Watch Video: చుట్టమల్లేవచ్చి డోర్‌బెల్‌ కొట్టిన అగంతకుడు.. మహిళ తలుపు తెరవగానే చేతివాటం! ఏం చేశాడంటే

హైదరాబాద్ నగరంలో పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. నేరుగా ఇంటికే వచ్చి డోర్ బెల్లు కొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడలో 4 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడో అగంతకుడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మరింది. రోడ్లపైనే కాకుండా ఇళ్లలోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతుందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది..

Follow us
Srilakshmi C

|

Updated on: Dec 19, 2024 | 7:16 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 19: ఓ కేటుగాడు ఇంటికి చుట్టమొచ్చినట్లు వచ్చాడు. ఆనక ఇంటి ముందు నిలబడి డోర్‌ బెల్‌ పలుమార్లు కొట్టాడు. అతంలో ఓ ఇల్లాలు వచ్చి డోర్‌ తెరవగానే మాట కలిపాడు. ఆవిడ ఇంట్లోకి ఆహ్వానించింది. అంతే.. ఇంట్లో రెండడుగులు వేశాడో లేదో.. మహిళ మెడలో బంగారు గొలుసు దొరకబుచ్చుకుని ఉడాయించాడు. నార్సింగిలోని హైదర్శ కోట సన్‌సిటీలో పట్టపగలు ఈ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్శ కోట సన్‌ సిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌ మొదటి అంతస్తులో గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్‌ ధరించి వచ్చాడు. ప్లాట్‌ ముందు నిలబడి డోర్ బెల్ కొట్టాడు. కాసేపటికి తలుపులు తెరిచిన కొద్దిసేపటికే మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసును సదరు వ్యక్తి ఎత్తుకెళ్లాడు. దీంతో మహిళ లబోదిబోమంటూ దొంగ వెంట పరుగులు తీసింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో పట్టపగలే దొంగలే ఇలా ఇళ్లలోకి చొరబడి దాడులకు పాల్పడుతుంటే మాకిక భద్రత ఎలా ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.