భారత్-బంగ్లాదేశ్‌ను దగ్గర చేసిన బక్రీద్.. ప్రధాని మోదీ శుభాకాంక్షలకు స్పందించిన యూనస్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ మధ్య ఈద్-ఉల్-అఝా శుభాకాంక్షలు ఇచ్చిపుచ్చుకోవడం భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేసింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత కొనసాగుతున్నప్పటికీ, ఇద్దరు నాయకుల లేఖలు పరస్పర గౌరవం, సహకారాన్ని పెంపొందించాయి. మోదీ బంగ్లాదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయగా, యూనస్ శాంతి, సహకారం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ఈ సంభాషణ రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాల ఆశలను రేకెత్తించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్‌కు ఒక లేఖ రాశారు. ఈద్-ఉల్-అజా సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలకు, ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
జూన్ 4, 2025 నాటి ఒక లేఖలో ప్రధానమంత్రి మోడీ ఇలా రాశారు, “భారత ప్రజలు, ప్రభుత్వం తరపున, ఈద్-ఉల్-అఝా శుభ సందర్భంగా మీకు, బంగ్లాదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.” అని ప్రధాని పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సాంస్కృతిక ప్రాముఖ్యతను వివరించారు. త్యాగం, కరుణ, సోదరభావంక్క శాశ్వత విలువలను ప్రతిబింబించాలని ఆకాంక్షించారు. యూనస్ ఆరోగ్యం, శ్రేయస్సును కూడా ప్రధాని మోదీ కోరుకున్నారు.
“ఈ పవిత్ర పండుగ భారతదేశం గొప్ప, వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇస్లామిక్ విశ్వాసం గల ప్రజలు ఎంతో ఆనందంగా, ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇది శాంతియుత, సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడానికి అవసరమైన త్యాగం, కరుణ, సోదరభావం కూడిన శాశ్వత విలువలను మనకు గుర్తు చేస్తుంది” అని ప్రధాని మోదీ అన్నారు.
జూన్ 6న యూనస్ స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ తన ఆలోచనాత్మక సందేశానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈద్ సందర్భంగా జరుపుకునే ఉమ్మడి విలువలు, సంప్రదాయాలను అభినందించారు. భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య నిరంతర పరస్పర గౌరవం, సహకారంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూ, “పరస్పర గౌరవం, అవగాహన స్ఫూర్తి మన దేశాలను మన ప్రజల మంచి కోసం కలిసి పనిచేయడానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందని విశ్వసిస్తున్నాను” అని యూనస్ పేర్కొన్నారు.
— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) June 8, 2025
“ఈ శుభ సందర్భంగా, మీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని కోరుకుంటున్నాను. భారత ప్రజలకు శాంతి, పురోగతి, శ్రేయస్సును కూడా కోరుకుంటున్నాను” అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ రాజకీయ గందరగోళంతో సతమతమవుతున్న సమయంలో, రెండు దేశాలు దౌత్య, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..