అందరికీ ఒకే రకమైన రక్తం ఎందుకుండదు..? వేర్వేరు గ్రూప్స్ వెనక అసలు రహస్యం ఇదే..
మనిషి ఆరోగ్యానికి రక్తం ఒక అద్దం లాంటిది. అందుకే వైద్యులు ఏ చిన్న సమస్య వచ్చినా మొదట రక్త పరీక్షనే సిఫార్సు చేస్తారు. మన రక్త కణాలపై ఉండే యాంటిజెన్లు మన శరీరానికి రక్షణ కవచంలా ఎలా పనిచేస్తాయి? ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ముల రక్త వర్గాలు ఎందుకు వేరుగా ఉంటాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వైద్యుడి దగ్గరకు వెళ్లినప్పుడు చిన్న ఆరోగ్య సమస్యకైనా మొదట రాసేది రక్త పరీక్ష. ఎందుకంటే మన శరీరంలో ఏం జరుగుతుందో చెప్పే అతిపెద్ద రిపోర్ట్ కార్డు మన రక్తమే. మన రోగనిరోధక వ్యవస్థ ఎలా ఉంది? శరీరం ఇన్ఫెక్షన్లతో ఎలా పోరాడుతోంది? వంటి కీలక విషయాలన్నీ రక్తకణాల ద్వారానే తెలుస్తాయి. మన రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాల పైన కొన్ని ప్రత్యేకమైన గుర్తులు ఉంటాయి. వీటిని శాస్త్రీయంగా యాంటిజెన్లు అని పిలుస్తారు. ఈ గుర్తుల ఆధారంగానే రక్తాన్ని ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించారు.
- Group A: ఎర్ర రక్త కణాలపై A యాంటిజెన్ ఉంటుంది.
- Group B: ఎర్ర రక్త కణాలపై B యాంటిజెన్ ఉంటుంది.
- Group AB: రెండూ గుర్తులు ఉంటాయి.
- Group O: ఎలాంటి గుర్తులు ఉండవు.
పాజిటివ్, నెగటివ్ అంటే ఏమిటి?
A, B మార్కర్లతో పాటు రక్తంలో Rh ఫ్యాక్టర్ అనే మరో ముఖ్యమైన గుర్తు ఉంటుంది.
- మీ రక్తంలో ఈ Rh మార్కర్ ఉంటే, మీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ (+).
- ఒకవేళ ఈ మార్కర్ లేకపోతే, అది నెగటివ్ (-).
అందుకే మనం రక్తాన్ని A పాజిటివ్, O నెగటివ్ లేదా AB పాజిటివ్ అని పిలుస్తాము. ముఖ్యంగా గర్భధారణ సమయంలో, రక్త మార్పిడి చేసేటప్పుడు ఈ Rh ఫ్యాక్టర్ చాలా కీలకం.
ఒకే కుటుంబం.. వేర్వేరు రక్త వర్గాలు! ఎందుకు?
రక్త వర్గాలు మనకు తల్లిదండ్రుల నుండి జన్యుపరంగా వారసత్వంగా వస్తాయి. ప్రతి బిడ్డ తన తల్లి నుండి సగం, తండ్రి నుండి సగం జన్యువులను పొందుతాడు. ఈ కలయికను బట్టి తోబుట్టువుల రక్త వర్గాలు కూడా వేర్వేరుగా ఉండవచ్చు. కేవలం ఒకేలాంటి కవలల్లో మాత్రమే రక్తం గ్రూపులు ఒకేలా ఉండే అవకాశం ఎక్కువ.
మీ రక్తం ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది
మన రోగనిరోధక వ్యవస్థ నిరంతరం రక్త కణాలను చెక్ చేస్తూ ఉంటుంది. తన సొంత గ్రూపుకు చెందిన కణాలను గుర్తించి వదిలేస్తుంది. కానీ పొరపాటున వేరే గ్రూపు రక్తం శరీరంలోకి వస్తే దానిని ఒక శత్రువు లాగా భావించి దాడి చేస్తుంది. సరిపోని రక్తం ఎక్కిస్తే శరీరం తీవ్రంగా స్పందిస్తుంది, ఇది ప్రాణాపాయానికి దారితీయవచ్చు. అందుకే శస్త్రచికిత్సలు, రక్తదానాల సమయంలో వైద్యులు గ్రూపును పక్కాగా సరిచూస్తారు. కాగా O నెగటివ్ రక్తాన్ని యూనివర్సల్ డోనర్ అంటారు.. అంటే ఇది ఎవరికైనా సెట్ అవుతుంది. అలాగే AB పాజిటివ్ ఉన్నవారు ఎవరి రక్తాన్నైనా తీసుకోగలరు.
