రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. హైవేపై స్పీడ్‌గా కారు నడిపాడు.. ఆ తర్వాత సీన్ ఇది..!
గతకొంతకాలంగా రీల్స్ పిచ్చోళ్లు రెచ్చిపోతున్నారు. ఫేమస్ అవ్వడం కోసం.. పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నారు. అంతేకాదు రెప్పపాటులో ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా రీల్స్ చేయబోయిన ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మధ్యప్రదేశ్‌లో జరిగిన హృదయ విదారక ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ముగ్గురు యువకులు కారులో ప్రయాణిస్తూ.. రీలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వారి స్నేహితుడు పీయూష్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన 2025 జనవరి 15వ తేదీ రాత్రి జరిగిందని కోలార్ పోలీసులు తెలిపారు. భోపాల్‌లోని కోలార్ ప్రాంతంలో పలాష్ గైక్వాడ్ అనే యువకుడు నివసిస్తున్నారు. అతను తన స్నేహితులు వినీత్, పీయూష్‌లతో కలిసి ఇనాయత్‌పూర్ ప్రాంతానికి కారులో వెళ్లాడు. ఈ క్రమంలోనే ముగ్గురు యువకులు మొబైల్ ఫోన్లతో రీళ్లు చేయడం ప్రారంభించారు. రీలు తీస్తుండగా కారు అదుపు తప్పి ఇనాయత్‌పూర్ కాలువలో పడింది.
ఈ ప్రమాదంలో పలాష్, వినీత్ అక్కడికక్కడే మృతి చెందారు. పీయూష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పీయూష్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. మృతులు పలాష్, వినీత్‌లుగా పోలీసులు గుర్తించారు. యువకులిద్దరూ పీడబ్ల్యూడీలో గ్రేడ్ 4 ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఇద్దరినీ కారుణ్య ప్రాతిపదికన నియమించారు. గాయపడిన పీయూష్ అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కారు అద్దాలు పగలగొట్టి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హమీదియా ఆస్పత్రికి తరలించారు. పీయూష్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయపడిన పీయూష్ వాంగ్మూలాన్ని నమోదు చేయలేమని పోలీసులు తెలిపారు. అతను ఇంకా చికిత్స పొందుతున్నాడని, స్పృహలోకి వచ్చాక అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కారు ప్రమాద సమయంలో యువకుడు ఎలాంటి నిర్లక్ష్యం చేశాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో రీల్స్ చేయాలనే అభిరుచి ఎంత ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందో అర్థమవుతుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




