Moiz Abbas Shah: అప్పుడు వింగ్ కమాండర్ అభినందన్‌ను బంధించాడు.. ఇప్పుడు ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యాడు!
పుల్వామా దాడికి వ్యతిరేకంగా భారత్ జరిపిన ప్రతీకరా దాడుల సమయంలో భారత వైమానిక దళ పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పట్టుకున్న పాకిస్థాన్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా బుధవారం పాకిస్తాన్‌లో జరిగిన ఓ ఉగ్రవాదుల దాడిలో హతమయ్యాడు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులతో జరిగిన ఎదురుదాడిలో అబ్బాస్ షా హతమైనట్టు కొన్ని అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి.

2019లో జరిగిన పుల్వామా దాడిలో సుమారు 40 మందికిపై మరణించడం యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ దాడులను తీవ్రంగా పరిగణించిన భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం దాడులను ప్రారంభించింది. దీంతో పాకిస్తాన్ కూడా దాడులను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే భారత్ టార్గెట్‌గా పాకిస్తాన్ పంపిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని నాటి భారత వైమానిక దళ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ తన మిగ్-21 బైసన్ విమానంతో పాక్ విమానాన్ని వెంటాడి మరీ కూల్చివేశారు. ఈ ప్రయత్నంలో ఆయన నడుపుతున్న విమానం కూడా దెబ్బతిని పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. కానీ అభినందన్ మాత్రం ప్యారాషూట్ సహాయంతో సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. అయితే తమ భూభాగంలో ల్యాండ్ అయిన వింగ్‌కమాండర్ అభినందన్‌ను పాకిస్థాన్ సైనికులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేశారు. అయితే అప్పుడు అభినందన్‌ను పట్టుకున్న వారిలో పాకిస్తాన్ ఆర్మి జవాన్ అబ్బాస్ షా కీలక పాత్ర పోషించినట్టు అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా పాకిస్తాన్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో ఇతను మరణించినట్టు కొన్ని జాతీయ మీడియాలు వెల్లడించాయి.
పాకిస్తాన్ సైన్యంలో మేజర్‌గా పనిచేస్తున్న మోయిజ్ అబ్బాస్ షా బుధవారం పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదుల దాడిలో మృతిచెందాడు. అబ్బాస్ షా ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యంలోని ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్‌ఎస్‌జీ)లో మేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ సైనిక అధికారులు విడుదల చేసిన వివరాల ప్రాకరం.. ఖైబర్ పఖ్తుంఖ్వాలలో ఉగ్రవాద శక్తులు కదలికలు ఉన్నాయన్న సమాచారంతో మేజర్ అబ్బాస్ షా బృందం కూంబింగ్ చేపట్టిందని.. దీన్ని గమనించిన టీటీపీ సంస్థ చెందిన ఉగ్రవాదులు అబ్బాస్ షా బృందంపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో అబ్బాస్ షా బృందం కూడా వారిపై ఎదురుకాల్పులు జరిపింది. అయితే ఈ ఎదురుకాల్పులు పాకిస్థాన్ మేజర్ అబ్బాస్ షా సహా మరో జవాన్ కూడా మృతి చెందినట్టు పాక్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అంతే కాకుండా పాక్ బలగాల దాడిలో సుమారు 11 మంది టీటీపీ ఉగ్రవాదులు కూడా హతమయ్యారని పాక్ సైన్యం తెలిపింది..
అయితే ఒకప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి అండగా నిలిచిన ఈ తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ.. ఇప్పుడు పాక్‌పై వ్యతిరేక దాడులకు పాల్పడుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




