AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Politics: ఓవైపు ఎన్డీయే భేటీ.. ఇంకోవైపు బీజేపీయేతర విపక్షాల సమావేశం.. కీలక పరిణామాల దిశగా జాతీయ రాజకీయాలు

పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా జాతీయ పార్టీలు తమ తమ పొలిటికల్ అలయెన్సెస్‌ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లైక్ మైండెడ్ పార్టీలను కలుపుకునే పనిని చాలా కాలం క్రితమే ప్రారంభించింది. అయితే, కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాలను రెండు విడతలుగా...

National Politics: ఓవైపు ఎన్డీయే భేటీ.. ఇంకోవైపు బీజేపీయేతర విపక్షాల సమావేశం.. కీలక పరిణామాల దిశగా జాతీయ రాజకీయాలు
BJP Congress
Rajesh Sharma
| Edited By: Narender Vaitla|

Updated on: Jul 16, 2023 | 8:16 PM

Share

పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా జాతీయ పార్టీలు తమ తమ పొలిటికల్ అలయెన్సెస్‌ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లైక్ మైండెడ్ పార్టీలను కలుపుకునే పనిని చాలా కాలం క్రితమే ప్రారంభించింది. అయితే, కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాలను రెండు విడతలుగా నడిపిన భారతీయ జనతా పార్టీ తాజాగా అలయెన్స్ బలోపేతంపై దృష్టి సారించింది. గత తొమ్మిదేళ్ళుగా మిత్రపక్షాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలను ఎదుర్కొంది బీజేపీ. అదేసమయంలో చిరకాలంగా తమతో కొనసాగిన మిత్ర పక్షాలను దూరం చేసుకుంది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాళీదళ్ మూడేళ్ళక్రితమే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకూ గుడ్ బై చెప్పింది. మహారాష్ట్ర రాజకీయాలలో ఎవరిది పైచేయి అన్న అంశంపై శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకుని, చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ చంకనెక్కింది. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ, నితీశ్ కుమార్ జేడీయూ, పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ ఇలా ఎన్డీయేకు దగ్గరై దూరం జరిగిన పార్టీలు చాలానే వున్నాయి. వాటిలో కొన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్డీయేని వీడితే.. మరికొన్ని బీజేపీ పట్టించుకోవడం లేదంటూ కూటమిని వీడాయి.

మరోవైపు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఫలితాల తర్వాత 2024 ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతోంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తేవడానికి యధాశక్తి ప్రయత్నిస్తోంది. అవసరమైతే ఓ మెట్టు దిగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించిన కాంగ్రెస్ నేతల ధోరణి దీనినే చాటుతోంది. పాట్నాలో జరిగిన సమావేశంలో ఢిల్లీ ఆర్డినెన్సుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో కినుక వహించి, విపక్షాల మలి భేటీ బెంగళూరు సమావేశానికి గైర్హాజరయ్యే సంకేతాలు కేజ్రీవాల్ పార్టీ వైపు నుంచి రావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఓ మెట్టు దిగి వచ్చి మరీ సయోధ్య చేసుకుంది. బెంగళూరు భేటీకి హాజరయ్యే బీజేపీయేతర పార్టీల సంఖ్య తగ్గకుండా జాగ్రత్తపడింది. జులై 17, 18 తేదీలలో బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో బీజేపీయేతర విపక్షాలు సమావేశం కాబోతున్నాయి. అయితే తొలి రోజు భేటీకి, విందుకు బెంగాల్ దీదీ మమతా బెనర్జీ రాకపోవడం వెనుక మతలబేంటన్నదిపుడు చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యం కారణంగా తొలి రోజు భేటీకి రావడం లేదని దీదీ చెప్పుకోవచ్చు గాక.. రెండో రోజు బేటీకి వచ్చే ఓపిక వున్నప్పుడు తొలి రోజు ఎందుకు గైర్హాజరవుతున్నారన్నది ఆసక్తి రేపుతోంది. మొత్తమ్మీద బెంగళూరు భేటీ తర్వాత విపక్షాల కూటమికి ఓ షేపు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ జాతీయతావాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తమ కూటమి పేరులో ‘జాతీయ’ అనే పదం వుండేలా చూసుకుంటున్నాయి బీజేపీయేతర విపక్ష పార్టీలు.

