AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌పై మరోసారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా కీలక వ్యాఖ్యలు!

పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం మధ్య, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఇస్లామాబాద్ సెక్యూరిటీ డైలాగ్ ఫోరమ్ నుండి కీలక ప్రకటన చేశారు.

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌పై మరోసారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా కీలక వ్యాఖ్యలు!
General Qamar Javed Bajwa
Balaraju Goud
|

Updated on: Apr 02, 2022 | 4:52 PM

Share

Jammu Kashmir Issue: పాకిస్తాన్‌(Pakistan)లో రాజకీయ సంక్షోభం మధ్య, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా(Qamar Javed Bajwa) ఇస్లామాబాద్ సెక్యూరిటీ డైలాగ్ ఫోరమ్ నుండి కీలక ప్రకటన చేశారు. అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి భారత దేశంతో చర్చల దౌత్యాన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. కాశ్మీర్ వివాదంతో సహా అన్ని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. అయితే, ఇందుకు భారత్ కూడా ముందుకు రావడానికి సిద్ధమైతే, ఈ అంశంపై ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఉక్రెయిన్‌ ఆక్రమణను రష్యా వెంటనే నిలిపివేయాలని వ్యాఖ్యానించారు. రష్యాకు తమ భద్రతపై ఎన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ.. ఓ చిన్న దేశంపై దాడిని ఏమాత్రం సహించలేనిదని చెప్పుకొచ్చారు. ఇస్లామాబాద్‌లో శనివారం ప్రారంభమైన సెక్యూరిటీ డైలాగ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి చైనా, అమెరికా, జపాన్‌, రష్యా సహా 17 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది ఏదో ఒక రకమైన సంఘర్షణలో పాల్గొంటున్నారని, మన ప్రాంతాన్ని సంఘర్షణ జ్వాలల నుండి దూరంగా ఉంచడం చాలా ముఖ్యమని కమర్ జావేద్ బజ్వా అన్నారు. ఈ ఎపిసోడ్‌లో, భారతదేశం చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తత కూడా మాకు ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇది చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించబడాలని మేము కోరుకుంటున్నామని జావేద్ బజ్వా స్పష్టం చేశారు.

పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా మాట్లాడుతూ, ఈ ప్రాంత రాజకీయ నాయకత్వం సెంటిమెంట్, సంకుచిత సమస్యలకు అతీతంగా ఎదగాలని, పెద్ద ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భమిదని అన్నారు. రెండు రోజుల ఇస్లామాబాద్ సెక్యూరిటీ డైలాగ్ 2022లో ఆర్మీ చీఫ్ ప్రసంగిస్తూ, క్యాంపు రాజకీయాలను పాకిస్థాన్ నమ్మదని అన్నారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఆలోచనలను పంచుకోవడానికి కలిసివచ్చే మేధోపరమైన చర్చల కోసం స్థలాలను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం గతంలో కంటే ఈరోజు ఎక్కువగా అవసరమని నేను నమ్ముతున్నానని తెలిపారు. ఆర్థిక, వ్యూహాత్మక సంఘర్షణల కూడలిలో ఉన్న దేశంగా పాకిస్థాన్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.

పౌరుల భద్రత, వారి గౌరవం, శ్రేయస్సును భద్రతా విధానంలో కేంద్రంగా ఉంచడమే పాకిస్తాన్ మొదటి జాతీయ భద్రతా విధానం అని పాకిస్తాన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ అన్నారు. ఉగ్రవాదాన్ని ఓడించేందుకు పాకిస్థాన్ భద్రతా బలగాలు లెక్కలేనన్ని త్యాగాలు చేశాయి. అయినప్పటికీ, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం ముప్పు ఇప్పటికీ ఉందని కూడా ఆయన అన్నారు. ఈ సమస్యపై తాత్కాలిక ఆఫ్ఘన్ ప్రభుత్వంతో సహా ఇతర పొరుగు దేశాలతో కలిసి పని చేస్తామని కమర్ జావేద్ బజ్వా స్పష్టం చేశారు..

ఇదిలావుంటే, అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికే తాను సిద్ధపడ్డానని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. మరోవైపు ఓ దేశ సైనికాధికారి విదేశాంగ విధానంపై వ్యాఖ్యానించడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ పరిణామాలను బట్టి ఇమ్రాన్‌ ప్రభుత్వానికి అక్కడి సైన్యానికి మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం బహిర్గతమైంది! అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కంటే అక్కడ సైన్యమే శక్తిమంతమైందన్న విషయమూ మరోసారి స్పష్టమైంది.

పాక్‌ పురోగమనానికి ఐరోపా సమాఖ్య, యూకే, గల్ఫ్‌ దేశాలు, ఆగ్నేయాసియా, జపాన్‌తోనూ మంచి సంబంధాలు అవసరమని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. సైనిక వ్యవహారాలకు మాత్రమే పరిమితం కాకుండా ఏకంగా ఇతర దేశాలతో ఉన్న రాజకీయ సంబంధాలపైనా బజ్వా వ్యాఖ్యలు చేయడం పాక్‌లో సైన్యం ఆధిపత్యాన్ని బహిర్గతం చేస్తోంది. అలాగే ఇమ్రాన్‌తో బజ్వాకు ఉన్న విభేదాలూ దీంతో బయటపడ్డట్లయింది.

తాజా పరిణామాల్ని బట్టి చూస్తుంటే రేపు అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి బలం చేకూరేలా బజ్వా తాజాగా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒకవేళ ఇమ్రాన్‌ ప్రభుత్వం అవిశ్వాసంలో నెగ్గినా.. సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also…. India-Nepal: నేపాల్‌లో ఇవాళ్టి నుంచి ‘రూపే’ సేవలు షురూ.. ప్రదానులు మోదీ – దేవుబా జీ మధ్య కీలక ఒప్పందాలు!