Maha Kumbh: కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్‌ జాబ్స్‌ సతీమణి..!

మహా కుంభమేళాలో పాల్గొనేందుకు యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్ యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటిస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఆమె అస్వస్థతకు గురైయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఆమె త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు.

Maha Kumbh: కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్‌ జాబ్స్‌ సతీమణి..!
Steve Jobs’ wife Laurene Powell
Follow us
Janardhan Veluru

|

Updated on: Jan 14, 2025 | 10:22 PM

యాపిల్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌ జాబ్స్‌ సతీమణి లారీన్‌ పావెల్‌ జాబ్స్‌ కుంభమేళాలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారంనాడు వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న లారీన్.. సోమవారంనాడు ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్నారు. మంగళవారంనాడు కుంభమేళా రెండో రోజు ఆమె అస్వస్థతకు గురైయ్యారు. అనారోగ్యం కారణంగా మంగళవారంనాడు ఆమె త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించలేకపోయారు.  కొత్త వాతావరణం కారణంగా ఆమె అలెర్జీకి గురైయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక ఆమె త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు. ప్రస్తుతం తాము ఏర్పాటు చేసిన శిబిరంలో ఆమె చికిత్స తీసుకుంటున్నట్లు నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్‌ స్వామి కైలాసానంద గిరి మహరాజ్‌ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.

ఆమె తన పేరును కమలగా మార్చుకున్నట్లు కైలాసానంద గిరి మహరాజ్‌ పేర్కొన్నారు. అత్యంత సాధారణంగా ఆమె ఉంటున్నారని.. తమ పూజా కార్యక్రమంలోనూ పాల్గొన్నారని తెలిపారు. జనవరి 20న జరిగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 15న బయలుదేరి వెళ్తారని వెల్లడించారు. అప్పటి వరకు ఆమె తమ శిబిరంలోనే ఉంటారని తెలిపారు.

కుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చిన స్టీవ్ జాబ్స్ సతీమణి

కుంభమేళాలో పాల్గొనేందుకు దేశ నలుమూలలకు చెందిన భక్తులతో పాటు విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా సోమవారం ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మహా కుంభమేళాలో 40 కోట్లకు పైగా భక్తులు పాల్గొంటారని అంచనావేస్తున్నారు. తొలిరోజు దాదాపు 1.65 కోట్ల మంది భక్తులు నదీజలాల్లో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. రెండో రోజు 3-4 కోట్ల మంది పవిత్ర స్నానాలు అచరించి ఉంటారని అంచనా.