బాబోయ్.. అంతుచిక్కని వ్యాధితో 8 మంది మృతి.. ఎక్కడోకాదు మన దేశంలోనే!
నాలుగేళ్ల క్రితం మరణ మృదంగం మోగించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పటికీ ప్రపంచ దేశాలు కోలుకోలేదు. నాటి విధ్వంశాన్ని పూర్తిగా మరవకముందే తాజాగా జమ్మూకశ్మీర్ లో మరో వింత వ్యాధి ప్రబలింది. ఇప్పటికే ఈ అంతుచిక్కని వ్యాధి బారీన పడి ఎనిమిది మంది వరుసగా మృతి చెందారు. వీరిలో ఏడుగురు 14 ఏళ్లలోపు చిన్నారులు కావడం విశేషం..
రాజౌరి, డిసెంబర్ 20: జమ్మూ కాశ్మీర్‌లో గుర్తుతెలియని వ్యాధితో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని రాజౌరీ జిల్లాలో అంతుబట్టని వ్యాధితో ఎనిమిది మంది మరణించారు. ఇక్కడి ఆసుపత్రిలో బుధవారం మరో చిన్నారి ఈ అంతుబట్టని వ్యాధికి బలైంది. దీంతో ఒక్కసారిగా అక్కడి ప్రభుత్వం ఉలిక్కిపడింది. ప్రభావిత గ్రామంలో కేసులు, మరణాలపై దర్యాప్తులో సహాయం చేయడానికి కేంద్ర నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అంతుచిక్కని వ్యాధిని గుర్తించడానికి బయోసేఫ్టీ లెవల్ 3 (BSL-3) మొబైల్ లాబొరేటరీతో రాజౌరికి వచ్చారు.
స్థానికంగా నివాసం ఉంటున్న మహ్మద్ రఫీక్ అనే వ్యక్తి కుమారుడు అష్ఫాక్ అహ్మద్ (12) జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC)లో 6 రోజుల పాటు చికిత్స పొందుతూ బుధవారం మరణించాడని అధికారులు తెలిపారు. బాలుడిని మెరుగైన వైద్యం కోసం చండీగఢ్‌కు తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మహ్మద్ రఫీక్ కుమారుడు అష్ఫాక్ తమ్ముళ్లు ఇష్తియాక్ (7), నాజియా (4) కూడా గత గురువారం మరణించారు. దీంతో ముగ్గురు కుమారులను రోజుల వ్యవధిలోనే అంతు చిక్కని మహమ్మారి పొట్టన పెట్టుకుందని తల్లిదండ్రులు విలపించారు.
బుధవారం అష్ఫాక్ మృతితో.. కోట్రంక తహసీల్‌లోని బాధాల్ గ్రామంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. డిప్యూటీ కమీషనర్ (CG) రాజౌరి, అభిషేక్ శర్మ, బాధాల్ గ్రామంలోని పరిస్థితిని అంచనా వేయడానికి తాజాగా కోట్రంక గ్రామాన్ని సందర్శించారు. ఇదే గ్రామంలో 14 ఏళ్లలోపు వయసున్న ఆరుగురు పిల్లలతో సహా ఏడుగురు గుర్తు తెలియని అనారోగ్యంతో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ గ్రామంలో సంభవిస్తున్న వరుస మరణాలపై దర్యాప్తుకు బయోసేఫ్టీ లెవల్ 3 (BSL-3) మొబైల్ లాబొరేటరీని కేంద్ర ప్రభుత్వం రాజౌరికి పంపించింది. ఇక్కడి వరుస మరణాలపై దర్యాప్తు చేయడంలో యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్‌కు సహాయం చేయడానికి కేంద్ర నిపుణుల బృందం కూడా ఏర్పాటు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.