AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర ఎన్నికల వేళ రాజకీయ రచ్చ రాజేసిన ఓటుకు నోటు వివాదం..!

పాల్ఘర్‌ హోటల్‌లో గొడవకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. హోటల్‌లో రూ. 9 లక్షలకు పైగా నగదు లభించినట్టు పోలీసులు వెల్లడించారు.

మహారాష్ట్ర ఎన్నికల వేళ రాజకీయ రచ్చ రాజేసిన ఓటుకు నోటు వివాదం..!
Vinod Tawde
Balaraju Goud
|

Updated on: Nov 19, 2024 | 11:39 PM

Share

మహారాష్ట్ర ఎన్నికల వేళ ముంబైలో హైడ్రామా చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత ఓటుకు నోటు వివాదంలో చిక్కుకోవడం సంచలనం రేపింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , సీనియర్‌ నేత వినోద్‌ తావ్డే సమావేశం నిర్వహిస్తున్న హోటల్‌ను మహా వికాస్‌ అఘాడి , బహుజన్‌ వికాస్‌ అఘాడి కూటమి కార్యకర్తలు చుట్టుముట్టారు. వినోద్‌ తావ్డే హోటల్‌లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వినోద్‌ తావ్డేను కార్యకర్తలు చుట్టుముట్టడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను వినోద్‌ తావ్డే తీవ్రంగా ఖండించారు. హోటల్‌లో తాను కార్యకర్తలతో సమావేశమవుతున్న సమయంలో దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనపై ఈసీ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను అధికారులు విడుదల చేయాలని కోరారు. తనను హోటల్‌ నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

కార్యకర్తలతో సమావేశమయ్యానని, పోలింగ్‌పై వాళ్లకు వివరించా.. ఈవీఎంలకు సీల్‌ ఎలా వేస్తారు.. అభ్యంతరాలు ఉంటే ఎలా వ్యక్తం చేయాలి.. పలు అంశాలపై కార్యకర్తలకు వివరించానని తావ్డే తెలిపారు. తమ మిత్రపక్షాల నేతలు కూడా అక్కడే ఉన్నారు. విపక్షాలు మాత్రం మేము డబ్బులు పంచుతున్నట్టు ఆరోపిస్తున్నాయని, ఎన్నికల సంఘం, పోలీసులు దీనిపై దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.

మరోవైపు, ఓటర్లకు డబ్బులు పంచుతూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన వినోద్‌ తావ్డేను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని శివసేన నేత ఉద్దవ్‌ ఠాక్రే ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేసి గెలవడానికి బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే. దీనిపై కఠినచర్యలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం ఏం చేస్తుందో చూస్తామని అన్నారు.

ఇదిలావుంటే, పాల్ఘర్‌ హోటల్‌లో గొడవకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. హోటల్‌లో రూ. 9 లక్షలకు పైగా నగదు లభించినట్టు పోలీసులు వెల్లడించారు. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించినందుకు వినోద్‌ తావ్డేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, వినోద్ తావ్డే 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముంబైలోని బోరివలి స్థానం నుంచి బీజేపీ ఆయనను అభ్యర్థిగా నిలిపింది.

బోరేవలి సీటు బీజేపీకి కంచుకోట. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వినోద్ తావ్డే మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. ఆ సమయంలో తావ్డేకు అత్యంత ముఖ్యమైన విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు రవాణా, మైనారిటీ, సరిహద్దు భద్రత, పార్లమెంటరీ వ్యవహారాల వంటి ముఖ్యమైన శాఖల బాధ్యతలను తావ్డేకు అప్పగించారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తావ్డే చిక్కుల్లో పడ్డారు. బీజేపీ ఆయనకు సరియైన గుర్తింపు ఇవ్వలేదు. టికెట్ కట్ అయిన మొదటి సీనియర్ మంత్రి తావ్డే. టికెట్ నిరాకరించడంతో తావ్డే రాజకీయాల్లోకి దూరమయ్యాడు. రెండేళ్లుగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఒంటరిగా ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..