Akshaya Tritiya: అక్షయ తృతీయ నాటికి బంగారం ధర అంత పెరుగుతుందా..? లెక్కలు చూస్తే షాకే..
Akshaya Tritiya Gold Price: అక్షయ తృతియ అనగానే టక్కున గుర్తొచ్చేది బంగారం. అవును ఈ రోజు చాలా మంది గోల్డ్ కొంటారు. అటు షాపులు సైతం ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంటాయి. ప్రస్తుతం బంగారం ధర అంతకంతకూ పెరుగుతూ షాక్ ఇస్తుంది. మరి అక్షయ తృతియ నాటికి బంగారం ధరలు ఎలా ఉంటాయి..? పెరుగుతాయా..? తగ్గుతాయా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజులలో అక్షయ తృతీయ ఒకటి. అక్షయ అంటే తరిగిపోనిది అని అర్థం. ఈ రోజున చేసే ఏ శుభకార్యమైనా, కొనుగోలు చేసే ఏ వస్తువైనా అక్షయంగా వర్ధిల్లుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే 2026లో అక్షయ తృతీయ ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆర్థికంగా కూడా ఒక సంచలనానికి వేదిక కాబోతోంది. పురాణాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో మతపరమైన ప్రాముఖ్యత ఉంది. సత్యయుగం, త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభమయ్యాయని చెబుతారు. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు ఈ రోజే జన్మించారు. గంగా దేవి స్వర్గం నుంచి భూమికి అవతరించిన పుణ్యదినం కూడా ఇదే. మహాభారత కాలంలో పాండవులకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను ప్రసాదించిన రోజు ఇది. అందుకే దీనిని అభుజ ముహూర్తం అంటారు. అంటే ఎలాంటి ముహూర్త బలం చూడకుండానే ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించవచ్చు.
ముహూర్తం – పూజ సమయాలు
ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 19, ఆదివారం నాడు రానుంది. ఆరోజు ఉదయం 10:49 గంటలకు తిథి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 20 ఉదయం 7.27 గంటలకు తిథి ముగుస్తుంది. ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:20 గంటల వరకు పూజలకు మంచి సమయం అని పండితులు తెలిపారు. ఈ సమయంలో చేసే దానధర్మాలు, పూజలు అత్యంత ఫలప్రదమని పండితులు సూచిస్తున్నారు.
బంగారం ధరల షాక్: రూ. 2 లక్షల దిశగా?
అక్షయ తృతీయ అంటే బంగారం కొనుగోలుకు మారుపేరు. కానీ ప్రస్తుతం బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. ప్రస్తుత ధర 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1.69 లక్షల వద్ద ఉంది. పండుగ నాటికి పెరిగే విపరీతమైన డిమాండ్ కారణంగా తులం బంగారం ధర ఏకంగా రూ. 2 లక్షల మార్కును తాకే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఒక గ్రాము బంగారమైనా కొనగలమా అన్న సందేహం సామాన్యుల్లో నెలకొంది.
ధరలు తగ్గుతాయా..?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలు ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అమెరికాలో ట్రంప్ పరిపాలన తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలు సైతం మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన జరిగి, రాజకీయ సమీకరణాలు మారితే తప్ప ఈ ధరలు ఇప్పుడప్పుడే అదుపులోకి వచ్చేలా లేవని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా అక్షయ తృతీయ అనేది కేవలం సంపదను పెంచుకునే రోజు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శాంతిని పొందే పవిత్ర దినం. ఈ రోజున చేసే దానధర్మాలు జీవితంలో సౌఖ్యాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తాయని కోట్లాది మంది నమ్మకం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
