PM Modi 3.0: మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఎన్డీయే నేతలు..!

నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీయేలోని అన్ని భాగస్వామ్య పార్టీలు తమ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నాయి. మొదట మోదీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా, అన్ని పార్టీల నేతలు అంగీకరించారు.

PM Modi 3.0: మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఎన్డీయే నేతలు..!
Pm Modi 3
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 07, 2024 | 6:31 PM

నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీయేలోని అన్ని భాగస్వామ్య పార్టీలు తమ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నాయి. మొదట మోదీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా, అన్ని పార్టీల నేతలు అంగీకరించారు. ఆ తర్వాత సెంట్రల్ హాల్‌లో బీజేపీ, ఎన్డీఏ నేతలు, కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

ప్రసంగం ముగించిన వెంటనే, నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరారు. ఈ సందర్భంగా 15 మందికి పైగా ఎన్డీయే నేతలు మోదీ వెంట ఉన్నారు. మోదీతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లినవారిలో ఎన్డీయే నాయకులలో రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే, ప్రఫుల్ పటేల్, సుదేశ్ మహతో, అనుప్రియా పటేల్, హెచ్‌డి కుమారస్వామి, చిరాగ్ పాశ్వాన్ ఉన్నారు. కాగా, జూన్ 9న నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు మూడు ఎన్నికల్లో వచ్చిన సీట్లే ఈసారి వచ్చాయి. పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ 100 మార్కును దాటలేదు. విజయాన్ని ఎలా జీర్ణించుకోవాలో మాకు తెలుసునని మోదీ అన్నారు. సుపరిపాలనలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తామని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేస్తామన్నారు. దేశానికి ఎన్డీయేపైనే విశ్వాసం ఉంది. పెరిగిన భారతీయుల అంచనాలకు తగ్గట్టుగా పాలన అందిస్తామన్నారు. గత 10 సంవత్సరాల పని కేవలం ట్రైలర్ మాత్రమేనని, మరింత వేగంగా, విశ్వాసంతో దేశాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

సభలోని అన్ని పార్టీల ప్రతినిధులు నాకు సమానమేనని మోదీ అన్నారు. అందరూ కలిసి పనిచేశారు. కూటమి బలపడింది. అదే సమయంలో ప్రతిపక్షాలు గందరగోళం, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించారు. భారత్ పరువు తీసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయి. అయినప్పటికీ ఎన్డీయే విజయ తీరాలకు చేరిందన్నారు నరేంద్ర మోదీ. ఇక జూన్ 6న నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు, దీనికి పలువురు ప్రపంచ నేతలు హాజరుకానున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…