MALLIKARJUNA KHARGE: దక్షిణాది దళిత నేతకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. క్లిష్టతరుణంలో ఖర్గే ముందు పెను సవాళ్ళు.. అతిపెద్ద సవాల్ అదే!

రెండు నెలల వ్యవధిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వున్నాయి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన దృష్టి సారించాల్సిన ఎన్నికలివి. చివరిగా ఖర్గేలో ఉత్సాహాన్ని రెట్టింప జేసే ఒకే ఒక అంశం...

MALLIKARJUNA KHARGE: దక్షిణాది దళిత నేతకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. క్లిష్టతరుణంలో ఖర్గే ముందు పెను సవాళ్ళు.. అతిపెద్ద సవాల్ అదే!
Sonia Gandhi -Mallikarjun Kharge- Rahul Gandhi
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 19, 2022 | 4:16 PM

అందరు ఊహించినట్లుగానే కురువ‌ృద్ధ దక్షిణాది దళిత నేత అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. నెహ్రూ కుటుంబీకుల పరోక్ష మద్దతే ఆయన భారీ విజయానికి బాటలు వేసిందన్నది బహిరంగ రహస్యమే. మొత్తం పోలైన ఓట్లలో మల్లికార్జున ఖర్గేకు 7 వేల 897 ఓట్లు రాగా.. శశిథరూర్‌కు కేవలం 1,072 ఓట్లు మాత్రమే పడ్డాయి. 6 వేల 825 ఓట్ల తేడాలో ఖర్గే ఏఐసీసీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. జాతీయ స్థాయి నేతలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ నేతల ఓటర్ల జాబితాలో నాలుగు వందలకుపైగా ఓట్లు చెల్లకుండా పోవడం. దశాబ్దాల రాజకీయ అనుభవం వున్న నాలుగువందలకు పైగా నేతలు సొంత పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేయలేక.. చెల్లుబాటు కాని ఓట్లు వేయడం విశేషం. సరే.. ఆ సంగతి పక్కన పెడితే పీవీ నరసింహారావు తర్వాత ఇంకా చెప్పాలంటే దాదాపు 26 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఓ దక్షిణాది నేత ఎన్నికయ్యారు. ఖర్గే దళిత వర్గానికి చెందిన వాడు కావడం పార్టీకి ఓ ప్లస్ పాయింట్ భావించవచ్చు. సీతారాం కేసరి 1998లో పార్టీ అధ్యక్ష పదవిని వీడిన తర్వాత తొలిసారి నెహ్రూ కుటుంబేతర వ్యక్తి ఇపుడే అధ్యక్షుడయ్యారు. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం ఆపత్కాలంలో తెలంగాణ తేజం పీవీ నరసింహారావు అయిదేళ్ళపాటు పార్టీ అధ్యక్షునిగా, దేశ ప్రధానిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 1996 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంతో పీవీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సోనియా ఆశీస్సులతో బీహార్‌కు చెందిన సీతారాం కేసరి పార్టీ అధ్యక్షుడయ్యారు. అయితే ఆయన పదవిలో వున్న రెండేళ్ళలో పార్టీ శ్రేణుల నుంచి మరీ ముఖ్యంగా పార్టీ సీనియర్ల నుంచి ఎన్నో నిరసనలు ఎదుర్కొన్నారు. అందుకు కారణం 1996 ఏప్రిల్‌లో దేవెగౌడ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తూ కేసరి తీసుకున్న నిర్ణయం ప్రధానంగా విమర్శల పాలైంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ఇంద్రకుమార్ గుజ్రాల్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడినా జైన్ కమిషన్ నివేదిక యునైటెడ్ ఫ్రంట్‌ ప్రభుత్వంలో చిచ్చు రేపింది. రాజీవ్ గాంధీ హత్యపై విచారణ జరిపిన జైన్ కమిషన్.. హత్యకు జరిగిన కుట్రలో డిఎంకే నేతలున్నారని తేల్చింది. ఆనాటి యుఎఫ్ ప్రభుత్వంలో డిఎంకే కూడా భాగస్వామి. రాజీవ్ గాంధీని చంపాలనుకున్న ఎల్టీటీఈకి పలువురు డిఎంకే నేతలు సహకరించినట్లు జైన్ కమిషన్ తేల్చింది. గుజ్రాల్ ప్రభుత్వంలో ముగ్గురు డిఎంకే మంత్రులున్నారు. వారిని తప్పించాలని సీతారాం కేసరి ప్రధాని గుజ్రాల్‌ని డిమాండ్ చేశారు. తమ ప్రియతమ నేత రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర చేసిన పార్టీ తరపున మంత్రులున్న ప్రభుత్వానికి మద్దతివ్వలేమంటూ సీతారాం కేసరి.. ప్రధాని గుజ్రాల్‌కు లేఖాస్త్రాలు సంధించారు. 