CM Jagan: ఏం చేసినా వారికి బాధే.. చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం జగన్..
Andhra Pradesh CM Jagana: టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ప్రతిపక్షాలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం..
Andhra Pradesh CM Jagana: టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ప్రతిపక్షాలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా.. బ్యాంకు అప్పులిచ్చినా వారికి బాధేనన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినా కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని చెప్పారు. పరీక్ష పేపర్లు లీక్ చేయించి.. రాజకీయాలు చేస్తున్నారన్నారు సీఎం జగన్. ఇలాంటి వారిని ఏమని అనాలో ప్రజలే నిర్ణయించాలన్నారు.
రాష్ట్రానికి మంచి జరగకుండా రాబంధుల్లా అడ్డుకుంటున్నారని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుడు ఎవరైనా ప్రజలను నమ్ముకుంటారని కానీ చంద్రబాబు.. కొడుకుని, దత్తపుత్రుడిని నమ్ముకుంటున్నారని మండిపడ్డారు.
27 ఏళ్లు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏనాడూ అక్కడ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన చేయలేదు. తన మూడేళ్ల పాలనను చూసి ఇల్లు కట్టుకోవడానికి అక్కడికి పరుగెత్తాడని ఆరోపించారు సీఎం జగన్. ఈ మూడేళ్లలోనే 95 శాతం హామీలు అమలు చేసి ధైర్యంగా ఇంటింటికీ వెళుతుంటే దుష్ట చతుష్టయానికి కడుపు మంట వస్తోందన్నారు. ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యం అందించొచ్చు కానీ, ఏడుపుతో వచ్చే కడుపు మంటకు ఆ దేవుడే చికిత్స చేస్తాడని వ్యాఖ్యానించారు సీఎం జగన్.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మురముళ్లలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. లక్షా 8 వేల 755 మత్స్యకార కుటుంబాలకు.. 109కోట్ల రూపాయలను విడుదల చేశారు. చేపల వేట నిషేధ సమయంలో ఇబ్బందిపడకుండా మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు సీఎం జగన్. ఈ సభావేదికపై నుంచి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.