ఆఫ్ఘన్ పరిణామాలను చూసి గుణపాఠం నేర్చుకోండి.. కేంద్రానికి పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ చురక.. బీజేపీ ఖండన
ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలను చూసి గుణపాఠం నేర్చుకోవాలని జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ నేత, మాజీ సీఎం మెహబాబా ముఫ్తీ సూచించారు. అక్కడ తాలిబన్లు ..అమెరికన్లను పారదోలి అధికారాన్ని కైవసం చేసుకున్నారని..
ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలను చూసి గుణపాఠం నేర్చుకోవాలని జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ నేత, మాజీ సీఎం మెహబాబా ముఫ్తీ సూచించారు. అక్కడ తాలిబన్లు ..అమెరికన్లను పారదోలి అధికారాన్ని కైవసం చేసుకున్నారని.. ఇప్పటికైనా కేంద్రం జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు. 2019 లో జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదాను కేంద్రం రద్దు చేసింది. పైగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కాగా కుల్గామ్ జిల్లాలో తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ముఫ్తీ..పొరుగున ఉన్న ఆఫ్ఘానిస్తాన్ లోని పరిణామాలను కేంద్రం గమనించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను సవరించుకోవాలని..ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్దరించే విషయమై చర్చలను ప్రారంభించాలని కోరారు. దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి మాదిరి మీరెందుకు మీ విధానాలను మార్చుకోవడంలేదని ఆమె ప్రశ్నించారు. అక్రమంగా-రాజ్యాంగ విరుద్ధంగా జమ్మూ కాశ్మీర్ ఐడెంటిటీని లాగేసుకున్నారని ఆరోపించారు. కానీ తుపాకులు, రాళ్ల వల్ల ఈ సమస్య పరిష్కారం కాదని, అందువల్ల కార్యకర్తలు ప్రశాంతంగా నిరసన తెలపాలన్నారు.
అయితే ఈమె వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. మెహబూబా ముఫ్తీ ద్వేష పూరిత ప్రచారం చేస్తున్నారని ఈ పార్టీ ఆరోపించింది. ..కాశ్మీర్ ప్రజలు దేశ భక్తులని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో వారు పోలీసులకు, సాయుధ దళాలకు తోడ్పడుతున్నారని జమ్ము కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా అన్నారు. ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు మహిళల పట్ల, జర్నలిస్టుల పట్ల చూపుతున్న అరాచకాలను ఆమె పట్టించుకోవడం లేదా అని ఆయన ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్ లో ముఫ్తీకి ఆదరణ లేదని, ఆమెను ప్రజలు తిరస్కరించారని ఆయన దుయ్యబట్టారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Afghanistan Crisis: అమెరికా మిలటరీ విమానంలో ప్రసవించిన ఆఫ్గన్ మహిళ.. జర్మనీలో చికిత్స..
కాబూల్ విమానాశ్రయం నుంచి 107 మంది భారతీయుల తరలింపు..ఢిల్లీ చేరిన ఇండిగో, ఎయిరిండియా విమానాలు