ఎయిర్ పోర్ట్‌లో ఓ వ్యక్తి సరదాగా చెప్పిన మాట అతనికి ఎన్ని కష్టాలు తెచ్చిందో చూడండి!
కోజికోడ్‌కు చెందిన రిషద్ అనే వ్యక్తి కొచ్చి విమానాశ్రయంలో తన లగేజీ బరువు ఎక్కువగా ఉందని చెప్పినందుకు, కోపంతో “నా బ్యాగులో బాంబు ఉందేమో” అని అన్నాడు. దీంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి, అతన్ని పోలీసులకు అప్పగించారు. బాంబు పుకార్లు వ్యాప్తి చేసినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. ఒకరోజు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. విమానాశ్రయంలో బాంబు అనే పదం ఉపయోగించడం నేరమని పోలీసులు తెలిపారు.

మన నోరు ఎంత అదుపులో ఉంటే మనం అంత బాగుంటాం.. ఏంటి నీతి వ్యాక్యాలు చెబుతున్నారు అనుకుంటున్నారా? ఈ మాట ఓ వ్యక్తి విషయంలో వంద శాతం పనిచేస్తోంది. ఎందుకంటే.. ఎయిర్ పోర్ట్‌లో మరికొద్ది నిమిషాల్లో విమానం ఎక్కి వెళ్లాల్సిన వ్యక్తి ఏకంగా జైలు పాలయ్యాడు. అందుకు కారణం అతను సరదాగా అన్న ఒక్క మాట. కోజికోడ్‌లోని పయ్యోలికి చెందిన రిషద్ అనే వ్యక్తి బుధవారం సాయంత్రం కొచ్చి ఎయిర్ పోర్ట్ నుంచి కౌలాలంపూర్‌కు వెళ్లాల్సింది. అందుకోసం బ్యాగులంతా మంచి సర్దుకొని ఎయిర్ పోర్ట్‌కు వచ్చాడు. కానీ, అతని క్యాబిన్ లగేజ్ బరువు ఎక్కువగా ఉందని భద్రతా సిబ్బంది చెప్పడంతో.. అంత బరువు ఏముంది.. బహుషా నా బ్యాగ్‌లో బాంబు ఉందేమో అని అన్నాడు.
ప్రతిసారి లగేజ్ ఓవర్ వెయిట్ ఉందని చెకింగ్ సిబ్బంది అంటున్నారే కోపం, అసహనంతో అతను బాంబు ఉంది అనే మాట అన్నాడు. అంతే భద్రతా సిబ్బంది వెంటనే అలెర్ట్ అయిపోయిరు. అతని బ్యాగు మొత్తం వెతికారు. బాంబు దొరకలేదు. వాళ్లకు చిర్రెత్తుకొచ్చింది. రూల్స్ ప్రకారం అతని మొత్తం లగేజ్‌ను సెర్చ్ చేసి, బాంబు ఉందని అబద్ధం చెప్పి, భద్రతా సిబ్బంది పనులకు ఆటంకం కలిగించినందుకు అతన్ని పోలీసులకు అప్పగించారు. కేరళా పోలీసులు రిషద్‌ను అదుపులోకి తీసుకొని నెడుంబస్సేరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాంబు పుకార్లు వ్యాప్తి చేసినందుకు అతనిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 353(3) కింద, అలాగే భద్రతా సిబ్బందిని తప్పుదారి పట్టించిన కారణంగా కేరళా పోలీస్ చట్టం 118(బీ) కింద రిషద్‌పై కేసు నమోదు చేశారు.
దీంతో ఒక రోజు రిషద్ జైల్లో ఉండాల్సి వచ్చింది. గురువారం బెయిల్‌పై విడుదలయ్యాడు రిషద్. భద్రతా సిబ్బందికి కాస్త ఓపికగా సరైన సమాధానం చెప్పి ఉంటే హ్యాపీగా మలేషియా వెళ్లిపోయేవాడు. కానీ ఫ్రష్టేషన్‌లో నోరు జారి జైలు పాలయ్యాడు. అయితే బాంబు అనే పదం ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో పలకడం కూడా నేరమేనని భద్రతా సిబ్బంది చెబుతున్నారు. రిషద్ అలా అన్నందుకే రూల్స్ ప్రకారం అన్ని బ్యాగులు వెతకాల్సి వచ్చిందని, అయితే రిషద్ కారణంగా మలేషియా వెళ్లాల్సిన విమానం ఏమి రద్దు కాలేదు. టైమ్ ప్రకారం ఆ విమానం వెళ్లిపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




