Kashi Vishwanath Corridor: మారనున్న బనారస్ రూపు రేఖలు.. నేడు కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..!
PM Narendra Modi: ఈ కార్యక్రమం దృష్ట్యా, ఇక్కడ చాలా మంది నివాసితులు, దేశీయ పర్యాటకులలో ఉత్సాహం నెలకొంది. ఈ మేరకు వారణాసిలో పోలీసు భద్రతను పెంచారు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఐకానిక్ టెంపుల్ సమీపంలో..
Kashi Vishwanath Corridor, Varanasi: వారణాసి నడిబొడ్డున ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ వారణాసిలో పర్యాటకాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఐకానిక్ దశాశ్వమేధ ఘాట్‌కు సమీపంలో ఉన్న చారిత్రాత్మక కాశీ విశ్వనాథ దేవాలయం చుట్టూ అత్యాధునిక నిర్మాణాన్ని డిసెంబర్ 13న ప్రారంభించనున్నారు. ప్రవేశ ద్వారాలు, ఇతర నిర్మాణాలు, రాళ్లు, ఇతర వస్తువులతో సాంప్రదాయ హస్తకళను ఉపయోగించి తయారు చేసిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంతో ఇక్కడ చాలా మంది నివాసితులు, దేశీయ పర్యాటకులలో ఉత్సాహం నెలకొంది. దీంతో వారణాసిలో పోలీసు భద్రతను పెంచారు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఐకానిక్ టెంపుల్ సమీపంలోని వీధుల్లో చెక్కిన దీపస్తంభాలపై ఈ ప్రాజెక్ట్ దార్శనికతను గ్రహించినందుకు ప్రధాని మోడీని ప్రశంసిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు.
పోలీసులు వీధుల్లో గస్తీ తిరుగుతున్నారు.. కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రసిద్ధ మతపరమైన స్థలాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ అని కూడా పిలుస్తుంటారు. ఆలయ ప్రాంగణం, బహిరంగ కూడళ్ల వద్ద అదనపు బలగాల సహాయంతో పోలీసు బలగాలను మోహరించారు. అంతా సజావుగా జరిగేలా వీధుల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నగరం అంతటా ప్రత్యేకించి ఆలయం, కారిడార్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో విశిష్ట అతిథులు, ప్రజలు హాజరుకావాలన్నారు.
రూ. 339 కోట్లతో తొలి దశ.. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మోదీ ఆలయాన్ని సందర్శిస్తారని, దాదాపు రూ.339 కోట్లతో నిర్మించిన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ మొదటి దశను ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది.
యాత్రికులు, శివ భక్తుల సౌకర్యార్థం ప్రధాని పర్యటన ఉంటుదని ఆ ప్రకటన పేర్కొంది. “ఈ విజన్‌ని సాకారం చేసేందుకు, శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని, గంగా నది ఒడ్డును కలిపుతూ సులువుగా చేరుకోగల మార్గాన్ని నిర్మించనున్నారు. శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్ట్‌గా ఈ కలను తీర్చనున్నారు.”
ప్రాజెక్ట్‌పై ప్రధాన మంత్రి చాలా ఆసక్తి కనబరిచారని పేర్కొంది. ప్రాజెక్ట్‌ను మెరుగుపరచడానికి, వికలాంగులతో సహా యాత్రికుల కోసం అందుబాటులో ఉండేలా చేయడానికి ఇలాంటి ఆలోచన చేశారని తెలిపింది. అలాగే నిరంతరం సూచనలు, తన ఆలోచనలను అందిస్తూ వస్తున్నట్లు పేర్కొంది.
ప్రధాని రాక కోసం.. 2014 నుంచి మోడీ పార్లమెంటరీ నియోజకవర్గంగా ఉన్న నగరంలోని గోదోలియా చౌక్, దాని చుట్టుపక్కల ఆలయానికి వెళ్లే రహదారులను ‘దివ్య కాశీ, భవ్య కాశీ’ అనే బృహత్తర కార్యక్రమానికి ముందు అలంకరించారు. ప్రధాని రాక కోసం ఇక్కడి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
“కాశీ విశ్వనాథ్ ధామ్” (కాశీ విశ్వనాథ్ కారిడార్) ప్రారంభోత్సవం తర్వాత వారణాసిలో ఒక నెల రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులందరూ ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్‌లోని అధికార పార్టీ ఈ ఈవెంట్‌పై స్పెషల్ ఫోకస్ చేసింది. అన్ని ప్రధాన శివాలయాలు, అన్ని మండల యూనిట్‌ల ఆశ్రమాలలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చాలని ప్లాన్ చేసింది. 2019 మార్చిలో కాశీ విశ్వనాథ్ కారిడార్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత, దేవాలయాలను సంరక్షించడానికి, పురాతన విశ్వాసానికి ఆధునిక సాంకేతికతను కలిపేందుకు ఈ ప్రాజెక్ట్ ఒక నమూనాగా ఉంటుందని మోడీ అన్నారు.
