PM Modi: ప్రధాని మోడీ అలుపెరుగని అమెరికా పర్యటన.. 65 గంటలు.. 20 సమావేశాలు..
ప్రధాని మోడీ మూడురోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల్లో ప్రయాణ సమయం తీసేస్తే.. 65 గంటల పాటు.. అమెరికాలో ప్రధాని మోడీ ఉన్నారు.
PM Modi: ప్రధాని మోడీ మూడురోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల్లో ప్రయాణ సమయం తీసేస్తే.. 65 గంటల పాటు.. అమెరికాలో ప్రధాని మోడీ ఉన్నారు. ఈ సమయంలో ఆయన 20 సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో ప్రధాని మోడీ క్షణం తీరిక లేకుండా గడిపినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం పర్యటనలో ఆయన సమయం పూర్తిగా సమావేశాల్లోనే గడిచిపోయింది. అంతేకాదు.. ప్రధాని మోడీ యూఎస్ వెళ్ళేటప్పుడు.. తిరిగి వచ్చేటప్పుడు విమానంలో నాలుగు సుదీర్ఘ సమావేశాలు కూడా నిర్వహించారు. అధికారులతో నిర్విరామంగా సంభాషిస్తూనే వున్నారు. ఇదిలా ఉంటె.. అయన బస చేసిన హోటల్ లో కూడా మూడు సమావేశాల్లో పాల్గొన్నారని మోడీతో పాటు ఉన్న అధికార వర్గాలు తెలిపాయి.
ప్రధాని మోడీ సెప్టెంబర్ 23 న, అనేక మంది సియీవోలతో ఐదు సమావేశాలు జరిపారు. తరువాత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో చర్చలు జరిపారు. అనంతరం ఆయన జపాన్ ప్రధాని యోషిహిడే సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో ద్వైపాక్షిక పరస్పర చర్చల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా మోడీ అక్కడ మూడు అంతర్గత సమావేశాలకు అధ్యక్షత కూడా వహించారు.
ఆయన మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత క్వాడ్ మీట్‌కు హాజరయ్యారు. మోడీ సెప్టెంబర్ 24 న నాలుగు అంతర్గత సమావేశాలను కూడా నిర్వహించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 25 న మోదీ అమెరికా నుంచి ఇండియాకుబయలుదేరారు. ఆయన తిరిగి విమానంలో రెండు సమావేశాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సాధారణంగా ప్రధాని మోడీ ఎప్పుడూ తన విదేశీ పర్యటనల్లో చాలా బిజీ షెడ్యూల్ ఉండేలా చూసుకుంటారు. ఎక్కడా సమయం వృధా కానీయరు. అంతేకాదు.. ఎన్ని సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ అసలు ఆయన అలసట చెందరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈయన అధికారికంగా ఇతర దేశాల ముఖ్యులతో సమావేశాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. కొద్ది సమయం చిక్కినా దేశీయ వ్యవహారాల విషయంపై అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉంటారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 22న ఢిల్లీ నుంచి అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యుఎస్‌లతో జరిగిన మొదటి క్వాడ్ ఇన్ పర్సనల్ మీట్‌లో పాల్గొన్నారు. దీనితోపాటు, న్యూయార్క్‌లో జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీలో కూడా ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇక, ఈ పర్యటనలో అగ్రరాజ్య దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో కూడా భారత ప్రధాని ముఖాముఖి భేటీ జరిపారు. భారత– అమెరికా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చించారు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రస్తుత పరిస్థితులు, కొవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపైనా వీరి మధ్యలో చర్చలు జరిగాయి. కాగా, అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ అమెరికాకు వెళ్ళడం ఇదే మొదటి సారి. మొత్తమ్మీద ప్రధాని మోడీ పర్యటన విజయవంతంగా ముగిసింది.
Also Read: PM Modi in US: ఢిల్లికి చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన ప్రజలు..
Ayushman Bharat: రూ .5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. ఎవరు అర్హులో తెలుసుకోండి..