గుజరాత్ టు హైదరాబాద్.. పసిపిల్లల ప్రాణాలతో దందా.. అసలు ఎలా చిక్కారంటే..?
గుజరాత్‌లో పుట్టిన బిడ్డను అహ్మదాబాద్ మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఒక ముఠా ఉదంతం ఇప్పుడు సంచలనం రేపుతోంది. కేవలం రూ. 3.60 లక్షల కోసం ఒక నవజాత శిశువును వస్తువులా అమ్మేందుకు ప్రయత్నించిన ఈ కిలేడీ ముఠా వెనుక ఉన్న హైదరాబాద్ లింకులు ఏంటి? ఎలా పట్టుకున్నారు..? అనేది తెలుసుకుందాం..

నవజాత శిశువును కొనుగోలు చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన అంతర్రాష్ట్ర శిశు అక్రమ రవాణా ముఠాను అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఛేదించాయి. ఈ ఘటనలో ఓ నవజాత శిశువును రక్షించడంతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ గుజరాత్ ఏటీఎస్ సేకరించిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా సాగింది. ఈ సమాచారం అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్‌కు అందడంతో హిమ్మత్‌నగర్ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయ దిశగా వెళ్తున్న తెల్లరంగు మారుతి ఎర్టిగా వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహన తనిఖీలో నలుగురు అనుమానితుల వద్ద ఓ నవజాత శిశువు ఉండటాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని ఒధవ్‌కు చెందిన వందనా పాంచల్ (34), హైదరాబాద్‌కు చెందిన రోషన్ అగర్వాల్ (42), వాట్వాకు చెందిన సుమిత్ యాదవ్ (27)గా గుర్తించారు. వాహన డ్రైవర్‌గా అహ్మదాబాద్‌కు చెందిన మౌలిక్ దవే (32) ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
విచారణలో ఈ శిశువును రూ.3.60 లక్షలకు కొనుగోలు చేసి మరింత ఎక్కువ ధరకు విక్రయించాలనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. హిమ్మత్‌నగర్ సమీపంలో మున్నా అనే వ్యక్తి నుంచి శిశువును కొనుగోలు చేసి, అహ్మదాబాద్ మీదుగా హైదరాబాద్‌కు తరలించాలనే యోచనతో ఉన్నారని తెలిపారు. హైదరాబాద్‌లో నాగరాజ్ అనే ఏజెంట్‌కు శిశువును అప్పగించాల్సి ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఒక్క ఒప్పందానికి పరిమితం కాకుండా పలు మధ్యవర్తుల భాగస్వామ్యంతో సాగుతున్న శిశు అక్రమ రవాణా చైయిన్‌లో భాగమని పోలీసులు భావిస్తున్నారు. ప్రతి దశలో వేర్వేరు వ్యక్తులు లాభం పొందేలా ఈ నెట్‌వర్క్ పనిచేస్తోందని అధికారులు తెలిపారు. పోలీసులు రూ.10,050 నగదు, సుమారు రూ.55 వేల విలువైన నాలుగు మొబైల్ ఫోన్లు, శిశువును తరలించేందుకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నలుగురితో పాటు శిశువును విక్రయించినవాడు, కొనుగోలుదారుడిపై కేసు నమోదు చేశారు. రక్షించిన నవజాత శిశువును తక్షణ వైద్య సహాయం కోసం శిశు ఆరోగ్య అధికారికి అప్పగించారు.
ఈ కేసులో హైదరాబాద్ లింక్ మరోసారి బయటపడిందని పోలీసులు తెలిపారు. గతంలో కూడా శిశు అక్రమ రవాణా కేసుల్లో వందనా పాంచల్, రోషన్ అగర్వాల్ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ గుజరాత్, తెలంగాణ మధ్య మధ్యవర్తులతో సంబంధాలు పెట్టుకుని అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు వీరి వద్ద నుంచి ముగ్గురు పిల్లలను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. అందులో ఒక ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. పరారీలో ఉన్న మున్నా, నాగరాజ్ సహా ఇతర నిందితులను పట్టుకునేందుకు పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. బేబీ బర్త్ రికార్డులు, వైద్య ఆధారాలు, ఆర్థిక లావాదేవీలను కూడా లోతుగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
