Rajasthan: కుంభలగఢ్‌లో విద్యా ఆలోచన సమావేశం.. జ్ఞానానంద స్వామి ప్రత్యేక సందేశం
రాజస్థాన్‌లోని కుంభలగఢ్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల ఆలోచన సమావేశం జరిగింది. విద్యలో నాణ్యత, విలువలు, కొత్త ఆవిష్కరణలపై నిపుణులు చర్చించారు. కాగా అక్షరధామ్ నుంచి విచ్చేసిన పూజ్య డా. జ్ఞానానంద స్వామి ప్రత్యేకంగా విలువలతో కూడిన విద్య అవసరాన్ని వివరించారు.

రాజస్థాన్ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో కుంభలగఢ్‌లోని ది కుంభా రెసిడెన్సీలో రెండు రోజులపాటు జరిగిన ‘థింక్ ట్యాంక్’ చర్చా శిబిరం విజయవంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విద్యావేత్తలు, నిపుణులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ అక్షరధామ్ నుంచి విచ్చేసిన పూజ్య డా. జ్ఞానానంద స్వామి ప్రత్యేక అతిథిగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. నూతన విద్యలో విలువల ప్రాముఖ్యత గురించి ప్రధానస్వామి మహారాజ్, మహంత్ స్వామి మహారాజ్ అభిప్రాయాలను వివరించిన ఆయన.. విద్యతో పాటు చరిత్ర, సేవ, ఆత్మనిర్భరత, సద్గుణాలు అనే అంశాలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యామంత్రి మదన్ దిలావర్‌ను కలిసిన డా. జ్ఞానానంద స్వామి, బీఏపీఎస్ సంస్థ నిర్వహిస్తున్న IPDC (Integrated Personality Development Course), ‘చలో ఆదర్శ్ బనే’ కార్యక్రమాల గురించి వివరించారు. పూజ్య సర్వనివాస్ స్వామి విద్యామంత్రికి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. సమావేశంలో విద్యామంత్రి మదన్ దిలావర్ మాట్లాడుతూ.. విద్య ఏ దేశానికైనా ఆత్మవంటిదని వ్యాఖ్యనించారు. దేశానికి బాధ్యతగల పౌరులు తయారవ్వాలంటే విద్యార్థులకు సంస్కారాలు, నైతికత, విలువలతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో విద్యామంత్రితో పాటు IAS విశ్వమోహన్ శర్మ, జాయింట్ సెక్రటరీ హరీష్ లడ్డా, కుంభలగఢ్ MLA సురేందర్ సింగ్ రాఠోడ్, గుజరాత్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు సెక్రటరీ ఆర్.ఆర్. వ్యాస్, డా. కర్నైల్ సింగ్, IAS పవన్ జైమిన్, IAS కృష్ణ శర్మ, IAS కృష్ణ కునాల్, ఢిల్లీ విద్యా–సంస్కృతి ఉత్థాన్ న్యాస్ జాతీయ కార్యదర్శి డా. అతుల్ కోఠారి, IAS సీతారామ్ జాట్, RSCERT డైరెక్టర్ శ్రీమతి శ్వేతా ఫగడియా, NCERT విభాగాధిపతి శరద్ సిన్హాతో పాటు అనేకమంది విద్యావేత్తలు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