ప్రధాని మోడీ రెండు రోజుల పాటు వారణాసిలోనే.. ప్రధాని మోడీ వారణాసిలో రెండు రోజుల పాటు బస చేస్తారని బీజేపీ అధికారులు తెలిపారు. తొలిరోజు బాబా కాల భైరవుని పూజించిన అనంతరం ముందుగా లలితా ఘాట్‌కు చేరుకుని అక్కడి నుంచి బాబా విశ్వనాథ్ ధామ్‌కు చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం ఆయన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో కలిసి గంగా హారతికి హాజరవుతారు.
బస చేసిన రెండో రోజు దేశం నలుమూలల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులతో ప్రధాని సంభాషిస్తారని తెలిపారు. ఆ తర్వాత వారణాసిలోని ఉమ్రాలోని స్వర్వేద్ దేవాలయం వార్షిక కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఇక్కడ ప్రధాన మంత్రి కూడా హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
కారిడార్ కోసం పెద్ద సంఖ్యలో పాత భవనాలు కూల్చివేయడంతో నిపుణులచే విమర్శించారు. డిసెంబరు ప్రారంభంలో, ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ మాట్లాడుతూ, ఈ స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు, ఆలయం అసలు నిర్మాణాన్ని తారుమారు చేయలేదని, ఈ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడంతో పాటు, పర్యాటక సౌకర్యాలు మెరుగుపరిచామని పేర్కొన్నారు.
క్రూయిజ్‌లో కూర్చొని బాణాసంచా కాల్చడాన్ని తిలకించనున్న పీఎం.. వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ మాట్లాడుతూ, ఈ పురాతన నగరానికి చెందిన ఎంపీ, ప్రధాని మోడీ “కాశీ గొప్పతనాన్ని” ముఖ్యమంత్రులకు చూపించాలని ఆకాంక్షించారు. “ప్రధాని సోమవారం ఉదయం వారణాసి విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంది. అక్కడ నుంచి తాత్కాలిక హెలిప్యాడ్ నిర్మించిన సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయానికి హెలికాప్టర్‌లో వెళ్తారు” అని ఆయన తెలిపారు. ఆ తర్వాత కాలభైరవ ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని, నది మార్గం గుండా కారిడార్‌కు ఆనుకుని ఉన్న ఘాట్ వరకు వెళ్తారు.
ఈ భారీ కారిడార్‌కు 2019 మార్చి 8న మోదీ శంకుస్థాపన చేశారు. ఇది ప్రధాన ఆలయాన్ని లలితా ఘాట్‌తో కలుపుతుంది. నాలుగు దిక్కులలోనూ భారీ గేట్లు, అలంకారమైన తోరణ ద్వారాలను కలిగి ఉంది. వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ, “ప్రధాని మోడీ ఘాట్ వైపు నుంచి కాశీ విశ్వనాథ్ ధామ్‌కు చేరుకుంటారు. ఆపై కారిడార్‌ను ప్రారంభిస్తారని” ఆయన అన్నారు. అనంతరం కొత్త కారిడార్ ప్రాంగణాలు, భవనాలను పరిశీలిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సాధువుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే చాలా మంది సాధువులు ఇక్కడికి చేరుకున్నారు.
జిల్లా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ, “సాయంత్రం, ప్రధాన మంత్రి రివర్ క్రూయిజ్‌పై ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో అనధికారిక సమావేశం నిర్వహిస్తారు. వారణాసి ఎంపీగా ఉంటూ నది ఒడ్డున వెలసిన కాశీ వైభవాన్ని ముఖ్యమంత్రులకు చూపించాలని ఆకాంక్షించారు. తన విహారయాత్ర నుంచి ప్రధాన మంత్రి గంగా హారతిని వీక్షిస్తారు. పలు ఘాట్ల వద్ద వేడుకలను చూడనున్నారు. బాణాసంచా, లేజర్ షోలు కూడా ఏర్పాటు చేశారు” అని తెలిపారు.
Also Read: Priyanka Gandhi: గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేసిన ప్రియాంక.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..