Lakhimpur Kheri case: లఖీంపూర్‌ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్.. యూపీ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు!

లఖీంపూర్‌ ఖేరి ఘటనపై యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన నిందితుడిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని కీలక వ్యాఖ్యలు.

Lakhimpur Kheri case: లఖీంపూర్‌ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్.. యూపీ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు!
Lakhimpur Kheri Case
Follow us

|

Updated on: Nov 08, 2021 | 4:29 PM

Supreme Court on Lakhimpur Kheri case: లఖీంపూర్‌ ఖేరి ఘటనపై యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన నిందితుడిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేసింది. లఖీంపూర్‌ ఖేరి ఘటనపై జరుగుతున్న దర్యాప్తుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆశించిన విధంగా కేసు విచారణ జరగడం లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పోలీసులు ఇప్పటివరకు ప్రధాన నిందితుడు ఆశిశ్‌ మిశ్రా కాల్‌డేటాను మాత్రమే సేకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే మిగతా నిందితుల కాల్‌డేటాను కూడా సేకరించాలని ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్‌ ఖేరి ఘటనలో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కాన్వాయ్‌ దూసుకెళ్లిన ఘటనలో 8 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. సీబీఐకి ఈ కేసు విచారణను అప్పగించడం ఇష్టం లేదన్న సుప్రీంకోర్టు ఇద్దరు హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలతో విచారణకు ఆలోచిస్తునట్టు తెలిపింది. 10 రోజుల గడువు ఇచ్చినప్పటికి యూపీ ప్రభుత్వం నుంచి నివేదిక అందలేదని, అందుకే ఇద్దరు రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిలతో ఈ ఘటనపై విచారణకు ఆలోచిస్తునట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ తెలిపారు. ఈ ఘటనపై నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లను కలిపి విచారించడం.. ప్రధాన నిందితుడిని కాపాడేందుకే అన్న అనుమానాలు కలుగుతున్నాయని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

యూపీ హైకోర్టు కాకుండా పంజాబ్‌ హైకోర్టు రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు రాకేశ్‌కుమార్‌ , జస్టిస్‌ రంజిత్‌సింగ్‌తో లఖీంపూర్‌ ఖేరి ఘటనపై దర్యాప్తు జరిపితే బాగుంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే, రెండు ఎఫ్‌ఐఆర్‌లను విడిగా విచారించేందుకు ప్రయత్నించినా.. సాక్షులు రెండు ఘటనల గురించి ప్రస్తావించడంతో విడిగా విచారించడం క్లిష్టమవుతోందని యూపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది వెల్లడించారు. అలాగే, ఆ రోజు మరణించిన జర్నలిస్టు.. కేంద్రమంత్రి తనయుడి బృందంలోని వ్యక్తో కాదో తెలియకపోవడం ఈ పరిస్థితికి కారణమన్నారు.

ఇదిలావుంటే, గత నెల ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌లో రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోన్న సమయంలో కేంద్ర మంత్రి తనయుడు ఆశిశ్ మిశ్రా వాహన శ్రేణి వారి మీద నుంచి దూసుకెళ్లింది. దాంతోపాటుగా అక్కడ జరిగిన ఘటనల్లో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించారు. వారిలో ఒక జర్నలిస్టు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆశిశ్‌ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క ఈ కేసు దర్యాప్తులో యూపీ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించడం లేదని సుప్రీం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఆ రాష్ట్రానికి చురకలు అంటించింది.

Read Also….  CM KCR: “ఆ పథకానికి రూపాయి ఇచ్చినట్టు నిరూపిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేస్తా”