Jagannath Puri Ratna Bhandar: పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తాళం చెవి మిస్సింగ్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం (ఖజానా) తాళం చెవి మిస్సింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. దీనిపై విచారణ చేపట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాళం చెవి మాయమవడంతో డూప్లికేటు తాళాల సాయంతో ప్రభుత్వ అధికారుల బృంధం రత్న భాండాగారం తెరచేందుకు యత్నించారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాదాపు 46 యేళ్ల తర్వాత నిథి సంరక్షణ, జాబితాను..
భువనేశ్వర్, జులై 17: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం (ఖజానా) తాళం చెవి మిస్సింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. దీనిపై విచారణ చేపట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాళం చెవి మాయమవడంతో డూప్లికేటు తాళాల సాయంతో ప్రభుత్వ అధికారుల బృంధం రత్న భాండాగారం తెరచేందుకు యత్నించారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాదాపు 46 యేళ్ల తర్వాత నిథి సంరక్షణ, జాబితాను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అనూహ్యంగా తాళాల అదృశ్యం వెనుక ఏదో జరిగిందంటూ ఆలయ ప్రధాన పూజారి జగన్నాథ్ మహాపాత్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాళాల మిస్సింగ్, తర్వాత డూప్లికేట్ తాళాలను గుర్తించినట్టు చెప్పడంపై ఇప్పటికే గందరగోళం నెలకొంది.
దీంతో అసలు రత్న భాండాగారం తాళాలు ఎలా కనిపించకుండా పోయాయి? వాటిస్థానంలో డూప్లికేట్ తాళాలు అక్కడికి ఎవరు తెచ్చి పెట్టారు అనే విషయాలు తెరపైకి రావడంపై మహాపాత్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. నిజం బయటకు రావాలంటే దర్యాప్తు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు తాళం చెవి మాయం అవ్వడంతో రత్న భాండాగారంలో విలువైన వస్తువులు ఉన్నాయా? లేదా? అనే దానిపై కూడా సందిగ్ధం నెలకొంది. ఈ విషయాలన్నింటినీ తేల్చాలంటే భాండాగారం పెట్టెలు తెరిచాకే నిర్ధారించగలమని ఆయన అన్నారు. డూప్లికేట్ తాళం చెవుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. అలాగే బీజేడీ ప్రభుత్వం హయాంలో డూప్లికేట్ కీలు చేరాయని అనడం కూడా వాస్తవాలు విచారణ తర్వాత స్పష్టమవుతుందని న్యాయ శాఖ మంత్రి పృథివీరాజ్ హరిచందన్ తెలిపారు. అయితే ఏ ఏజెన్సీ విచారణ చేపడుతుందనే విషయం మాత్రం మంత్రి వెల్లడించలేదు.
2018లో రత్న బాండాగారం తెరవడంలో మునుపటి ప్రభుత్వం విఫలమైన విషయం కూడా తెరపైకి వచ్చింది. అప్పట్లో దీనిపై విచారణ జరిపినా వాస్తవాలు బహిరంగ పరచలేదు. ఈ క్రమంలోనే లోపలి గదికి చెందిన రెండు డూప్లికేట్ కీలు వెలుగులోకి వచ్చాయి. అలాగే రత్న భాండాగారం కింద మరో రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెప్పారు. ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా కూడా ఈ సొరంగ మార్గం వివరాలను వెల్లడించారు. ఇందులో 34 కిరీటాలు, రత్న ఖచిత స్వర్ణ సింహాసనాలు, దేవతల బంగారు విగ్రహాలు ఉన్నట్లు తెలిపారు.