BJP Target 370: బీజేపీ లక్ష్యం నెరవేరాలంటే మహారాష్ట్ర కీలకం.. ఎందుకంటే..?

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస సంఖ్యా బలం (మ్యాజిక్ ఫిగర్) 272. మొత్తం 543 మంది సభ్యుల లోక్‌సభలో ఈ సంఖ్య సాధించిన పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల్గుతుంది. కానీ వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు మరో 100 స్థానాలు అధికంగా సాధించాలని టార్గెట్ పెట్టుకుంది.

BJP Target 370: బీజేపీ లక్ష్యం నెరవేరాలంటే మహారాష్ట్ర కీలకం.. ఎందుకంటే..?
Bjp's Target 370 (pm Modi)
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Apr 05, 2024 | 12:35 PM

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస సంఖ్యా బలం (మ్యాజిక్ ఫిగర్) 272. మొత్తం 543 మంది సభ్యుల లోక్‌సభలో ఈ సంఖ్య సాధించిన పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల్గుతుంది. కానీ వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు మరో 100 స్థానాలు అధికంగా సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. ఆ పార్టీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సాధించాల్సిన సీట్ల సంఖ్యను కూడా 400 + (ప్లస్)గా నిర్దేశించుకుంది.

మొదటి పర్యాయం (2014) బీజేపీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ కంటే 10 సీట్లు అదనంగా గెలుపొందగా.. 2019లో సొంతంగానే 303 సీట్లు సాధించి పురోగతిని ప్రదర్శించింది. ఆ వెంటనే “ఆర్టికల్ 370” రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న కమలదళం, 2024లో “టార్గెట్ 370” అంటూ ముందుకెళ్తోంది. ఢిల్లీని గెలవాలంటే దేశంలోనే అత్యధిక పార్లమెంట్ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్ (80)తో పాటు దాన్ని ఆనుకున్న రాష్ట్రాల్లో మెజారిటీ స్కోర్ చేస్తే చాలు. ఈ విషయంలో బీజేపీకి ఎలాంటి అనుమానం కూడా లేదు. యూపీలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడం, శరవేగంగా అభివృద్ధితో పాటు అయోధ్య రామమందిరం వంటి మతపరమైన భావోద్వేగపు అంశాలు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి.

ఇక హిందీ హార్ట్ ల్యాండ్‌గా పిలిచే హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో జార్ఖండ్, ఢిల్లీ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉండడం కూడా కలిసొచ్చే అంశమే. కానీ “టార్గెట్ 370″ని అందుకోడానికి ఈ రాష్ట్రాల్లో సాధించే మెజారిటీ సరిపోదు. అది సాధించాలంటే యూపీ తర్వాత అత్యధిక స్థానాలు (48) కలిగిన మహారాష్ట్ర అత్యంత కీలకంగా మారింది. గత ఎన్నికల్లో మిత్రపక్షం శివసేనతో కలిసి పోటీ చేసి 48లో 41 సీట్లను కైవసం చేసుకుంది. ఆ తర్వాత మారిన పరిణామాలు పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎంత స్కోర్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

రెండేళ్లుగా ‘ఆపరేషన్ మహారాష్ట్ర’

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన పొత్తు ధర్మం ప్రకారం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా తన రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)తో చేతులు కలిపి ‘మహా వికాస్ అఘాడీ’ కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో ఖంగు తిన్న కమల దళపతులు తమ ‘ఆపరేషన్ మహారాష్ట్ర’ మొదలుపెట్టారు. పార్లమెంట్ సీట్ల పరంగా 2వ అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో పట్టు కోల్పోతే ప్రమాదమేనని భావించారు. శివసేనలో ఏక్‌నాథ్ షిండే తో తిరుగుబాటు చేయించి పార్టీని నిట్టనిలువుగా చీల్చిపడేశారు. ఆ చీలిక పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వ్యవస్థాపక కుటుంబానికి చెందిన ఉద్దవ్ థాక్రే చేతిలో ఒక వర్గం ఉండగా.. ఏక్‌నాథ్ షిండే చేతిలోని వర్గం బీజేపీతో కలిసింది.

అయితే ఈ చీలిక వర్గాల అసలు బలం ఎంతన్నది ఎన్నికల్లో పోటీ చేస్తే తప్ప తెలియదు. ఈ పరిస్థితుల్లో బీజేపీతో శివసేన చీలిక వర్గం మాత్రమే ఉంటే ‘మహా వికాస్ అఘాడీ’ని ఢీకొట్టడం అంత సులభం కాదని లెక్కలు వేసుకున్నారు. అంతే.. ఈసారి ఎన్సీపీపై గురి పెట్టారు. ఆ పార్టీ అధినేత శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్‌ను అస్త్రంగా మలిచి రెండు ముక్కలు చేశారు. బీజేపీ ఉన్న ఈ రెండు చీలిక వర్గాలే అసలైన పార్టీలంటూ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడం, ప్రజల్లోకి బాగా లోతుగా వెళ్లిపోయిన ఎన్నికల గుర్తులను కూడా ఈ చీలిక వర్గాలకే కేటాయించడం కమలనాథులకు కొంత సానుకూలాంశాలుగా మారాయి.

