సిగ్నల్ ప్రాబ్లమ్ పరిష్కారానికి ప్రధాని ఆఫీస్‌కి గ్రామస్థుడి లేఖ.. రిప్లై ఏమని వచ్చిందంటే..?
PM's Office: మారుమూల కుగ్రామం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఓ ఏబీవీపీ కార్యకర్త ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. స్పందించిన కార్యాలయ అధికారులు
PM’s Office: మారుమూల కుగ్రామం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఓ ఏబీవీపీ కార్యకర్త ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. స్పందించిన కార్యాలయ అధికారులు వెంటనే రిప్లై ఇచ్చారు. సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. కపారు తాలూకాలో కొంబారు అనే కుగ్రామం ఉంది. గ్రామంలో BSNL టవర్ ఉన్నప్పటికీ విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడల్లా నెట్‌వర్క్ పనిచేయడం లేదు.
ఈ సమస్య కారణంగా ఆ గ్రామంలోని కాపరు, బాగ్‌పుని, ముగేరడ్కా, కలయ, కల్లార్టేన్, కనాల, మణిభండ, కాటేటి, పెరుండోడి గ్రామాల ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందిని తొలగించాలని టెలికాం అధికారులను ఎన్నిసార్లు అభ్యర్థించినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆ ప్రాంతంలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త జగదీష్ ప్రధాన మంత్రికి లేఖ రాశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి లేఖలో వివరించారు.
ప్రజలు అడవి జంతువుల వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్తులు బాహ్య ప్రపంచాన్ని సంప్రదించడం కష్టమవుతుందని జగదీష్ లేఖలో వివరించారు. అంతేకాదు కరోనావైరస్ పరిస్థితి కారణంగా ఆన్‌లైన్ తరగతులపై ఆధారపడిన విద్యార్థులు కూడా నెట్‌వర్క్ సమస్యల కారణంగా విద్యకు దూరమవుతున్నారని, అందువల్ల, BSNL నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రధానిని కోరారు.
PM కార్యాలయ అధికారులు వెంటనే స్పందించి నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని BSNL మంగళూరు అధికారులను ఆదేశించినట్లు జగదీష్‌కు తెలియజేశారు. BSNL మంగళూరు అధికారులు కూడా వెంటనే జగదీష్‌కు లేఖ రాశారు. అంతేకాదు ఫోన్ ద్వారా సంప్రదించి విద్యుత్ సరఫరా సమస్య ఉన్నప్పుడు నెట్‌వర్క్ డిస్‌కనెక్ట్ కాకుండా టవర్‌ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. కొంబారు గ్రామంలో నెట్‌వర్క్ సమస్యలతో నిరాశకు గురైన తాను ప్రధానికి లేఖ రాశానని తనకు స్పందన రావడం శుభపరిణామమని జగదీష్ పేర్కొన్నాడు.