1997 నవంబర్ 20 నుంచి 27 తేదీల మధ్య కేసరి, గుజ్రాల్ మధ్య లేఖల పర్వం కొనసాగింది. డిఎంకే మంత్రులను తప్పించలేనని గుజ్రాల్ ఖరాఖండిగా చెప్పేయడంతో ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని కేసరి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని పలువురు పార్టీ సీనియర్లు తప్పు పట్టారు. గుజ్రాల్ ప్రభుత్వం పడిపోవడంతో మధ్యంతర ఎన్నికలకు రంగం సిద్దమైంది. అయితే పార్టీ ఎన్నికలకు సిద్దంగా లేని సందర్భంలో మద్దతు ఉపసంహరణ నిర్ణయం తప్పని పార్టీ నేతలు పలువురు వ్యాఖ్యానించారు. అదేసందర్భంలో సోనియా గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. 1998లో పార్టీ తరపున ఆమె విస్తృతంగా ప్రచారం చేసినా.. పార్టీ 140 స్థానాలకు మించి గెలవలేకపోయింది. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ సీతారం కేసరి అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడంతో సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇక్కడో అంశాన్ని చెప్పుకోవాలి. 1998 నాటి ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని కేసరి భావించినా ఆయన్న ఏఐసీసీ కార్యాలయంలోనే దారుణంగా అవమానించారు. పార్టీ శ్రేణులు ఘర్షణ మధ్య కేసరిని ధోవతి విప్పించి పరిగెత్తించారు. అత్యంత అవమానకరంగా ఆయన్ను సాగనంపారు. ఆ తర్వాత రెండేళ్ళకు అంటే 2000 సంవత్సరంలో కేసరి కన్నుమూశారు. ఆ తర్వాత మొన్నామధ్య రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలప్పగించే వరకు సోనియానే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే సోనియా అన్న చందంగా పార్టీని నడిపించారు.. నియంత్రించారు. 1998-2022 మధ్య సోనియా, రాహుల్ ఇద్దరు పార్టీ సారథులుగా నెహ్రూ కుటుంబం తరపున అధ్యక్షులుగా కొనసాగారు. ఇన్నాళ్ళకు అంటే దాదాపు 24 సంవత్సరాల తర్వాత నెహ్రూ కుటుంబేతర వ్యక్తి పార్టీ అధ్యక్షుడయ్యారు. ఇక్కడి వరకు బాగానే వున్నా.. ఇకపైనే మల్లికార్జున ఖర్గేకి సవాళ్ళ పర్వం ఎదురు కాబోతోందన్నది తాజాగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు విముఖత ప్రదర్శించడంలో పార్టీ అధ్యక్షుడయ్యే అర్హతలున్న వ్యక్తి ఎవరా అన్న చర్చ మొదలైంది. అక్టోబర్ 17వ తేదీన అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమైన తరుణంలో కూడా రాహుల్ గాంధీనే బాధ్యతలు చేపట్టేలా ఒప్పించే ప్రయత్నాలు జరిగాయి. కానీ, పార్టీకి పునర్వైభవం రావాలన్న ఆకాంక్షతో సుదీర్ఘ పాదయాత్రకు సిద్దమైన రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేప్టటేందుకు ససేమిరా అన్నారు. రాహుల్ అభిమతాన్ని గౌరవిస్తూ సోనియా గాంధీ ప్రత్యామ్నాయ నేతలను అన్వేషించడం మొదలెట్టారు. ముందుగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ని బరిలోకి దింపాలని ఆమె భావించారు. దానికి రాహుల్ గాంధీ కూడా ఓకే అన్నారు. అంతా సజావుగా జరుగుతుందనుకుంటున్న తరుణంలో అశోక్ గెహ్లాట్ రెండు పదవుల్లో.. అంటే రాజస్థాన్ సీఎం పదవిలో కొనసాగుతూనే పార్టీ జాతీయ అధ్యక్షునిగా