అయినా సరే.. బీజేపీ నాయకత్వం ఈ చీలికల కూటమిపై పూర్తి భరోసాను పెట్టలేకపోతోంది. ఎందుకంటే ధాక్రే లేని శివసేన, శరద్ పవార్ లేని ఎన్సీపీల బలంతో గతంలో సాధించిన సంఖ్యనైనా సాధించగలమా అన్న సందేహం అగ్రనాయకత్వంలో నెలకొంది. ప్రాంతీయ పార్టీల్లో వ్యవస్థాపక కుటుంబాలదే ఆధిపత్యం. వారిని కాదని చీలిపోయిన పార్టీలకు పెద్దగా బలం ఉండదు. ఇదే బీజేపీని ఆందోళనకు గురిచేస్తోంది.

తలనొప్పిగా మారిన సీట్ల సర్దుబాటు

ఇదిలా ఉంటే.. ఆ చీలిక పార్టీలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు కూడా కమలదళానికి ఓ తలనొప్పిగా మారింది. ఏప్రిల్ 19న జరగనున్న మొదటి విడత పోలింగ్ తేదీ సమీపిస్తున్నప్పటికీ.. ఇంకా కొన్ని సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా మొత్తం 48 సీట్లలో మూడు పార్టీలు కలిసి ఇంకా 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయి. ప్రత్యర్థి కాంగ్రెస్ సహా విపక్ష కూటమి కంటే ముందే, ఇంకా చెప్పాలంటే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయకముందే దాదాపు 200 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీకి మహారాష్ట్రలో పరిస్థితి మాత్రం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది.

కొలిక్కిరాని సీట్లలో థానే, ఉస్మానాబాద్, నాసిక్, సతారా, ముంబై సౌత్, రత్నగిరి-సింధుదుర్గ్, పాల్‌గఢ్ వంటివి ఉన్నాయి. ఉదాహరణకు సతారా నియోజకవర్గాన్ని బీజేపీ తన రాజ్యసభ సభ్యుడైన ఛత్రపతి శివాజీ వంశస్తుడు ఉదయన్‌రాజే భోసలేకు కేటాయిస్తామని హామీ ఇవ్వగా.. ఆ స్థానం తమకే కావాలని ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) గట్టిగా పట్టుబట్టింది. అనేక చర్చోపచర్చల అనంతరం ఎన్సీపీ తరఫున భోసలేనే అభ్యర్థిగా దించుతామని అజిత్ పవార్ మధ్యేమార్గంగా పరిష్కారాన్ని సూచిస్తే.. ఆ అభ్యర్థి అందుకు నిరాకరించారు. తాను పోటీ చేస్తే బీజేపీ టికెట్ మీదనే చేస్తానని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో సతారాకు బదులుగా నాసిక్ స్థానాన్ని ఎన్సీపీకి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించింది. అయితే నాసిక్ సిట్టింగ్ ఎంపీ (శివసేన) దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశం ఇంకా అపరిష్కృతంగానే ఉంది.

మరోవైపు ముఖ్యంత్రి ఏక్‌నాథ్ షిండే సొంత ఇలాఖా థానే విషయంలో బీజేపీ-శివసేన మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ స్థానాన్ని తన సన్నిహితుడు రవి పాఠక్‌కు ఇస్తానని ఏక్‌నాథ్ షిండే హామీ ఇవ్వగా, అక్కడ తమకు బలమైన క్యాడర్ బేస్ ఉందని బీజేపీ చెబుతోంది. సింధుదుర్గ్-రత్నగిరి నుంచి బీజేపీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను బరిలోకి దించాలని చూస్తుంటే.. సీఎం షిండే మాత్రం తన పార్టీకి చెందిన నేతకు ఇచ్చుకోవాలని చూస్తున్నారు. ఈ తరహాలో కూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో తలా ఒక దారి అన్న పరిస్థితి నెలకొంది. వీటిని ఎంత త్వరగా పరిష్కరించుకుని క్షేత్రస్థాయిలోకి దిగితే.. ఈ కూటమికి అంత ఎక్కువ అవకాశాలుంటాయి.

విపక్ష కూటమిలోనూ లుకలుకలే..!

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పార్టీల మధ్యనే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సారథ్యంలో ఉన్న విపక్ష కూటమిలో భాగంగా మహారాష్ట్రలో ఉన్న ‘మహా వికాస్ అఘాడీ’లో కూడా లుకలుకలు నెలకొన్నాయి. చాలా సీట్ల విషయంలో కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ థాక్రే వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్డీఏను ఢీకొట్టే క్రమంలో ప్రకాశ్ అంబేడ్కర్‌కు చెందిన ‘వంచిత్ బహుజన్ అఘాడీ’ (VBA)ని కలుపుకుందామనుకున్న ప్రయత్నాలు సైతం ముందుకు సాగడం లేదు. తమకు సీట్లు కేటాయించడంలో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ప్రకాశ్ అంబేడ్కర్ మిత్రపక్షాలపై విరుచుకుపడ్డం కూడా గమనార్హం.

ఈ పొత్తు సఫలమైతే.. వీబీఏ చేతిలోని దళిత ఓటుబ్యాంకు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే శక్తిగా మారుతుంది. ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ ఇరు పక్షాలు హోరాహోరీగా తలపడుతున్నప్పటికీ మిత్రపక్షాలతో సయోధ్య కుదరకపోవడమే రెండు వైపులా ఆందోళన కల్గిస్తోంది. బీజేపీ నిర్దేశించుకున్న ‘టార్గెట్ 370’ చేరుకోవాలంటే వీలైనంత త్వరగా కూటమి పొత్తులు, సీట్ల సర్దుబాటు ప్రక్రియను కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…