భారతీయ జనతా పార్టీ ఎన్డీయే అవసరాన్ని కాస్త లేటుగానే గుర్తించింది. 2014, 2019 ఎన్నికల్లో ఎవ్వరి మీదా ఆధారపడనంత సంఖ్యలో ఎంపీలను గెలుచుకున్న పార్టీ కూటమిలోని పార్టీల అభిప్రాయాలతో పని లేకుండానే నిర్ణయాలు తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఎవరినీ పట్టించుకోకుండా బీజేపీ విధానాలను దూకుడుతనంలో మోదీ ప్రభుత్వం అమలు చేసేసింది. ఆనాడు ఉభయ సభల్లో జరిగిన చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన తీరు.. ఎంత హుందాగా వుందో అంతే స్థాయిలో అతి విశ్వాసంతో కనిపించింది. ఇది ఎన్డీయేలోని చిన్న పార్టీలకు కాస్త ఇబ్బందిగానే వున్నా సంఖ్యాబలానికి తలవంచారు చాలా మంది. ఇపుడు మరోసారి లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఉత్తరాది పార్టీగా పేరున్న బీజేపీ.. ఉత్తర భారత రాష్ట్రాలలో ఇప్పటికే పీక్ లెవెల్ సీట్లను గెలుచుకుంది. అక్కడ ఇంకా నెంబర్ పెంచుకునే అవకాశం తక్కువ. ఇంకా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాలలో 2019 నాడు గెలుచుకున్న నెంబర్ ఈసారి పొందడం కష్టమే. ఈ క్రమంలో ముందుగా దక్షిణాదిన తమ ఎంపీ సీట్ల సంఖ్యను పెంచుకోవాలని ప్లాన్ చేశారు కమల నాథులు. కానీ కర్నాటక ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వెలువడడంతో ఎన్డీయే బలోపేతంపై బీజేపీ అధినాయత్వం దృష్టి సారించింది. పాత మిత్రులతో భేటీకి జులై 18వ తేదీని ఖరారు చేశారు బీజేపీ నేతలు. ఈ భేటీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరు అవుతారన్న సందేశాన్ని మిత్రులకు పంపారు. ప్రస్తుత మిత్రులతోపాటు గతంలో కూటమి నుంచి వైదొలగిన పార్టీలకు ఆహ్వానం పంపారు. శిరోమణి ఆకాలీదళ్, శివసేన (షిండే వర్గం), లోక్‌జనశక్తి పార్టీలతోపాటు ఈశాన్య రాష్ట్రాలలోని చిన్నా చితకా మిత్ర పార్టీలకు ఆహ్వానం పంపారు. అదేసమయంలో ఇటీవల బీజేపీ దగ్గరైన ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)కి కూడా ఆహ్వానం పంపారు. బీజేపీకి దగ్గరవ్వాలనుకుంటున్న చంద్రబాబుకు మాత్రం ఆహ్వానం రాకపోవడం విశేషం. ఏపీలో ఇదివరకే మిత్రపక్షంగా వున్న జనసేనకు ఆహ్వానం వెళ్ళింది. జులై 18 తర్వాత ఎన్డీయేపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఆనాటి సమావేశంలో మిత్ర పక్షాలు ఎన్డీయే విస్తరణకు ఏమైనా సూచనలు చేస్తే వాటి ఆధారంగా మరిన్ని పార్టీలకు ఆహ్వానం పంపుతారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మిత్రపక్షాల అవసరాన్ని గుర్తించిన భారతీయ జనతా పార్టీ, వాటిని బలపరిచే దిశగా అడుగులేస్తోంది. యుపీలో చిన్న పార్టీలైన అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తు కొనసాగిస్తోంది. యుపీలో మరో పార్టీ సుహెల్ దేవ్ బీఎస్పీని అక్కున చేర్చుకోబోతోంది. బీహార్‌లో తమకు ఒకప్పుడు మొండి చేయి చూపిన జితన్ రామ్ మాంఝీ, వికాస్ షీల్ పార్టీ, కుష్వాహా పార్టీలను దాదాపు తమ వైపునకు తిప్పేసుకుంది బీజేపీ నాయకత్వం. కర్నాటకలో జనతా దళ్ సెక్యులర్ పార్టీని కూటమిలో చేర్చుకునే యత్నాలను బీజేపీ నాయకత్వం వేగవంతం చేసింది. ఇటీవల కాలంలో మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు ఆయన ఎన్డీయేకు దగ్గరవుతున్నారన్న సంకేతాలు బలోపేతం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే స్నేహంగా వున్న బీజేపీ.. చంద్రబాబా లేక వైఎస్ జగనా అన్న ద్విముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. ఎన్నికలకు ముందుగానే ఫ్రెండ్షిప్ కలపుకోవాలని చూస్తున్న బీజేపీ అందుకు వైఎస్ జగన్‌పై ఒత్తిడి పెడుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎన్డీయేలోకి అధికారికంగా చేరి, ముస్లింలకు దూరమవడం ఇష్టం లేని జగన్ బయట్నించి మద్దతుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ముందస్తు పొత్తుకు వైఎస్ జగన్ ససేమిరా అంటే అప్పుడు జనసేన సూచన మేరకు తెలుగుదేశం పార్టీకి బీజేపీ స్నేహహస్తం చాచే అవకాశముందని సమాచారం. మొత్తమ్మీద జులై 17, 18 తేదీలలో విపక్షాల భేటీ, జులై 18న బీజేపీ సారథ్యంలో ఎన్డీయే కూటమి భేటీ జాతీయ రాజకీయాలలో కొత్త మార్పుకు దారి తీయవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..