వుండాలని భావించడంతో పరిస్థితి తారుమారైంది. ఓ దశలో సీఎం పదవిని వదులుకునేందుకు సిద్దమైన గెహ్లాట్.. రాజస్థాన్‌లో నెంబర్ టూ గా కొనసాగుతున్న సచిన్ పైలట్‌ను సీఎం చేయవద్దని పంతం పట్టడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. తన పంతం నెగ్గించుకునే క్రమంలో రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభానికి గెహ్లాట్ కారణమయ్యారు. పార్టీకి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌ని సీఎం చేయవద్దన్న డిమాండ్‌ను తెరమీదికి తెచ్చారు. తమ మాట కాదంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరించారు. దాంతో పరిస్థితిని చక్కదిద్దడానికి మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌లను సోనియా గాంధీ జైపూర్ పంపించాల్సి వచ్చింది. అక్కడి సంక్షోభానికి కారకులంటూ ఇద్దరు మంత్రులు, ఓ చీఫ్ విప్‌లకు షోకాజ్ నోటీసులిచ్చారు. అయితే రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెరచాటు వ్యూహం అశోక్ గెహ్లాట్‌దేనని తేలడంతో సోనియా ఆయన్ని అధ్యక్ష ఎన్నిక నుంచి తప్పించారు. ఇతర నేతల పేర్లను పరిశీలించారు. ఏకే ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్ వంటి నేతల పేర్లను పరిశీలించినా.. చివరికి తమ కుటుంబానికి వీరవిధేయుడైన మల్లికార్జున ఖర్గే వైపే సోనియా మొగ్గు చూపారు. దాంతో ఆమె ఆశీస్సులతో ఖర్గే పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. అంతకు ముందు నుంచే పోటీలో వుంటానంటూ వస్తున్న కేరళ నేత శశిథరూర్ కూడా బరిలో నిలిచారు. ఇద్దరిలో ఎవరికీ గాంధీ కుటుంబ ఆశీస్సులు లేవని, నేతలు ఇద్దరిలో ఎవరికైనా తమ ఓటు వేయవచ్చని బహిరంగంగా చెబుతూ వచ్చినా.. ఖర్గేకే సోనియా, రాహుల్, ప్రియాంకల ఆశీస్సులున్నాయని అందరూ భావించారు. అందుకే శశిథరూర్‌పై ఆయన భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.

గత దశాబ్దకాలంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. అందరూ నమ్ముకున్న రాహుల్ గాంధీ నిరాశ పర్చడంతో ఇపుడు పార్టీలో జవసత్వాలు నింపి, పునర్వైభవాన్ని తెచ్చి పెట్టే నేత కావాలని అందరు ఆశించారు. అయితే ఇపుడు పార్టీ అధ్యక్షుడవుతున్న మల్లికార్జున ఖర్గే తనదైన శైలిలో పార్టీని నడిపిస్తారా లేక సోనియా, రాహుల్ మార్గదర్శకత్వంలోనే నడచుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం అన్నట్లుగా ఎవరు గెలిచినా నెహ్రూ కుటుంబం కనుసన్నల్లోనే వుంటారన్నది నిష్టురసత్యం. 60వ దశకంలో మద్రాసీ నేత కామరాజ్ నాడార్, 90వ దశకంలో తెలంగాణ నేత పీవీ నరసింహారావు తరహాలో ఇండిపెండెంట్‌గా పార్టీని చక్కదిద్దేందుకు ఖర్గే ప్రయత్నిస్తే ఆయన ఎంతో కాలం పదవిలో కొనసాగే అవకాశాలు తక్కువ. అయితే ఇపుడాయన భుజస్కంధాలపై పెద్ద బాధ్యతే వుంది. డైనాస్టీక్ పాలిటిక్స్ ముద్రను పార్టీపై నుంచి తొలగింపజేయడమన్నది అంత సులువు కాదు. ఇది ఖర్గే ముందున్న అతిపెద్ద సవాలుగా చెప్పవచ్చు. ఓవైపు అంతర్జాతీయ స్థాయిలో చరిష్మాతో దూసుకుపోతూ.. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నినాదాన్ని వినిపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కొవడం ఖర్గేకు సవాలేనని చెప్పాలి. 