PM Narendra Modi: సర్దార్ పటేల్ ఇంకొన్నాళ్లు జీవించి ఉంటే.. గోవాకు ఎప్పుడో విముక్తి లభించేది: ప్రధాని మోదీ
PM Narendra Modi Goa Visit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం గోవా లిబరేషన్ డే వేడుకల్లో పాల్గొన్నారు. పనాజీలోని ఆజాద్ మైదాన్‌లో అమరవీరులకు
PM Narendra Modi Goa Visit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం గోవా లిబరేషన్ డే వేడుకల్లో పాల్గొన్నారు. పనాజీలోని ఆజాద్ మైదాన్‌లో అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం గోవా లిబరేషన్ డే సందర్భంగా ఆరేబియా సముద్రంలో నిర్వహించిన సెయిల్ పరేడ్‌కు హాజరై విన్యాసాలను తిలకించారు. ఆ తర్వాత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జి స్టేడియంలో జరుగుతన్న గోవా లిబరేషన్ డే వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోవా విముక్తి కోసం పోరాడిన వారిని, గోవా స్వేచ్ఛ కోసం 1961లో ఆపరేషన్ విజయ్‌లో పాల్గొన్న వారిని ప్రధాని మోదీ జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గోవా రాష్ట్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. అనతి కాలంలోనే గోవా చాలా దూరం ప్రయాణించిందని.. అభివృద్ధిలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. కొన్ని శతాబ్దాల క్రితం దేశంలోని గోవా చాలా ప్రాంతాలు మొగలుల పాలనలో ఉండగా, గోవా మాత్రం పోర్చుగల్ పాలనలో ఉండేదని ప్రధాని మోదీ వివరించారు. శతాబ్దాలు గడిచినా గోవా తన భారతీయతను మరువలేదని, భారతదేశం కూడా గోవా తమ రాష్ట్రమేనన్న సంగతిని మర్చిపోలేదని మోదీ వ్యాఖ్యానించారు. ఈ రోజు గోవా విముక్తి వజ్రోత్సవాన్ని జరుపుకోవడం మాత్రమే కాదు, 60 సంవత్సరాల ఈ ప్రయాణం, జ్ఞాపకాలు కూడా మన ముందు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. లక్షలాది మంది గోవా వాసుల కృషి, అంకితభావాల ఫలితాలు, పోరాటాలు, త్యాగాల చరిత్ర కూడా మన ముందు ఉందంటూ పేర్కొన్నారు. గోవా ఎన్నో రాజకీయ తుఫానులు చూసిందన్నారు.
గోవా ముక్తి విమోచన సమితి సత్యాగ్రహంలో 31 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. సర్దార్ పటేల్ ఇంకొన్నాళ్లు జీవించి ఉంటే గోవా విముక్తి కోసం ఇంత కాలం ఎదురుచూడాల్సిన అవసరం ఉండేది కాదంటూ ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను గుర్తుచేశారు. పారికర్ తన ప్రవర్తన ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నిజాయితీపరులో, ప్రతిభావంతులో దేశం మొత్తం చూసిందని మోదీ పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన రాష్ట్రం కోసం, ప్రజల కోసం తన ఆఖరి శ్వాస వరకు పోరాడుతాడనే విషయాన్ని మనోహర్ పారికర్ ద్వారా చూశామన్నారు. గోవా రాష్ట్రానికి అన్ని అంశాల్లో అగ్రస్థానమేనని.. పరిపాలనలో, తలసరి ఆదాయంలో ఇంకా చాలా అంశాల్లో గోవాదే ముందంజ అంటూ ప్రశంసించారు. గోవాలో సింగిల్ డోస్ కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు.
ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ.600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో పునరుద్ధరించబడిన ఫోర్ట్ అగ్వాడా ప్రిజన్ మ్యూజియం, గోవా మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్, న్యూ సౌత్ గోవా డిస్ట్రిక్ట్ హాస్పిటల్, మోపా ఎయిర్‌పోర్ట్‌లోని ఏవియేషన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, మార్గోలోని దావోర్లిమ్-నవేలిమ్‌లో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ సెంటర్ ఉన్నాయి.
PM Narendra Modi felicitates the freedom fighters and veterans of ‘Operation Vijay’ as part of Goa Liberation Day celebrations at Dr Shyama Prasad Mukherjee Stadium in Goa pic.twitter.com/XrYutoFNZE
— ANI (@ANI) December 19, 2021
Also Read: