Central Cabinet Meeting: టార్గెట్ 2024 ఎన్నికలే.. త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఉద్వాసన ఎంతమందికి..
Central Cabinet Meeting: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో మార్పులు, చేర్పులకు కమలనాథులు కసరత్తును ఇప్పటికే పూర్తిచేశారు.

Central Cabinet Meeting: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో మార్పులు, చేర్పులకు కమలనాథులు కసరత్తును ఇప్పటికే పూర్తిచేశారు. జులై 3న యావత్ మంత్రివర్గాన్ని సమావేశపరిచేందుకు ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించారు. బుధవారం రాత్రి మోదీ నివాసంలో జరిగిన కీలక సమావేశంలో పార్టీలో సంస్థాగత మార్పులు, రాష్ట్రాల అధ్యక్షుల మార్పుతోపాటు కేంద్ర మంత్రివర్గ విస్తరణపై సుధీర్ఘంగా చర్చించారు. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరింత దూకుడుగా, సమర్థవంతంగా పనిచేయగలిగే మంత్రివర్గం కూర్పుపై బీజేపీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవలే న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్‌రిజుజును తొలగించి..ఆ బాధ్యతలను అర్జున్‌రామ్ మేఘ్‌వాల్‌కు అప్పగించడం మినహా రెండేళ్లుగా కేంద్రమంత్రివర్గంలో మార్పులు, విస్తరణ జరగలేదు. 2021 జూలైలో ఈ కసరత్తు జరిగింది. ఈ కసరత్తులో 12మంది మంత్రులపై వేటుపడగా, కొత్తగా 17మందికి చోటు, ఐదుగురికి పదోన్నతి లభించింది.
జూలై3 సోమవారం సా.4 గంటలకు సమావేశం
సరిగ్గా రెండేళ్ల తర్వాత..అదే తరహా కసరత్తు జరుగుతోంది. ప్రధాని నివాసంలో ముఖ్యనేతల భేటీ తర్వాత జూలై3 వతేదీ సోమవారం సాయంత్రం 4గంటలకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ప్రగతిమైదాన్‌లోని కన్వెన్షన్ సెంటర్లో ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా.. జూలై 17 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, పార్టీ సంస్థాగత మార్పులు, చేర్పుల కసరత్తు పూర్తిచేసి నిర్ణయాలను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ మంత్రివర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు. గత 9 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమంతోపాటు మంత్రివర్గం నుంచి పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని వారిని సమాయాత్తం చేయనున్నారు.
10 మందికిపైగా మంత్రులకు ఉద్వాసన!
ఈ యేడాది చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం, రాజకీయ, పాలన అనుభవం ఉన్న నేతలను సీఎం అభ్యర్థిగా రాష్ట్రాలకు పంపాలని అధినాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు కిషన్‌రెడ్డి, మధ్యప్రదేశ్‌కు నరేంద్రసింగ్ తోమర్, రాజస్థాన్‌కు గజేంద్రసింగ్ షెకావత్, ఒడిశాకు ధర్మేంద్రప్రధాన్‌ను పంపనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే కేంద్ర మంత్రివర్గంలో ఖాళీలు ఏర్పడతాయి. వాటిని భర్తీ చేయడంకోసం ఆయా రాష్ట్రాల నుంచే కొత్త ముఖాలకు చోటు కల్పించే ఛాన్స్ ఉంది. సమర్ధతతోపాటు వ్యవహారశైలి, తప్పిదాలు, అవినీతి, అక్రమాలకు సంబంధించి ప్రధాని మోదీ ప్రొగ్రెస్ రిపోర్టులు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఈసారి 10మందికిపైగా ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సారి కూడా మంత్రివర్గంలో ఓబీసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.




జాతీయస్థాయిలో బీజేపీ నాయకత్వం చేసిన కసరత్తులో భాగంగా తెలంగాణలోనూ మార్పులు, చేర్పులు అనివార్యంగా కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ పట్ల కొందరు సీనియర్లు, ఇతరపార్టీల నుంచి వచ్చిన నేతల మధ్య మనస్పర్థల నేపథ్యంలో అందర్నీ కలుపుకుని ముందుకెళ్లే నేతకోసం పార్టీ అన్వేషిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా, పాలనపరమైన అనుభవం ఉన్న కిషన్‌రెడ్డినే రంగంలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే, పార్టీ ఉన్నతికోసం అహర్నిషలు శ్రమించి అధిష్టానం పెద్దల వద్ద మంచి మార్కులు తెచ్చుకున్న బండిసంజయ్‌కి కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఇక ప్రచార కమిటీ బాధ్యతల్ని ఈటలకు అప్పగిస్తే..రాష్ట్ర నాయకత్వంలోనూ బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించినట్లవుతుందని పార్టీ భేరీజు వేస్తోంది.
అయితే అందరి ఊహలకు, ఆశలకు భిన్నంగా ఆలోచించి అనూహ్య నిర్ణయాలు తీసుకునే మోదీ-షా ద్వయం తెలంగాణ విషయంలో ఏం ఆలోచిస్తుందన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