2014-2019 మధ్యకాలంలో ఖర్గే లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వున్నారు. అయిదేళ్ళపాటు సభలో పార్టీ వాణిని వినిపించేందుకు యధాశక్తి యత్నించారు. సభలో పార్టీ వాణిని ఎలా వినిపించాలో, పార్టీ లైన్‌ని ప్రజల్లోకి ఎలా వ్యాప్తి చెందించాలో ఖర్గేకు బాగా తెలుసు. అయితే అప్పుడు ఆయన సోనియా డైరెక్షన్‌లో పని చేసేవారు. మరిప్పుడు జాతీయ అధ్యక్షుడైనా కూడా సోనియా మార్గదర్శకాలను పాటిస్తూ వుంటే తనదైన ముద్ర వేయలేరు. వ్యక్తి మారినా పార్టీ పగ్గాలు నెహ్రూ కుటుంబం చేతిలోనే వున్నాయన్న సందేశం ప్రజల్లోకి వెళ్ళకుండా వుండదు. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ డిజిట్ 60 ఎంపీ స్థానాలను దాటలేదు. అటు రాజ్యసభలోను పార్టీ పరిస్థితి దారుణంగా పడిపోయింది. ఇలాంటి తరుణంలో ఖర్గే భుజస్కంధాలపై పెద్ద బాధ్యతే వుంది. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సంసిద్దం చేయడం ఆయన ముందున్న ఇంకో పెద్ద సవాలు. చిరకాలంగా గాంధీ, నెహ్రూ కుటుంబ నేతలపైనే ఆధారపడడం అలవాటైన కాంగ్రెస్ పార్టీలో ఇపుడు ఖర్గేకు సమాంతరంగా సోనియా, రాహుల్ కోటరీలు, కార్యాలయాలు పనిచేయడం ఆయనకు ఎంబర్రాసింగ్ కలిగించే అంశాలు. 2024 జనరల్ ఎలెక్షన్ కంటే ముందు ఇంకా చెప్పాలంటే వచ్చే 17 నెలల్లో దేశంలోని 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్న రాజస్థాన్, చత్తీస్‌గఢ్ కూడా వున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకోవడంతోపాటు తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోను మెరుగైన ఫలితాలు రాబట్టాల్సిన బాధ్యత ఇపుడు ఖర్గే ముందున్నది. ఎందుకంటే ఈ పదకొండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోను పార్టీ పరిస్థితి మెరుగుపడకపోతే.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లోను ఆ ప్రభావం పడడం ఖాయం. అప్పుడు 2014, 2019 నాటి ఫలితాలనే కాంగ్రెస్ పొందాల్సి వస్తుంది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్‌లోను త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. కశ్మీర్ నుంచి సుదీర్ఘకాలంపాటు పార్టీలో సేవలందించిన మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడారు. సొంత పార్టీని ప్రకటించారు. ఈక్రమంలో కశ్మీర్‌లో మెరుగైన ఫలితాలను రాబట్టాల్సిన బాధ్యత ఖర్గే ముందున్నది. ఇది కూడా ఆయనకు పెద్ద సవాలే. మరో నెలా, రెండు నెలల వ్యవధిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వున్నాయి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన దృష్టి సారించాల్సిన ఎన్నికలివి. చివరిగా ఖర్గేలో ఉత్సాహాన్ని రెట్టింప జేసే ఒకే ఒక అంశం వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత 1996 నాటి ఫలితాలు వస్తాయన్న ఓ విశ్లేషణ మాత్రమే. ఆనాడు అయిదేళ్ళపాటు ప్రధాని పదవిలో వున్న పీవీ నరసింహారావు సారథ్యంలో పార్టీ పార్లమెంటు ఎన్నికలకు వెళ్ళింది. ఫలితం హంగైంది. బీజేపీకి విజయం దక్కినట్లే దక్కి.. చేజారింది. 13 రోజుల వాజ్‌పేయి ప్రభుత్వం తప్పుకోవడంతో దేవెగౌడ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ అంటూ ఏర్పడితే, కాంగ్రెస్ పార్టీ పలు చిన్నా, చితకా పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే.. అది కూడా అతుకుల బొంతలాంటి ప్రభుత్వం అయితే, అలాంటి ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా లేకపోతే.. లక్కు చిక్కి ఖర్గే ప్రధాని అయ్యే అవకాశాలున్నాయన్న విశ్లేషణ తాజాగా వినిపిస్తుంది. ఈ అంశమే ఇపుడు ఖర్గేలో ఉత్సాహాన్ని రెట్టింపజేసే అంశాగా చెప్పుకోవాలి.

ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా