50 States in India: 2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
జనాభా పెరగడంతో దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు అవసరమని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక జనాభా గత 60 ఏళ్లలో రెండు కోట్ల నుంచి 6.5 కోట్లకు పెరిగిందని వివరించారు.
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో రాష్ట్రాల సంఖ్య 50కి చేరనుందంటూ కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా కర్ణాటక రెండు రాష్ట్రాలు కానుందని.. ఆ మేరకు తనకు స్పష్టమైన సమాచారమున్నట్లు కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి మీడియాకు తెలిపారు. జనాభా పెరగడంతో చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో మేలు జరుగుతుందని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కొత్తగా నార్త్ కర్ణాటక ఏర్పాటు కానుందని ఆయన తెలిపారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
జనాభా పెరగడంతో దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేయాల్సిన అవసరముందని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక జనాభా గత 60 ఏళ్లలో రెండు కోట్ల నుంచి 6.5 కోట్లకు పెరిగిందని వివరించారు. భవిష్యత్తులో తప్పనిసరిగా నార్త్ కర్ణాటక కూడా కొత్త రాష్ట్రంగా ఏర్పడుతుందని, అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కర్ణాటక రెండు రాష్ట్రాలైతే వచ్చే నష్టమేమీ లేదన్న ఆయన.. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కన్నడీకులు కలిసిమెలిసి ఉంటారని అన్నారు. కర్ణాటక రెండు రాష్ట్రాలు, ఉత్తర ప్రదేశ్ నాలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర మూడు రాష్ట్రాలు..ఇలా మరిన్ని రాష్ట్రాలు ఏర్పాటు కానున్నాయని ఆయన వెల్లడించారు.
మంత్రి కత్తి వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.. నార్త్ కర్ణాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టంచేశారు. నార్త్ కర్ణాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఉమేశ్ కత్తి మాట్లాడటం ఇదేమీ కొత్త కాదన్నారు. చాలా ఏళ్లుగా ఆయన ఈ విషయంపై మాట్లాడుతున్నారని అన్నారు.
నార్త్ కర్ణాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికి 100 సార్లు మంత్రి ఉమేశ్ కత్తి మాట్లాడారని ఆ రాష్ట్ర మరో మంత్రి ఆర్ అశోక పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అయితే కర్ణాటక ఒకటిగానే ఉంటుందని అన్నారు. ఎందరో కన్నడీకులు పోరాటాలు చేసి సమైక్య కర్ణాటక రాష్ట్రం సాధించారని అన్నారు. ఈ అంశంపై సీఎం బొమ్మై.. మంత్రి కత్తితో మాట్లాడుతారని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..