AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Currency History: గాంధీ కంటే ముందు.. భారత కరెన్సీపై ఎవరి చిత్రం ఉండేదో తెలుసా..?

స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే.. అంటే 1947 తర్వాత కూడా గాంధీజీ చిత్రం భారత కరెన్సీపై లేదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ సమయంలో కరెన్సీలో బ్రిటిష్ రాజు జార్జ్ VI ఫోటో ఉండేది. భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొందినప్పటికీ.. భారత కరెన్సీపై బ్రిటిష్ ప్రభావం వెంటనే ముగియలేదు. 1947 నుంచి 1949 వరకు, కింగ్ జార్జ్ VI చిత్రం కరెన్సీ నోట్లపై ముద్రించబడింది.

Indian Currency History: గాంధీ కంటే ముందు.. భారత కరెన్సీపై ఎవరి చిత్రం ఉండేదో తెలుసా..?
Indian Currency
Rajashekher G
|

Updated on: Jan 30, 2026 | 6:00 PM

Share

మనకు తెలిసినప్పటి నుంచి భారత కరెన్సీపై మహాత్మా గాంధీ చిత్రం తప్ప మరో చిత్రాన్ని చూడలేదు. కానీ, స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే.. అంటే 1947 తర్వాత కూడా గాంధీజీ చిత్రం భారత కరెన్సీపై లేదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ సమయంలో కరెన్సీలో బ్రిటిష్ రాజు జార్జ్ VI ఫోటో ఉండేది. భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొందినప్పటికీ.. భారత కరెన్సీపై బ్రిటిష్ ప్రభావం వెంటనే ముగియలేదు. 1947 నుంచి 1949 వరకు, కింగ్ జార్జ్ VI చిత్రం కరెన్సీ నోట్లపై ముద్రించబడింది. కొత్త భారతదేశం తన గుర్తింపు కోసం వెతుకుతున్నా… వలసవాద హ్యాంగోవర్ ఇంకా కొనసాగిన కాలం అది. అయితే, ఆ తర్వాత గాంధీజీ చిత్రం ఎందుకు ఎంచుకోబడింది. ఈ ఫోటో ఎక్కడ తీసింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భారత కరెన్సీపై మొదటిసారిగా గాంధీ చిత్రం

భారత కరెన్సీలో మొట్టమొదటి పెద్ద మార్పు 1949లో జరిగింది. ఒక రూపాయి నోటు నుంచి కింగ్ జార్జ్ VI చిత్రాన్ని తొలగించి, సారనాథ్‌లోని అశోక స్తంభం నుంచి సింహం ప్రతిరూపాన్ని ఉంచారు. అదే సమయంలో, భారత కరెన్సీపై మహాత్మా గాంధీ చిత్రాన్ని చేర్చాలనే ప్రతిపాదన కూడా చేశారు. డిజైన్ కూడా సిద్ధంగా ఉంది. కానీ, చివరికి ప్రభుత్వం అశోక స్తంభాన్ని ఖరారు చేసింది. ఎందుకంటే ఇది భారతదేశం యొక్క చారిత్రక, సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం.

మహాత్మా గాంధీ చిత్రం మొదటిసారిగా 1969లో భారత కరెన్సీ నోట్లపై కనిపించింది. ఈ సంవత్సరం గాంధీ జన్మ శతాబ్ది, ఈ సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి ఒక ప్రత్యేక స్మారక శ్రేణిని విడుదల చేశారు. ఈ శ్రేణిలో, సేవాగ్రామ్ ఆశ్రమం నేపథ్యంలో గాంధీ చిత్రం చిత్రీకరించబడింది. అయితే, ఇది సాధారణ కరెన్సీలో భాగం కాలేదు. పరిమిత కాలానికి మాత్రమే జారీ చేశారు.

1978లో నోట్ల రద్దు తర్వాత కరెన్సీలో మార్పులు

1978లో నోట్ల రద్దు తర్వాత, భారత కరెన్సీ నోట్ల రూపకల్పనలో కొన్ని మార్పులు వచ్చాయి. భారతీయ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలను కొత్త నోట్లపై చేర్చారు. ఈ కాలంలోనే కోణార్క్ చక్రం, నెమలి, ఇతర జాతీయ చిహ్నాలు కనిపించాయి. తరువాత, 1987లో, మొదటి 500 రూపాయల నోటు జారీ చేయబడింది. ఈ నోటులో గాంధీజీ చిత్రం ఉంది, కానీ వాటర్‌మార్క్‌లో అశోక స్తంభం కూడా ఉంది.

నకిలీ నోట్ల ముప్పుతో…

1990లలో, నకిలీ నోట్ల ముప్పు వేగంగా పెరిగింది. ఈ క్రమంలో పాత భద్రతా ప్రమాణాలు బలహీనంగా ఉన్నాయని నిరూపించబడ్డాయి. ఫలితంగా, 1996లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘మహాత్మా గాంధీ సిరీస్’ అనే కొత్త కరెన్సీ సిరీస్‌ను ప్రారంభించింది. ఇది సవరించిన వాటర్‌మార్క్, ప్రక్కన మెటల్ స్ట్రిప్, రహస్య చిత్రాలు, దృష్టి లోపం ఉన్నవారి కోసం పెరిగిన ముద్రణ వంటి కొత్త భద్రతా లక్షణాలను కల్పించారు. ఈ సిరీస్ తరువాత భారత కరెన్సీ యొక్క శాశ్వత గుర్తింపుగా మారింది.

నవ్వుతున్న గాంధీ ఫోటో ఎప్పుడు, ఎక్కడ తీయబడింది?

నేడు భారత కరెన్సీ నోట్లపై ముద్రించబడిన గాంధీజీ చిత్రం పెయింటింగ్ లేదా స్కెచ్ కాదు. ఇది 1946లో తీసిన వాస్తవ ఛాయాచిత్ర కటౌట్. ఈ ఫోటోలో, గాంధీజీ లార్డ్ ఫ్రెడరిక్ విలియం పాథిక్ లారెన్స్‌తో నిలబడి ఏదో విషయం గురించి హాస్యభరితమైన భంగిమలో ఉన్నారు. అప్పుడు తీసిన ఫొటోనే ఇది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని నోట్లపై ముద్రించడానికి అత్యంత పరిపూర్ణమైన, సహజమైన చిత్రంగా పరిగణించింది. మహాత్మా గాంధీ సత్యం, అహింస, ఐక్యతకు చిహ్నం, అందుకే ఆయన చిత్రం భారత కరెన్సీకి ప్రధాన ముఖంగా రూపొందించారు.