్చి బేసిక్స్‌ నేర్చుకో.. అప్పుడే ఫాంలోకి వస్తావ్’