Prashant Kishor: పీకే సలహాల మేరకు కాంగ్రెస్ వ్యూహంలో కీలక మార్పులు.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో చోటు!
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం ప్రారంభమైన మూడ్రోజుల కాంగ్రెస్ పార్టీ చింతన్ శివర్(Chintan Shivir)పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) నీడ అలుముకుంది. గత నెలలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)ని రెండుసార్లు కలిసిన ప్రశాంత్ కిషోర్..
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం ప్రారంభమైన మూడ్రోజుల కాంగ్రెస్ పార్టీ చింతన్ శివర్(Chintan Shivir)పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) నీడ అలుముకుంది. గత నెలలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)ని రెండుసార్లు కలిసిన ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు అందించేందుకు కీలక సలహాలు, సూచనలు చేయడం తెలిసిందే. దీనికి సంబంధించి పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక లాంఛన ప్రాయమేనంటూ అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే వివిధ కారణాలతో పీకే కాంగ్రెస్‌లో చేరడం లేదని ఇటు కాంగ్రెస్.. అటు ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే ప్రశాంత్ కిషోర్ చేసిన సలహాలు, సూచనలను కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఉదయపూర్ డిక్లరేషన్‌లో ప్రశాంత్ కిషోర్ సూచనలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.
సర్వేలు నిర్వహించడంతో పాటు ఎన్నికలకు సంబంధించిన అన్ని పనులను పర్యవేక్షించేందుకు అంతర్గత ఎన్నికల యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్‌లో ప్రకటించనుంది. ప్రశాంత్ కిషోర్ సూచనలలో ఇది ఒకటి కావడం విశేషం. వాస్తవానికి ఈ ఎన్నికల యంత్రాంగానికి/విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నాయకత్వం వహించాలని ఆయన ఆసక్తిగా ఉన్నారు. అయితే ప్రశాంత్ కిషోర్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తే.. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, నిధులు సమకూర్చడంలో తమ పాత్ర నామమాత్రంగా మిగిలిపోతుందని పార్టీలోని ఇతర ప్రధాన కార్యదర్శులు ఆందోళన చెందారు. ఆ కారణంతోనే ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేరుకుని.. ఈ కీలక పదవిని అప్పగించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారని సమాచారం. దీంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయన్న టాక్ వినిపించింది.
యువ జనాభాతో మెరుగ్గా కనెక్ట్ అయ్యేందుకు పార్టీలోని అన్ని స్థాయిలలో యువతను ప్రోత్సహించాలని ప్రశాంత్ కిషోర్ సోనియాగాంధీకి సూచించారు. ఆయన సలహా మేరకే అన్నట్లు… పార్టీ పదవుల్లో 50శాతం పదవులను 50 ఏళ్ల లోపు నేతలకే కేటాయించాలని పార్టీ నిర్ణయించింది. పెద్ద సంఖ్యలో యువ కాంగ్రెస్ నేతలను తెరపైకి తెచ్చే మైలురాయి నిర్ణయాల్లో ఇది ఒకటి కానుంది.
కింది స్థాయిలో పార్టీ పదవులను భర్తీ చేసి స్థానిక పార్టీ శ్రేణులను ప్రోత్సహించాలని ప్రశాంత్ కిషోర్ సూచించారు. తద్వారా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించాలని ఆయన చేసిన సూచనను కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిగణలోకి తీసుకుంది. పార్టీ అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించాలని.. ఆఫీస్ బేరర్లకు పరిమిత పదవీకాలాన్ని విధించాలని నిర్ణయించింది. లింగ, సామాజిక గ్రూపులకు పార్టీలో ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించడంపై పీకే చేసిన మరొక కీలక సూచన. ఈ ప్రతిపాదనకు కూడా కాంగ్రెస్ అంగీకరించినట్లు సమాచారం. బూత్, బ్లాక్ స్థాయిలో మరిన్ని సంస్థాగత విభాగాలను ఏర్పాటు చేస్తామని పార్టీ ప్రకటించింది.
అలాగే ప్రజా సమస్యలపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు అవసరమైన వ్యూహ రచనకు పార్టీ పార్లమెంటరీ బోర్డు ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్లమెంటులో విపక్షాలతో కలిసి పనిచేయడంపై కూడా ఈ పార్లమెంటరీ బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది. తద్వారా విపక్షాలతో ఏర్పడిన సఖ్యతతో ఎన్నికల పొత్తులు ఏర్పరచుకోవడానికి దోహదంకావాలి. ప్రశాంత్ కిషోర్ చేసిన కీలక సూచనల్లో ఇది కూడా ఒకటి. ప్రశాంత్ కిషోర్ తన ప్రజెంటేషన్‌లో చేసిన మరిన్ని కీలకమైన ఐడియాస్‌ను ఉదయ్‌పూర్ డిక్టరేషన్‌లో కాంగ్రెస్ పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.
Also Read..