సవతి తల్లి రూపంలో పిశాచి.. ఆరున్నరేళ్ల చిన్నారి దారుణ హత్య! అసలేం జరిగిందంటే
పుట్టీపుట్టగానే తల్లి మరణించడంతో తండ్రి వేరొక అమ్మను ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో బోలెడంత సంబరంతో అమ్మా.. అమ్మా.. అంటూ ఆమె చూట్టూ తిరగసాగింది ఆరున్నరేళ్ల చిన్నారి. కానీ ఆ కొత్త అమ్మ మాత్రం సవతి కూతురిని పురుగుకన్నా హీనంగా చూడసాగింది. ఎలాగైన సవతి కూతురిని వదిలించుకోవాలని కుట్రపన్నింది..
కొచ్చి, డిసెంబర్ 20: లోకం తెలియని ఆ చిన్నారి పుట్టీపుట్టగానే తల్లిదూరమైంది. తల్లిలేని బిడ్డ ఆలనా పాలనా చూస్తూ కడుపులో పెట్టి చూసుకుంటుందని మరో పెళ్లి చేసుకుని సవతి తల్లిని ఇంటికి తీసుకువచ్చాడు తండ్రి . కానీ కొత్తగా వచ్చిన అమ్మలో మాత్రం అమ్మతనం ఇసుమంతైనా లేదు. సవతి బిడ్డను పురుగుకన్నా హీనంగా చూడసాగింది. అంతటితో ఆగకుండా మాటలు కూడా సరిగ్గారాని ఆరున్నరేళ్ల చిట్టితల్లిని పొట్టనబెట్టుకుంది. ఈ దారుణ ఘటన కేరళలోని కొత్తమంగళంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
కొత్తమంగళంలో నెల్లికుజి మొదటి వార్డులోని పుత్తుపాలెం ప్రాంతంలో అద్దె ఇంట్లో అజాజ్ ఖాన్ అనే వ్యక్తికి కూతురు పుట్టిన కొన్నాళ్లకు భార్య చనిపోయింది. అనంతరం అజాజ్ ఖాన్ మరో వివాహం చేసుకున్నాడు. వీరికి మరో పాప జన్మించింది. రెండో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వీరి జీవనం సాఫీగా సాగిపోతుంది. కానీ మొదటి భార్య కుమార్తె అయిన ముస్కాన్ (ఆరున్నరేళ్లు) పట్ల సవతి తల్లి తొలి నుంచి చిన్నచూపు చూసేది. కానీ భర్త ముందు మాత్రం ముస్కాన్‌ను ప్రేమగా చూసుకుంటున్నట్లు నటించేది. ఈ క్రమంలో ఎలాగైనా ముస్కాన్‌ను ఒదిలించు కోవాలని భావించిన సవతి తల్లి దారుణానికి పాల్పడింది.
గురువారం రాత్రి చిన్నారి ముస్కాన్ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించింది. అజాజ్ ఖాన్, అతని భార్య ఒక గదిలో పడుకోగా, వారి ఇద్దరు పిల్లలు మరొక గదిలో పడుకున్నారు. ముస్కాన్‌తో పాటు చిన్న కూతురు కూడా కలిసి నిద్రించింది. కానీ మరుసటి రోజు ఉదయం ముస్కాన్ తన గదిలో శవమై కనిపించడంతో తండ్రి అజాజ్ ఒక్కసారిగా షాకయ్యాడు. పోస్టుమార్టం రిపోర్టులో చిన్నారిని హత్య చేసినట్లు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సవతి తల్లిని అనుమానించారు. తమదైన శైలిలో విచారించగా చివరకు ఆమె నేరం అంగీకరించింది. చిన్నారిని సవతి తల్లే గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల ముందు నేరం అంగీకరించింది. తన సొంత కూతురు కాదనే కారణంతో చిన్నారిని వదిలించుకునేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది. హత్య జరిగిన సమయంలో చిన్నారి తండ్రి అజాజ్ ఖాన్ ఇంట్లో లేడని, ఇదే అదనుగా చిన్నారిని గొంతు నులిమి హత్య చేశానని వెల్లడించింది. దీంతో పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.