వామ్మో..! చేసింది కానిస్టేబుల్ ఉద్యోగం.. ఇల్లంతా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ వెండి, బంగారం!
తండ్రి మరణంతో రవాణా శాఖలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం సంపాదించాడు. ఏడేళ్ల పాటు రవాణా శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించాడు. వీఆర్ఎస్ తీసుకుని రియల్ ఏస్టేట్ రంగంలో స్థిరపడ్డారు. అనుమానం వచ్చిన అధికారులు అతని ఇల్లు, కార్యాలయాలపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. దీంతో బయటపడుతున్న అక్రమాల పుట్టను చూసి అధికారులు షాక్ అయ్యారు. కిలోల కొద్దీ వెండి, బంగారం, ఎటు చూసిన నోట్ల కట్టలే కనిపించాయి.
మాజీ ఆర్టీఓ కానిస్టేబుల్ ఇంటిపై లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో కోట్లాది రూపాయల నగదు, భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. తీసేకొద్దీ బయటపడుతున్న అక్రమాల పుట్టను చూసి లోకాయుక్త బృందం షాక్ అయ్యింది. అర్థరాత్రి వరకు కొనసాగిన సోదాల్లో రూ.2.85 కోట్ల నగదు, రూ.50 లక్షల విలువైన 60 కిలోల వెండి, బంగారు వజ్రాభరణాలు, 4 ఎస్‌యూవీ కార్లు, పలు ఆస్తుల పత్రాలు, 7 నోట్ల లెక్కింపు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఆర్టీఓ కానిస్టేబుల్ సౌరభ్ శర్మకు చెందినవిగా అధికారులు గుర్తించారు.
మొత్తం సోదాల సమయంలో, వెండి కడ్డీలు, పెద్ద నోట్ల లెక్కింపు యంత్రాలు చూసిల లోకాయుక్త బృందం చాలా ఆశ్చర్యానికి గురైంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ రవాణా శాఖ మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మపై వచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త పోలీసులు గురువారం(డిసెంబర్ 19) ఉదయం భోపాల్‌లోని ఇ-7 అరేరా కాలనీలో ఉన్న ఆయన ఇల్లు, కార్యాలయంపై దాడులు చేశారు. సౌరభ్ శర్మ మధ్యప్రదేశ్ రావాణా శాఖలో ఏడేళ్లు పనిచేసిన తర్వాత వీఆర్ఎస్ తీసుకున్నారు.
ఇంట్లో తల్లి, భార్య, పిల్లలు మాత్రమే ఉంటున్నారు. జైపురియా స్కూల్ ఫ్రాంచైజీకి సంబంధించి సౌరభ్ ముంబై వెళ్లాడని తల్లి తెలిపింది. మరోవైపు సౌరభ్ శర్మపై హవాలా కోణంలో దర్యాప్తు చేస్తోంది. లోకాయుక్త బృందం తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో 4 లగ్జరీ వాహనాలు దొరికాయి. వీటిలో ఫోర్స్ కంపెనీ వ్యాన్ కూడా ఉంది. వాహనాల తనిఖీలో వ్యాన్‌లో బ్యాగ్ కనిపించగా అందులో రూ.82 లక్షల నగదు లభించింది. దీంతో పాటు ఇంటి అల్మారాల్లో రూ.1.15 కోట్ల నగదు, కార్యాలయంలోని రూ.1.70 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో బంగారు, వజ్రాభరణాలు, 60 కిలోల వెండి కడ్డీలు లభ్యమయ్యాయి. సౌరభ్ తండ్రి ఆర్కే శర్మ ప్రభుత్వ వైద్యుడిగా సేవలదించారు. 2015లో మరణించిన తర్వాత సౌరభ్ శర్మకు రవాణా శాఖలో కారుణ్య నియామకం లభించింది. ఏడేళ్ల సర్వీసు తర్వాత సౌరభ్ వీఆర్‌ఎస్ తీసుకుని నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు.
చాలా మంది ప్రముఖులతో పరిచయం ఏర్పడిన తర్వాత మాత్రమే సౌరభ్ ఇంత తక్కువ సమయంలో డిపార్ట్‌మెంట్ నుండి VRS తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. సౌరభ్‌కు చెందిన అనేక ఆస్తుల పత్రాలను కూడా బృందం కనుగొంది. వాటిని దర్యాప్తు చేస్తున్నారు. రవాణా శాఖ మాజీ కానిస్టేబుల్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో బంగారం, వెండి, నగదు దొరకడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..