AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manmohan Singh Death: ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

దేశ ప్రధానిగా, ఆర్ధిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్ గా ఎన్నో కీలక పదవుల్లో విశిష్టమైన సేవలు అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు..

Manmohan Singh Death: ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
Manmohan Singh
Srilakshmi C
|

Updated on: Dec 27, 2024 | 6:42 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 27: ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఒక ఆర్థిక వేత్తగా, ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా ఆయన దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదని అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో దేశ ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజ్ఞానం, వినయం, నిబద్ధతకు మన్మోహన్ సింగ్ ప్రతీకని కొనియాడారు. 1991లో ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా దేశానికి వెలకట్టలేని సేవలందించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం

మన్మోహన్‌ మృతిపట్ల ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని, దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణల ఆద్యులలో ఆయన ఒకరని కొనియాడారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, యూజీసీ ఛైర్మన్‌గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని కేసీఆర్ అన్నారు. ఈ మేరకు కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం

భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ మరణం పట్ల మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. పదేళ్లపాటు దేశ ప్రధానిగా గొప్ప సేవలందించారని ప్రశంసించారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషిచేశారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిటీ చైర్మన్‌గా.. ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్‌ సింగ్‌ గొప్ప మేధావి అని కొనియాడారు. దేశంలో పేదరికాన్ని పారదోలేందుకు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అసమాన సేవలందించారని, ఆయన కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఏ బాధ్యత నిర్వహించినా.. ప్రతి చోటా తనదైన ముద్ర కనబర్చారని గుర్తు చేశారు. ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మన్మోహన్‌సింగ్‌ మృతితో దేశం ఒక మహా నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.